Atal Pension Yojana: రూ. 577 కడితే చాలు.. నెలకు రూ. 5 వేల పెన్షన్ పొందే అవకాశం. బెస్ట్ స్కీమ్
Atal Pension Yojana: వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని అందిస్తోంది.
Atal Pension Yojana: రూ. 577 కడితే చాలు.. నెలకు రూ. 5 వేల పెన్షన్ పొందే అవకాశం. బెస్ట్ స్కీమ్
Atal Pension Yojana: వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో చిన్న మొత్తాలతో పొదుపు చేస్తూ 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు.
అటల్ పెన్షన్ యోజనలో ఎవరు చేరవచ్చు?
అటల్ పెన్షన్ యోజనలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న భారతీయ పౌరులు చేరవచ్చు. ఉద్యోగులు, అసంఘటిత రంగాల్లో పనిచేసేవారు కూడా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే 2022 అక్టోబర్ 1 నుంచి ఆదాయపు పన్ను చెల్లించే వారు కొత్తగా ఈ పథకంలో చేరేందుకు అవకాశం లేదు. అంతకుముందే చేరిన వారు మాత్రం తమ ఖాతాను కొనసాగించవచ్చు. ఈ పథకంలో చేరాలనుకునేవారు తమ బ్యాంకు లేదా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్‌లోనూ ఖాతా తెరిచే సదుపాయం కల్పిస్తున్నాయి.
నెలకు రూ.577 కడితే రూ.5 వేల పెన్షన్ ఎలా వస్తుంది?
మీ వయసు 30 ఏళ్లు అనుకుందాం. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే వరుసగా 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టాలి. ఇందుకోసం నెలవారీ, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి చెల్లించే వెసులుబాటు ఉంది.
నెలవారీ చెల్లింపు: 360 వాయిదాల్లో ప్రతి నెలా రూ.577 చెల్లించాలి. మొత్తం రూ.2,07,720 పెట్టుబడి అవుతుంది.
మూడు నెలలకు ఒకసారి: 120 వాయిదాల్లో ఒక్కోసారి రూ.1,720 చెల్లించాలి. మొత్తం రూ.2,06,400 అవుతుంది.
ఆరు నెలలకు ఒకసారి: 60 వాయిదాల్లో ఒక్కోసారి రూ.3,405 చెల్లించాలి. మొత్తం రూ.2,04,300 పెట్టుబడి పెట్టాలి.
ఇలా 30 ఏళ్ల వయసులోనే పథకంలో చేరి క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తే 60 ఏళ్ల తర్వాత జీవితాంతం నెలకు రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. మీరు ఎంచుకునే పెన్షన్ మొత్తాన్ని బట్టి నెలవారీ చెల్లింపు మారుతుంది. చిన్న వయసులోనే చేరితే కట్టాల్సిన మొత్తం తక్కువగా ఉంటుంది.
ఖాతాదారుడు మరణిస్తే కుటుంబానికి ఎంత డబ్బు వస్తుంది?
అటల్ పెన్షన్ యోజనలో ఖాతాదారుడికి 60 ఏళ్ల తర్వాత జీవితాంతం పెన్షన్ అందుతుంది. ఒకవేళ పెన్షన్ పొందుతున్న సమయంలో ఖాతాదారుడు మరణిస్తే, ఆయన భార్య లేదా భర్తకు కూడా జీవితాంతం అదే పెన్షన్ అందుతుంది. ఇద్దరూ మరణించిన తర్వాత పథకంలో నిర్ణయించిన పెన్షన్ కార్పస్ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. ఉదాహరణకు నెలకు రూ.5,000 పెన్షన్ ఎంచుకున్నవారి మరణానంతరం నామినీకి రూ.8.5 లక్షలు అందుతాయి. ఈ పథకంలో పెట్టుబడిపై నిర్దిష్ట వడ్డీ రేటు ప్రకటించరు. అయితే ఎంచుకున్న పెన్షన్ మొత్తానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. పెట్టుబడుల నిర్వహణ PFRDA నిబంధనల ప్రకారం SBI పెన్షన్ ఫండ్, LIC పెన్షన్ ఫండ్, UTI రిటైర్మెంట్ సొల్యూషన్స్ వంటి సంస్థల ద్వారా జరుగుతుంది. నిర్ణయించిన పెన్షన్ చెల్లింపులకు పెట్టుబడి రాబడి సరిపోకపోతే ఆ లోటును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.
పథకంలో చేరే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
అటల్ పెన్షన్ యోజనలో చేరే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన వాయిదాలు మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతాయి. కాబట్టి ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలి. నిర్ణీత సమయానికి డబ్బులు చెల్లించకపోతే నిబంధనల ప్రకారం అదనపు ఛార్జీలు పడవచ్చు. ఈ పథకంలో నెలకు రూ.1,000, రూ.2,000, రూ.3,000, రూ.4,000, రూ.5,000 పెన్షన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తాన్ని ఎంచుకోవాలి. ఆలస్యంగా పథకంలో చేరితే చెల్లించాల్సిన వాయిదా మొత్తం పెరుగుతుంది. అందుకే వీలైనంత త్వరగా చేరడం మంచిది. అలాగే ఈ పథకంలో పెట్టుబడిపై పన్ను మినహాయింపు పొందాలనుకునేవారు ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనలు, తమకు వర్తించే పన్ను విధానాన్ని పరిశీలించుకోవాలి.




