మీ సేవింగ్ అకౌంట్‌లో డ‌బ్బులు ఉన్నాయా.? ఆటో స్వీప్ ఎఫ్‌డీ గురించి తెలుసుకోవాల్సిందే!

Auto Sweep FD: సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వడ్డీ తక్కువగా వస్తుంది.

Mokshith
Updated on: 22 Nov 2026 12:34 PM IST
Auto Sweep FD
X

మీ సేవింగ్ అకౌంట్‌లో డ‌బ్బులు ఉన్నాయా.? ఆటో స్వీప్ ఎఫ్‌డీ గురించి తెలుసుకోవాల్సిందే!

Auto Sweep FD: సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. కానీ వడ్డీ తక్కువగా వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా బ్యాంకులు ఆటో స్వీప్ ఎఫ్‌డీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. దీనితో అదనపు డబ్బుపై ఎక్కువ వడ్డీ పొందుతూనే, అవసరమైనప్పుడు కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

ఆటో స్వీప్ ఎఫ్‌డీ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

ఆటో స్వీప్ ఎఫ్‌డీ అనేది సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా ఉండే ప్రత్యేక సదుపాయం. మీ ఖాతాలో ఒక నిర్దిష్ట మొత్తాన్ని మించి డబ్బులు ఉన్నప్పుడు.. అదనపు మొత్తాన్ని బ్యాంకు ఆటోమేటిక్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా మారుస్తుంది. దీనివల్ల సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉంచినట్లే అందుబాటులో ఉండటంతో పాటు, ఎఫ్‌డీ తరహాలో మెరుగైన వడ్డీ పొందవచ్చు.

ఉదాహరణకు.. మీ సేవింగ్స్ ఖాతాలో రూ.లక్ష ఉందనుకుందాం. అందులో కనీసం రూ.50 వేలు ఉండేలా బ్యాంకుకు సూచించారు. అప్పుడు మిగిలిన రూ.50 వేలు ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీగా మారతాయి. కొంతకాలం తర్వాత మీకు అత్యవసరంగా రూ.10 వేలు అవసరమైతే.. ఆ మొత్తాన్ని తీసుకోవచ్చు. బ్యాంకు ఎఫ్‌డీ నుంచి రూ.10 వేలు మాత్రమే వెనక్కి తీసుకుని మీ సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తుంది. మిగిలిన రూ.40 వేలపై ఎఫ్‌డీ వడ్డీ కొనసాగుతుంది.

ఇక్కడ ఆటో స్వీప్, స్వీప్ ఇన్ ఎఫ్‌డీల మధ్య చిన్న తేడా ఉంది. ఆటో స్వీప్‌లో సేవింగ్స్ ఖాతాలోని అదనపు డబ్బు ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీగా మారుతుంది. స్వీప్ ఇన్ సదుపాయంలో ఇప్పటికే ఉన్న ఎఫ్‌డీని సేవింగ్స్ ఖాతాకు అనుసంధానం చేస్తారు. అవసరమైనప్పుడు ఆ ఎఫ్‌డీ నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.

సాధారణ ఎఫ్‌డీకి, ఆటో స్వీప్ ఎఫ్‌డీకి తేడా ఏంటి?

సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో మనమే ఒక నిర్ణీత మొత్తాన్ని ఎంచుకుని నిర్దిష్ట కాలానికి డిపాజిట్ చేయాలి. గడువు ముగిసే వరకు ఆ డబ్బును తీసుకోకపోతే నిర్ణయించిన వడ్డీ లభిస్తుంది. అయితే మధ్యలో డబ్బులు అవసరమైతే ఎఫ్‌డీని ముందుగానే ముగించాల్సి రావచ్చు. దీనివల్ల కొన్ని బ్యాంకుల్లో పెనాల్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఆటో స్వీప్ ఎఫ్‌డీలో మాత్రం ఈ ఇబ్బంది కొంతవరకు తగ్గుతుంది. సేవింగ్స్ ఖాతాలో అవసరానికి మించి ఉన్న డబ్బు ఆటోమేటిక్‌గా ఎఫ్‌డీగా మారుతుంది. అత్యవసర సమయంలో మొత్తం డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎంత డబ్బు అవసరమో అంత మొత్తాన్ని మాత్రమే తీసుకోవచ్చు.

మిగిలిన మొత్తం ఎఫ్‌డీలోనే కొనసాగుతుంది. అంటే సాధారణ సేవింగ్స్ ఖాతాతో పోలిస్తే ఎక్కువ వడ్డీ పొందే అవకాశం, సాధారణ ఎఫ్‌డీతో పోలిస్తే డబ్బులపై ఎక్కువ వెసులుబాటు ఈ సదుపాయంలో ఉంటాయి. అయితే వడ్డీ రేటు, డిపాజిట్ కాలపరిమితి బ్యాంకును బట్టి మారుతాయి.

వడ్డీ రేట్లు, డబ్బుల విత్‌డ్రా నిబంధనలు

ఆటో స్వీప్ ద్వారా ఏర్పడే ఎఫ్‌డీలకు సాధారణంగా ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి. అయితే డిపాజిట్ కాలపరిమితి, కనీస బ్యాలెన్స్, డబ్బుల ఉపసంహరణ వంటి నిబంధనలు ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటాయి. ముఖ్యంగా ముందుగానే డబ్బులు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

కొన్ని బ్యాంకులు పాక్షికంగా డబ్బులు వెనక్కి తీసుకున్నప్పుడు పెనాల్టీ విధించకపోవచ్చు. మరికొన్ని బ్యాంకులు ముందస్తు ఉపసంహరణ నిబంధనల ప్రకారం జరిమానా విధించవచ్చు. అలాగే డబ్బులు ఎంతకాలం ఎఫ్‌డీలో ఉన్నాయనే దాని ఆధారంగా వడ్డీని లెక్కిస్తారు.

ఇక ఎఫ్‌డీలోని డబ్బులను ఏ క్రమంలో వెనక్కి తీసుకోవాలనే విషయంలోనూ బ్యాంకులు వేర్వేరు విధానాలు పాటిస్తాయి. వీటిలో LIFO (లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్), FIFO (ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్) పద్ధతులు ఉన్నాయి. LIFO విధానంలో చివరిగా చేసిన డిపాజిట్ నుంచి ముందుగా డబ్బులు తీసుకుంటారు. FIFO విధానంలో మొదట చేసిన డిపాజిట్ నుంచి డబ్బులు తీసుకుంటారు.

ఉదాహరణకు IDFC FIRST బ్యాంకులో కొన్ని నిబంధనలకు లోబడి ముందస్తు ఉపసంహరణపై పెనాల్టీ ఉండదు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్లెక్సీ ఎఫ్‌డీలో మాత్రం అమల్లో ఉన్న ముందస్తు ఉపసంహరణ నిబంధనల ప్రకారం పెనాల్టీ వర్తించే అవకాశం ఉంది. అందుకే ఈ సదుపాయం తీసుకునే ముందు బ్యాంకు నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలి.

ఏయే బ్యాంకుల్లో ఆటో స్వీప్ సదుపాయం ఉందంటే.?

దేశంలోని పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆటో స్వీప్ లేదా దానికి సమానమైన సదుపాయాలను అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): మల్టీ ఆప్షన్ డిపాజిట్ (MOD) స్కీమ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: స్వీప్ ఇన్ ఫెసిలిటీ, ఐసీఐసీఐ బ్యాంక్: మనీ మ్యాక్సిమైజర్ ఫెసిలిటీ, యాక్సిస్ బ్యాంక్: ఎన్‌క్యాష్ 24, కోటక్ మహీంద్రా బ్యాంక్:

యాక్టివ్ మనీ, బ్యాంక్ ఆఫ్ బరోడా: ఫ్లెక్సీ ఫిక్స్‌డ్ డిపాజిట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): స్వీప్ ఇన్/అవుట్ ఫెసిలిటీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్: ఆటో స్వీప్ ఎఫ్‌డీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్: ఆటో స్వీప్ ఎఫ్‌డీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: స్వీప్ ఇన్ ఫెసిలిటీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా: స్టార్ స్వీప్

డీబీఎస్ బ్యాంక్: స్వీప్ ఇన్/అవుట్ ఫెసిలిటీ వంటి బ్యాంకుల్లో ఈ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.