Bank Strike: సెప్టెంబరు 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. 4 రోజులు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

Bank Strike: సెప్టెంబరు 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెకు UFBU పిలుపునిచ్చింది.

Arun Chilukuri
Published on: 24 Aug 2026 11:58 AM IST
Bank Strike
X

Bank Strike: సెప్టెంబరు 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె.. 4 రోజులు నిలిచిపోనున్న బ్యాంకింగ్ సేవలు..

Bank Strike: 5 రోజుల పనిదినాల విధానం అమలులో జాప్యం, పర్‌ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌లో వ్యత్యాసాలు మరియు పెన్షన్ సంబంధిత డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ 'యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్' (UFBU) సెప్టెంబరు 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మె కనుక ముందుకు సాగితే, ముఖ్యంగా ప్రభుత్వ రంగా బ్యాంకుల్లో సేవలు స్తంభించిపోనున్నాయి.

వరుసగా 4 రోజులు మూతపడనున్న బ్యాంకులు?

సెప్టెంబరు 11 శుక్రవారం రావడం, ఆ తర్వాత శని, ఆదివారాలు బ్యాంక్ సెలవులు కావడం మరియు సెప్టెంబరు 14న (సోమవారం) వినాయక చవితి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో స్థానిక సెలవు ఉండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు తీవ్ర విఘాతం కలిగే అవకాశం ఉంది.

తొమ్మిది బ్యాంక్ ఉద్యోగులు మరియు అధికారుల సంఘాల కూటమి అయిన UFBU, ప్రభుత్వం తమ డిమాండ్లపై ‘ప్రతికూల వైఖరి’ ప్రదర్శిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వం మరియు బ్యాంక్ యాజమాన్యాలు స్పందించకపోతే, సెప్టెంబరు 28 నుండి 3 రోజుల పాటు మరియు అక్టోబరు 26 నుండి అనిశ్చిత కాల సమ్మెకు దిగుతామని స్పష్టం చేసింది.

ప్రధాన వివాదాలు & డిమాండ్లు:

5 రోజుల బ్యాంకింగ్: 12వ ద్రైపాక్షిక ఒప్పందం మరియు మార్చి 8, 2024న కుదిరిన జాయింట్ నోట్ ప్రకారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) 5 రోజుల పనిదినాలకు అంగీకరించింది. వారానికి 40 నిమిషాల పనివేళలు పెంచేందుకు ఒప్పందం కుదిరినప్పటికీ, ప్రభుత్వం వద్ద ఈ ప్రతిపాదన రెండేళ్లకు పైగా పెండింగ్‌లోనే ఉంది.

PLI స్కీమ్‌లో వ్యత్యాసాలు: స్కేల్ IV మరియు అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులకు ప్రభుత్వం తెచ్చిన పర్‌ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్ IBA ఒప్పందానికి విరుద్ధంగా ఉందని యూనియన్లు మండిపడుతున్నాయి. DFS పథకం ప్రకారం ఉన్నతాధికారులకు 365 రోజుల మూలవేతనం వరకు ఇన్సెంటివ్‌గా లభిస్తుండగా, స్కేల్ III వరకు ఉన్న ఉద్యోగులకు గరిష్టంగా 15 రోజుల మూలవేతనం మాత్రమే దక్కుతోందని ఆరోపిస్తున్నారు.

పెన్షన్ మరియు ఇతర డిమాండ్లు: పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, పెన్షనర్లకు ఏకరూప కరువు భత్యం (DA) ఫార్ములా అమలు మరియు పెన్షన్ నవీకరణ వంటి అంశాలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

సమ్మె నోటీసుతో ఈ అంశంపై చీఫ్ లేబర్ కమిషనర్ (CLC) వద్ద వివాద పరిష్కార ప్రక్రియ (Concilliation) నడుస్తున్నప్పటికీ, DFS బ్యాంక్‌లకు ఇన్సెంటివ్‌లను జమ చేయాలని సూచించడంపై యూనియన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story