Anoop Bagchi: నెలకు రూ.3కోట్లు.. HDFC బ్యాంక్ కొత్త బాస్ శాలరీ తెలిస్తే షాకవ్వాల్సిందే
Anoop Bagchi: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనూప్ బాగ్చీని నియమించింది.
Anoop Bagchi
Anoop Bagchi: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా అనూప్ బాగ్చీని నియమించింది. ఆయనకు ఏడాదికి ఏకంగా రూ.35.90 కోట్ల దాకా జీతం చెల్లించేందుకు బ్యాంక్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనకు వాటాదారులు ఆమోదం తెలిపితే, మన దేశంలోనే అత్యధిక ప్యాకేజీ తీసుకునే బ్యాంక్ అధిపతిగా అనూప్ బాగ్చీ చరిత్ర సృష్టిస్తారు.
ఈ వార్షిక ప్యాకేజీలో రూ.8.97 కోట్ల ఫిక్స్డ్ శాలరీతో పాటు ఆయన ప్రతిభ ఆధారంగా ఇచ్చే రూ.26.92 కోట్ల వేరియబుల్ పే కూడా భాగమై ఉంది. ఫిక్స్డ్ శాలరీలో బేసిక్ పే, ఇంటి అద్దె, కారు అలవెన్సులు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. వేరియబుల్ పే కింద రూ.8.88 కోట్లు నగదు రూపంలో లభిస్తే, మిగిలిన రూ.18.04 కోట్లు షేర్ ఆప్షన్ల రూపంలో అందనున్నాయి.
ఇవే కాకుండా మొదటిసారి సంస్థలో చేరుతున్నందుకు గాను రూ.7.35 కోట్ల వన్ టైమ్ జాయినింగ్ బోనస్ ఇచ్చేందుకు బ్యాంక్ అంగీకరించింది. ఈ జాయినింగ్ బోనస్‌ను, కంపెనీ ఇచ్చే షేర్లను కలిపి చూస్తే ఆయన మొత్తం ప్యాకేజీ విలువ ఏకంగా రూ.43.24 కోట్లకు చేరనుంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఆయన తీసుకున్న ప్యాకేజీతో పోలిస్తే ఇది దాదాపు 90 శాతం ఎక్కువ కావడం విశేషం.
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శశిధర్ జగదీషన్ రూ.28.65 కోట్ల వార్షిక వేతనం పొందారు. కొటాక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో అశోక్ వాస్వానీ రూ.17.24 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో సందీప్ బక్షి రూ.10.64 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నారు. ఈ ఇతర దిగ్గజ బ్యాంకర్లందరి కంటే అనూప్ బాగ్చీ పొందే ప్యాకేజీయే చాలా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 27 నుంచి మూడేళ్ల కాలపరిమితికి అనూప్ బాగ్చీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ నియామకానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే తన ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ జీతం ప్రతిపాదనపై వాటాదారుల ఈ-వోటింగ్ ప్రక్రియ జరుగుతోంది. కొత్త బాస్ ముందు రీటైల్ రుణాల వృద్ధి పెంచడం, లాభాల మార్జిన్ మెరుగుపరచడం వంటి ప్రధాన సవాళ్లు వేచి ఉన్నాయి.




