Gold Prices 2027: బాబా వంగా భవిష్యవాణి.. 2027లో బంగారం ధరకు రెక్కలు.. తులం రూ.2. 80 లక్షలు..!
Gold Prices 2027: 2027లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటూ బాబా వంగా పేరుతో ప్రచారం జరుగుతోంది. ఈ వైరల్ అంచనాల వెనుక నిజం ఏమిటంటే.
Gold Prices 2027: బాబా వంగా భవిష్యవాణి.. 2027లో బంగారం ధరకు రెక్కలు.. తులం రూ.2. 80 లక్షలు..!
Gold Prices 2027: బంగారం ధరలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీ స్థాయిలో కొనసాగుతున్న వేళ.. 2027లో పసిడి ధరలు మరింత పెరగనున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బల్గేరియాకు చెందిన భవిష్యవేత్త బాబా వంగా పేరుతో ఈ అంచనాలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం లేదా నగదు కొరత వంటి పరిస్థితులు ఏర్పడి సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం తగ్గితే పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లే అవకాశం ఉందని ఈ పోస్టుల్లో పేర్కొంటున్నారు. అయితే బాబా వంగా నిజంగా 2027 బంగారం ధరలపై ఇలాంటి అంచనా వేసినట్లు నిర్ధారించే ప్రామాణిక ఆధారాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.
25 నుంచి 40 శాతం పెరుగుతుందా?
ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న కొన్ని పోస్టుల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం తలెత్తితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరగవచ్చని బాబా వంగా పేరుతో ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె ఈ విషయాన్ని చెప్పినట్లు నిర్ధారించే రాతపూర్వక రికార్డు లేదా విశ్వసనీయ ఆధారం అందుబాటులో లేదు. బాబా వంగా పేరుతో గతంలోనూ అనేక అంచనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిలో చాలా వాటికి కూడా ప్రాథమిక ఆధారాలు లేవని ఫ్యాక్ట్ చెకర్లు, విశ్లేషకులు గుర్తించారు.
రూ.2.82 లక్షలకు 10 గ్రాముల బంగారం?
కొన్ని ఆన్‌లైన్ కథనాల్లో 2027లో భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల మధ్యకు చేరవచ్చని పేర్కొంటున్నారు. మరికొన్ని ప్రచారాల్లో రూ.2.1 లక్షల వరకు పెరగవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారిక ఆర్థిక సంస్థలు ప్రకటించిన నిర్ధారిత ధరల అంచనాలు కావు. బాబా వంగా పేరుతో వైరల్ అవుతున్న ప్రచారానికి జోడించిన ఊహాగానాలుగానే వీటిని చూడాలి. కాబట్టి ఈ సంఖ్యలను ఖచ్చితమైన మార్కెట్ అంచనాలుగా పరిగణించడం సరికాదు.
జేపీ మోర్గాన్ అంచనా ఏంటి?
మరోవైపు, ప్రముఖ ఆర్థిక సంస్థలు కూడా భవిష్యత్తులో బంగారం ధరలపై తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ ప్రకారం.. 2026 నాలుగో త్రైమాసికంలో బంగారం ధర ఔన్సుకు సుమారు 6,000 డాలర్లకు చేరే అవకాశం ఉంది. 2027 చివరి నాటికి ఔన్సుకు 6,300 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల నుంచి బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అంశాలు ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే పరిణామాలపై ఈ అంచనాలు మారే అవకాశం ఉంది.
యూబీఎస్, డాయిష్ బ్యాంక్ అంచనాలు
యూబీఎస్ కూడా 2027 తొలి అర్ధభాగంలో బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు డాయిష్ బ్యాంక్ 2026 నాలుగో త్రైమాసికానికి ఔన్సుకు 4,600 డాలర్ల లక్ష్యాన్ని కొనసాగించింది. ఇటీవల బంగారం ధరల్లో నమోదైన దిద్దుబాటు దాదాపు ముగిసినట్లేనని ఆ సంస్థ పేర్కొన్నట్లు ట్రేడింగ్‌వ్యూ తన విశ్లేషణలో తెలిపింది. అయితే ఏ సంస్థ అంచనా అయినా భవిష్యత్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఎవరీ బాబా వంగా?
బాబా వంగా అసలు పేరు వాంగెలియా పాండేవా దిమిత్రోవా. 1911లో జన్మించిన ఆమె బల్గేరియాకు చెందిన భవిష్యవాణులు చెప్పే మహిళగా ప్రసిద్ధి చెందారు. మూలికా వైద్యురాలిగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. 12 ఏళ్ల వయసులో సుడిగాలిలో చిక్కుకున్న తర్వాత చూపును కోల్పోయినట్లు ఆమె గురించి ప్రచారంలో ఉంది. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, చెర్నోబిల్ విపత్తు, ప్రిన్సెస్ డయానా మరణం, 2004 హిందూ మహాసముద్ర సునామీ, బ్రెగ్జిట్, ఐసిస్ ఎదుగుదల వంటి పలు సంఘటనలను ఆమె ముందుగానే చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంచనాల్లో అనేకం ఆమె స్వయంగా రికార్డు చేసినవిగా నిర్ధారించడానికి తగిన ప్రాథమిక ఆధారాలు లేవు. ఆమె అంచనాల్లో 85 శాతం నిజమయ్యాయనే వాదన కూడా ప్రధానంగా ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్నదే.




