New Rules: ఎల్‌పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీల వరకు.. నేటి నుంచే కొత్త రూల్స్

New Rules: అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎల్‌పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో పాటు ఎస్‌బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించారు.

CR Reddy
Published on: 1 Oct 2026 9:30 AM IST
October 1 New Rules
X

October 1 New Rules

New Rules: అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎల్‌పీజీ సబ్సిడీకి బయోమెట్రిక్ తప్పనిసరి చేయడంతో పాటు ఎస్‌బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గించారు. ఐటీఆర్ గడువు పెంపు, ట్యాక్స్ ఆడిట్ నిబంధనలు, ఎన్‌పీఎస్ ఛార్జీలతో పాటు సామాన్యుడి దైనందిన జీవితంపై ప్రభావం చూపే ఆరు ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం.

1. ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్లకు బయోమెట్రిక్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సబ్సిడీ ధరకు సిలిండర్ పొందాలంటే వినియోగదారులు ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ వెరిఫికేషన్ చేయించుకోని వారు ఎప్పటిలాగే సిలిండర్ బుక్ చేసుకోవచ్చు, అయితే సబ్సిడీ డబ్బులు రావు. మార్కెట్ ధర పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. గ్యాస్ పంపిణీలో పారదర్శకత కోసం ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు.

2. ఎస్‌బీఐ ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితి తగ్గింపు

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. ఇతర బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో ఇప్పటివరకు లభిస్తున్న 10 ఉచిత లావాదేవీలను ఐదుకు కుదించారు. ఇందులో ఫైనాన్షియల్ అలాగే నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు రెండు వర్తిస్తాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు నెలకు నాలుగు ఉచిత విత్‌డ్రాయల్స్ యథావిధిగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ.15 తో పాటు జీఎస్టీ అదనంగా వసూలు చేస్తారు.

3. నిర్దిష్ట యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు

డిజిటల్ చెల్లింపుల వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. రూ.2,000 పైబడిన నిర్దిష్ట వ్యాపార మర్చంట్ యూపీఐ లావాదేవీల కోస కొత్త ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్ అమల్లోకి వచ్చింది. సాధారణ ప్రజలకు, కస్టమర్లపై ఈ భారం ఉండదు. ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు నేరుగా జరిపే సాధారణ పర్సన్-టు-పర్సన్ యూపీఐ లావాదేవీలు అన్నీ పూర్తిగా ఉచితంగా కొనసాగుతాయి.

4. ట్యాక్స్ ఆడిట్ అలాగే ఐటీ రిటర్న్స్ గడువు పెంపు

అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తీపికబురు అందించింది. ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు సమర్పించే చివరి తేదీని అక్టోబర్ 21 వరకు పొడిగించారు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువును నవంబర్ 21 వరకు పెంచారు. గడువులోగా రిటర్న్స్ సమర్పించలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

5. ఆస్తి కొనుగోలుదారులకు పాన్ ఊరట.. ఎన్‌పీఎస్ మార్పులు

నాన్-రెసిడెంట్ విక్రేతల నుంచి స్థిరాస్తులు కొనుగోలు చేసే రెసిడెంట్ వ్యక్తులు ఇకపై టీడీఎస్ కోసం ప్రత్యేకంగా టాన్ తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం తమ పాన్ కార్డు నంబర్ ద్వారానే ఆ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ సవరించిన ఫీజుల నిర్మాణం అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రతి పీఆర్ఏఎన్ ఖాతాకు వన్-టైమ్ ఆన్‌బోర్డింగ్ ఛార్జీ కింద రూ.200 వర్తిస్తుంది.

6. ఆర్బీఐ కీలక నిర్ణయాలు అలాగే వడ్డీ రేట్ల సమీక్ష

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ వడ్డీ రేట్లను పనిదినాల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటలకల్లా అధికారిక వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం త్వరలో ప్రారంభం కానుంది. వడ్డీ రేట్లపై ఆర్బీఐ త్వరలోనే తుది నిర్ణయం వెల్లడించనుంది. గత సమీక్షలో రెపో రేటును ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగించిన విషయం తెలిసిందే.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.