BSNL : ఒక్క డూప్లికేట్ సిమ్‌తో రూ.87 లక్షలు ఖాళీ.. బీఎస్ఎన్‌ఎల్‌కు హైకోర్టు భారీ జరిమానా!

BSNL : డూప్లికేట్ సిమ్ కార్డ్ జారీ చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గానూ బీఎస్ఎన్‌ఎల్ సంస్థకు కర్ణాటక హైకోర్టు రూ.55 లక్షలకు పైగా భారీ జరిమానా విధించింది.

CR Reddy
Published on: 8 Jun 2026 7:04 AM IST
BSNL
X

BSNL

BSNL : డూప్లికేట్ సిమ్ కార్డ్ జారీ చేయడంలో ఘోర నిర్లక్ష్యం వహించినందుకు గానూ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్‌ఎల్‎కు కర్ణాటక హైకోర్టు భారీ జరిమానా విధించింది. ఓ కోఆపరేటివ్ బ్యాంక్‌కు రూ.55 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. టెలికాం కంపెనీ సరిగ్గా వెరిఫికేషన్ చేయకుండా డూప్లికేట్ సిమ్ ఇవ్వడం వల్లే సైబర్ నేరగాళ్లు సదరు బ్యాంక్ ఖాతా నుంచి రూ.87 లక్షలకు పైగా దోచుకోగలిగారని న్యాయస్థానం నిర్ధారించింది. సరైన డాక్యుమెంట్లు లేకుండా సిమ్ ఇవ్వడం వల్ల నేరగాళ్లకు బ్యాంకింగ్ ఓటీపీలు సులువుగా చేరిపోయాయని, తద్వారా వారు ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారని కోర్టు స్పష్టం చేసింది.

రూ.87 లక్షల సైబర్ ఫ్రాడ్ ఎలా జరిగిందంటే?

ఈ విచిత్రమైన ఉదంతం శ్రీ బసవేశ్వర పట్టణ సహకార బ్యాంక్ నియమితకు చెందింది. ఈ బ్యాంక్‌కు సంబంధించిన కరెంట్ అకౌంట్ కెనరా బ్యాంక్‌లో ఉంది. ఈ అకౌంట్‌కు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీల కొరకు ఒక బీఎస్ఎన్‌ఎల్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేది. 2019 ఫిబ్రవరి 6, 7 తేదీల మధ్య కాలంలో కేటుగాళ్లు ఆర్టీజీఎస్, నెఫ్ట్‎ల ద్వారా ఏడు సార్లు అనధికారికంగా ట్రాన్సాక్షన్లు జరిపి ఏకంగా రూ.87.7 లక్షలను కాజేశారు.

డూప్లికేట్ సిమ్‌తో దొంగల చేతికి ఓటీపీలు

ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి బెంగళూరులోని బీఎస్ఎన్‌ఎల్ ఆఫీస్‌కు వెళ్లి బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన నంబర్‌కు డూప్లికేట్ సిమ్ కార్డ్ తీసుకున్నాడు. అయితే తాము అసలు ఎలాంటి సిమ్ కోసం అప్లై చేయలేదని బ్యాంక్ యాజమాన్యం స్పష్టం చేసింది. దొంగలు ఆ డూప్లికేట్ సిమ్ యాక్టివేట్ చేసుకోగానే, బ్యాంక్ అకౌంట్ లావాదేవీల ఓటీపీలన్నీ వారి మొబైల్‌కే వెళ్లడం ప్రారంభమైంది. దీని ఆధారంగానే వారు డబ్బులన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసుల యాక్షన్ వల్ల కొంత మొత్తం, ఇతర మార్గాల్లో కొంత మొత్తం కలిపి సుమారు రూ.37 లక్షలు తిరిగి వచ్చినప్పటికీ బ్యాంక్‌కు ఇంకా రూ.50.50 లక్షల నష్టం మిగిలిపోయింది.

బీఎస్ఎన్‌ఎల్‌దే పూర్తి బాధ్యత అన్న కోర్టు

ఈ కేసును విచారించిన జస్టిస్ సూరజ్ గోవిందరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన కస్టమర్ కాకుండా వేరే వ్యక్తికి డూప్లికేట్ సిమ్ వెళ్ళిందంటేనే అక్కడ వెరిఫికేషన్ ప్రక్రియ అస్సలు జరగలేదని లేదా చాలా నిర్లక్ష్యంగా జరిగిందని అర్థమవుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా ఒక మొబైల్ నంబర్ బ్యాంకింగ్ ఓటీపీలు, పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలతో లింక్ అయి ఉన్నప్పుడు టెలికాం కంపెనీల బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తుచేశారు. ఈ కేసులో బీఎస్ఎన్‌ఎల్ ఉద్యోగి ఒకరు తప్పు చేసినట్లు విచారణలో తేలిందని, అతనిపై డిపార్ట్‌మెంటల్ యాక్షన్ తీసుకున్నప్పటికీ, ఆ తప్పుకు బీఎస్ఎన్‌ఎల్ సంస్థే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చింది.

బీఎస్ఎన్‌ఎల్ వాదనలు తిరస్కరణ.. ఎంత కట్టాలంటే?

కోర్టులో బీఎస్ఎన్‌ఎల్ తరఫు లాయర్లు విచిత్రమైన వాదనలు చేశారు. బ్యాంక్‌కు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ద్వారా కొంత డబ్బు రికవరీ అయిందని, కాబట్టి తాము అదనంగా పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించారు. అయితే ఈ వాదనను జడ్జి గారు పూర్తిగా త్రోసిపుచ్చారు. ఒక సంస్థ ముందుచూపుతో ఇన్సూరెన్స్ చేయించుకున్నంత మాత్రాన.. తప్పు చేసిన అవతలి పక్షం తమ బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు. దీంతో బీఎస్ఎన్‌ఎల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ.. రూ.50,50,762 అసలు పరిహారం, రూ.5 లక్షలు అదనపు జరిమానాతో పాటు 2019 ఫిబ్రవరి 7 నుంచి ఇప్పటివరకు 9 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని కర్ణాటక హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. టెలికాం కంపెనీల నిర్లక్ష్యానికి, బ్యాంకింగ్ సెక్యూరిటీకి సంబంధించిన కేసుల్లో ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలవనుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story