Bank Holidays: 10 రోజుల్లో 6 రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సెప్టెంబర్ క్యాలెండర్ ఇదే

Bank Holidays: ఆగస్టు చివరి 10 రోజుల్లో ఏకంగా 6 రోజులు బ్యాంకులు పనిచేయవు. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా ఆర్థిక లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.

CR Reddy
Published on: 21 Aug 2026 7:08 AM IST
Bank Holidays
X

Bank Holidays

Bank Holidays: బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. ఆగస్టు చివరి 10 రోజుల్లో ఏకంగా 6 రోజులు బ్యాంకులు పనిచేయవు. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా ఆర్థిక లావాదేవీలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల మీ అత్యవసర బ్యాంకు పనులను ముందే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక క్యాలెండర్ ప్రకారం ఆగస్టు చివరి పది రోజుల్లో సెలవులు పోటెత్తనున్నాయి. ఆగస్టు 21న దేశవ్యాప్తంగా బ్యాంకులు మామూలుగానే పనిచేస్తాయి. ఆగస్టు 22న నాల్గవ శనివారం, ఆగస్టు 23న ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. సాధారణంగా ప్రతి నెలలోని రెండవ, నాల్గవ శనివారాలతో పాటు అన్ని ఆదివారాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. దీంతో ఈ వారాంతంలో ఖాతాదారులు నేరుగా శాఖలకు వెళ్లే వెసులుబాటు ఉండదు.

మిలాద్ ఉన్ నబీ, ఓనం పండుగల సెలవులు

వారాంతపు సెలవుల తర్వాత ఆగస్టు 24 సోమవారం రోజున బ్యాంకులు తెరుచుకుంటాయి. మరుసటి రోజు ఆగస్టు 25 మంగళవారం నాడు మిలాద్-ఉన్-నబీ, మొదటి ఓణం సందర్భంగా కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఆగస్టు 26 బుధవారం రోజున ఈద్-ఎ-మిలాద్, తిరువోణం పండుగల కారణంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, బీహార్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. ఆగస్టు 27న తిరిగి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

రాఖీ పండగ వేళ మరిన్ని సెలవులు

ఆగస్టు 28 శుక్రవారం రోజున రక్షాబంధన్ (రాఖీ) పండుగను పురస్కరించుకుని గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. నెలాఖరు శనివారం అయిన ఆగస్టు 29న బ్యాంకులు యథావిధిగా తెరుచుకుంటాయి. ఆగస్టు 30న నెల చివరి ఆదివారం కావడంతో మరోసారి సెలవు ఉంటుంది. ఇలా ఆగస్టు 21 నుంచి 31 మధ్య మొత్తం 6 రోజులు వివిధ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలకు విరామం కలగనుంది.

సెప్టెంబర్ నెలలోని బ్యాంక్ హాలిడేస్ జాబితా

ఆగస్టు ముగియగానే సెప్టెంబర్ నెలలోనూ వరుస పండుగల కారణంగా పలు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 4న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా దేశంలోని మెజారిటీ రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడతాయి. సెప్టెంబర్ 12న శ్రీమంత శంకరదేవ్ తిరోభావ తిథి సందర్భంగా అస్సాంలో మాత్రమే సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో వినాయక చతుర్థి, సంవర్త్సరి, నువాఖాయ్ పండుగల వల్ల తెలుగు రాష్ట్రాలు సహా గుజరాత్, గోవా, ఒడిశా ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు. ఇవే కాకుండా సెప్టెంబర్ 21, 22, 23, 25 తేదీల్లో వివిధ ప్రాంతీయ ఉత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story