Air India: విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే మీకు బంపర్ ఆఫర్
Air India: విమాన ప్రయాణికులకు ఎయిరిండియా తీపి కబురు అందించింది.
Air India: విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా..? అయితే మీకు బంపర్ ఆఫర్
Air India: ఫ్లైట్ జర్నీ అంటేనే జేబులు ఖాళీ అయిపోతాయనే భయం చాలామందిలో ఉంటుంది. అందులోనూ గంట, గంటన్నర ప్రయాణానికి కూడా భారీగా టికెట్ రేట్లు పెడుతుంటారు. అయితే, ఇలాంటి షార్ట్ జర్నీలు చేసే వారికోసం టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఒక అదిరిపోయే తీపి కబురు చెప్పింది. విమానంలో మాకు భోజనం వద్దు అనుకునే ప్రయాణికులకు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ప్రయాణించేలా సరికొత్త బేసిక్ ఫేర్ కేటగిరీని ప్రవేశపెట్టింది.
ఎయిరిండియా ఎకానమీ క్లాస్‌లో ఇప్పటివరకు మూడు రకాల కేటగిరీలు ఉండేవి. అవి.. వాల్యూ,క్లాసిక్, ఫ్లెక్స్. ఇప్పుడు వీటికి అదనంగా నాలుగో కేటగిరీగా ఈ బేసిక్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. సాధారణ ఎకానమీ టికెట్ ధరలతో పోలిస్తే ఈ బేసిక్ టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో సామాన్య ప్రయాణికులకు కూడా విమాన ప్రయాణం మరింత భారం కాకుండా సాగిపోనుంది. చాలావరకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్ ధర తగ్గిస్తే లగేజీ బరువుపై కోత విధిస్తుంటారు. కానీ ఎయిరిండియా ఇక్కడ ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చింది. టికెట్ ధర తగ్గించినప్పటికీ లగేజీ పరిమితుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
చెక్-ఇన్ లగేజ్ ఎప్పటిలాగే 15 కేజీల వరకు అనుమతి ఉంటుంది. క్యాబిన్ లగేజ్ 7 కేజీల వరకు వెంట తీసుకెళ్లవచ్చు. భోజనం లేకపోయినా... ప్రయాణికులకు ఉచితంగా టీ, కాఫీలను అందిస్తారు. ఈ సరికొత్త సదుపాయాన్ని ఎయిరిండియా ప్రస్తుతానికి దేశీయంగా, తక్కువ సమయం ప్రయాణించే కొన్ని ఎంపిక చేసిన రూట్లలో మాత్రమే పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది.
ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-ఉదయ్‌పూర్ సహా దేశవ్యాప్తంగా సుమారు 15 నుంచి 20 రూట్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే త్వరలోనే మరిన్ని రూట్లకు విస్తరించే అవకాశం ఉంది. తక్కువ దూర ప్రయాణాలకు అనవసరంగా ఫుడ్ కోసం డబ్బులు ఎందుకు దండగ అనుకునే ప్రయాణికులకు ఎయిరిండియా తెచ్చిన ఈ బేసిక్ ఐడియా నిజంగానే సూపర్ ఆప్షన్.




