AI నుంచి క్వాంటమ్ టెక్నాలజీ వరకు.. అమరావతిలో BITS Pilani క్యాంపస్!
అమరావతిలో రూ.1000 కోట్లతో నిర్మించనున్న BITS Pilani AI క్యాంపస్‌కు పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేశారు.
BITS Pilani AI Campus Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) ఏర్పాటు చేయనున్న AI ప్లస్ క్యాంపస్‌కు పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతోంది. సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడైంది.
అమరావతిలో ప్రతిపాదిత క్యాంపస్‌కు పర్యావరణ అనుమతి కోసం BITS Pilani దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ (SEIAA), ఆంధ్రప్రదేశ్‌కు ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సమర్పించినట్లు ఆంధ్రా నెక్సస్ అనే సివిల్ సొసైటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ పర్యావరణ అధ్యయనాలు, సంబంధిత డాక్యుమెంటేషన్‌ను టీమ్ ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్ రూపొందించినట్లు పేర్కొంది.
70 ఎకరాల్లో భారీ క్యాంపస్
అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని తుళ్లూరు మండల పరిధిలోని మందడం, వెంకటపాలెం గ్రామాల్లో 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. మొత్తం 1.48 లక్షల చదరపు మీటర్ల బిల్ట్‌అప్ ఏరియా ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
పర్యావరణహిత నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తూ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. గ్రీన్ బిల్డింగ్స్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి రీసైక్లింగ్ సదుపాయాలతో పాటు పెద్ద మొత్తంలో పచ్చదనం, ఓపెన్ స్పేస్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
AI, క్వాంటమ్ టెక్నాలజీపై ఫోకస్
అమరావతి క్యాంపస్‌లో అత్యాధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో వివిధ కోర్సులను అందించనున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, బిగ్ డేటా అనలిటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, రోబోటిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో విద్య, పరిశోధనకు అవకాశం కల్పించనున్నారు.
భారత్‌లోనే తొలిసారిగా ఈ తరహా AI ప్లస్ క్యాంపస్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. పర్యావరణ అనుమతులు లభించిన అనంతరం క్యాంపస్ నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.




