Airlines Crisis: ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు.. విమానాలు నిలిచిపోతాయని కేంద్రానికి ఎయిర్‌లైన్స్ హెచ్చరిక..
Airlines Crisis: ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ ఖర్చులు భరించలేక విమాన సర్వీసులు నిలిపివేస్తామని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కేంద్రానికి లేఖ రాశాయి. పన్నులు తగ్గించాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి.
Airlines Crisis: ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు.. విమానాలు నిలిచిపోతాయని కేంద్రానికి ఎయిర్‌లైన్స్ హెచ్చరిక..
Airlines Crisis: ఇరాన్ యుద్ధం మరియు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరల భారంతో విమాన సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కార్యకలాపాలను నిలిపివేయాల్సి వస్తుందని టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ప్రముఖ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
సాధారణంగా విమాన నిర్వహణ ఖర్చులలో ఇంధనానిదే (ATF) 40 శాతం వాటా ఉంటుంది. అయితే ప్రస్తుత యుద్ధ పరిస్థితుల వల్ల అది ఏకంగా 55–60 శాతానికి పెరిగిందని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏటీఎఫ్ ధర ప్రతి కిలోలీటర్‌కు రూ. 2 లక్షలు దాటడం ఎయిర్‌లైన్స్‌కు గొడ్డలిపెట్టులా మారింది.
కేంద్రం ముందు ఎయిర్‌లైన్స్ డిమాండ్లు:
పెరుగుతున్న నష్టాల నుంచి గట్టెక్కేందుకు విమానయాన సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో కొన్ని కీలక విజ్ఞప్తులు చేశాయి.
పన్నుల తగ్గింపు: తాత్కాలికంగా 11 శాతం ఎక్సైజ్ డ్యూటీని వాయిదా వేయాలని కోరాయి.
వ్యాట్ (VAT) హేతుబద్ధీకరణ: కొన్ని రాష్ట్రాల్లో 25 శాతం వరకు ఉన్న వ్యాట్‌ను తగ్గించాలని విన్నవించాయి.
ఏకరీతి ధరలు: దేశీయ, అంతర్జాతీయ ఏటీఎఫ్ ధరలు సమానంగా ఉండాలని డిమాండ్ చేశాయి.
సర్వీసుల రద్దు హెచ్చరిక: ఇంధన ధరలపై నియంత్రణ లేకపోతే అంతర్జాతీయ రూట్లలో విమానాలను నిలిపివేయడం లేదా తగ్గించడం తప్పదని స్పష్టం చేశాయి.
హార్ముజ్ జలసంధి అడ్డంకితోనే సమస్య!
ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20 శాతం వాటా కలిగిన ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ అడ్డుకోవడంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీని ప్రభావంతోనే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగి, భారత విమానయాన రంగంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.




