నంద్యాలలో ఏఎం గ్రీన్ 1,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు భూమి కేటాయించిన ఏపీ ప్రభుత్వం
నంద్యాలలో ఏఎం గ్రీన్ రూ.4,500 కోట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం 34 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
AM Green Energy
నంద్యాల జిల్లాలో ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టనున్న 1,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో 34 ఎకరాల 774 సెంట్ల భూమిని న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ)కు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జూలై 28న జారీ చేసిన జీవో ఎంఎస్ నెం.469 ప్రకారం, ఈ భూమిని మార్కెట్ విలువ ఎకరానికి రూ.5 లక్షల చొప్పున, మొత్తం రూ.1,73,87,000 విలువతో ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు ప్రాజెక్టు కోసం కేటాయించనున్నారు.
ఈ ప్రాజెక్టులో 700 మెగావాట్ల సౌర విద్యుత్, 300 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ మెగా ప్రాజెక్టుకు 2023లోనే శంకుస్థాపన జరిగింది. ప్రస్తుతం అవసరమైన అనుమతులు, నోడల్ మద్దతును ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ అందిస్తోంది.
భూమి కేటాయింపు ప్రతిపాదనను జూన్ 29న జరిగిన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశంలో పరిశీలించి అనుకూలంగా సిఫారసు చేయగా, ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం, కేటాయించిన భూమిని ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా ఇతర సంస్థలకు బదిలీ చేయడం, లీజుకు ఇవ్వడం లేదా ఇతర ప్రయోజనాలకు వినియోగించడం నిషేధం. కేటాయించిన ఉద్దేశానికే భూమిని ఉపయోగించాల్సి ఉంటుంది.
అలాగే భూమిలో చెరువులు, వాగులు లేదా ఇతర జలవనరులు ఉంటే వాటి సహజ ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కూడా ఆదేశించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు జారీైన తేదీ నుంచి మూడేళ్లలోపు ప్రాజెక్టు కోసం భూమిని వినియోగించాల్సి ఉంటుంది. షరతులు ఉల్లంఘించినా, నిర్ణీత గడువులో భూమిని వినియోగించకపోయినా నంద్యాల జిల్లా కలెక్టర్‌కు భూమి కేటాయింపును రద్దు చేసి తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




