Airtel: వారం రోజుల్లోనే జియో కథ తారుమారు!

Airtel: వారంలోనే సీన్ రివర్స్! జియో ప్లాట్‌ఫామ్స్‌ను వెనక్కి నెట్టి భారతదేశంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా భారతీ ఎయిర్‌టెల్ మళ్లీ అవతరించింది.

Gagan kumar
Published on: 7 Nov 2026 12:12 PM IST
Airtel
X

Airtel: వారం రోజుల్లోనే జియో కథ తారుమారు!

Airtel: భారతీయ టెలికాం రంగంలో దిగ్గజాల మధ్య సాగుతున్న 'మార్కెట్ క్యాప్' వార్ ఆసక్తికరమైన మలుపు తిరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ దెబ్బకు తాత్కాలికంగా రెండో స్థానానికి పరిమితమైన భారతీ ఎయిర్‌టెల్, కేవలం వారం రోజుల వ్యవధిలోనే తిరిగి తన రెండో స్థానాన్ని దక్కించుకుని దండయాత్ర చేసింది.

ఇటీవలే స్టాక్ ఎక్స్చేంజీల్లోకి అడుగుపెట్టిన జియో ప్లాట్‌ఫామ్స్, ఇష్యూ ప్రైస్ రూ. 1,119 పై ఏకంగా 21 శాతం ప్రీమియంతో లిస్టయి సరికొత్త చరిత్ర సృష్టించింది. లిస్టింగ్ రోజే రూ. 12.50 లక్షల కోట్ల మార్కెట్ విలువను సాధించి, అప్పటివరకు మార్కెట్ విలువ పరంగా రెండో స్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టింది.

ఒక దశలో జియో మార్కెట్ క్యాప్ రూ. 13.20 లక్షల కోట్లకు కూడా చేరింది. అయితే, ఆ ఆనందం జియోకు ఎక్కువ రోజులు నిలవలేదు. లిస్టింగ్ తర్వాత గరిష్ఠ స్థాయిలను తాకిన జియో షేర్లు క్రమంగా పతనమవుతూ వచ్చాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్ షేర్లు మాత్రం రాకెట్‌లా దూసుకెళ్లాయి.

నవంబర్ 6 నాటి ట్రేడింగ్ సెషన్‌లో ఎయిర్‌టెల్ షేరు 2.45 శాతం పెరిగి రూ. 2,107.20 వద్ద ముగిసింది. దీంతో ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ ఏకంగా రూ. 13.14 లక్షల కోట్లకు చేరింది. అదే సమయంలో జియో షేరు 1.04 శాతం తగ్గి రూ. 1,403 కి పడిపోవడంతో దాని వాల్యుయేషన్ రూ. 12.95 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో భారతీ ఎయిర్‌టెల్ మళ్లీ భారతదేశంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది.

గత 5 రోజుల్లో ఎయిర్‌టెల్ షేరు 6 శాతం వరకు పెరగడానికి ప్రధాన కారణం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదు చేసిన ఆకట్టుకునే ఫలితాలే. గతేడాది క్యూ2లో రూ. 6,791.6 కోట్లుగా ఉన్న లాభం ఈసారి ఏకంగా రూ. 8,887.5 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన రూ. 60,878 కోట్లుగా నమోదైంది. గతంలో రూ. 256 గా ఉన్న ARPU ఈ త్రైమాసికంలో రూ. 271 కి పెరిగింది.

ప్రస్తుతం రూ. 17.83 లక్షల కోట్ల మార్కెట్ వాల్యుయేషన్‌తో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, దాని తర్వాతి స్థానంలో రూ. 13.14 లక్షల కోట్లతో భారతీ ఎయిర్‌టెల్ నిలిచింది. మూడో స్థానంలో రూ. 12.95 లక్షల కోట్లతో జియో ప్లాట్‌ఫామ్స్ ఉంది. తల్లి కంపెనీ , అనుబంధ సంస్థల మధ్య భారతీ ఎయిర్‌టెల్ తన జెండాను పాతడం టెలికాం రంగంలో విశేషంగా మారింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.