Black Money: ప్రపంచంలో అంత బ్లాక్ మనీ ఉందా? అందరికీ ఫ్రీగా ల్యాప్‌టాప్ ఇచ్చినా ఇంకా డబ్బు మిగులుతుందా ?

Black Money: ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న బ్లాక్ మనీ కొండలా పేరుకుపోతోంది.

CR Reddy
Published on: 5 Sept 2026 7:23 AM IST
Black Money
X

Black Money

Black Money: ప్రపంచవ్యాప్తంగా చలామణి అవుతున్న బ్లాక్ మనీ కొండలా పేరుకుపోతోంది. ఈ అక్రమ సంపాదన ఎంత పెద్దదంటే.. ప్రపంచంలోని ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరికీ ఒక ల్యాప్‌టాప్ కొనిచ్చినా ఇంకా కొండంత డబ్బు మిగిలిపోతుంది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించిన ఈ విస్తుపోయే నిజాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి.

లండన్‌లో నిర్వహించిన 43వ అంతర్జాతీయ ఆర్థిక నేరాల సదస్సులో భారత సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ వేదికపై ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న మనీ లాండరింగ్, అక్రమ సంపాదనపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2025 నాటికి ప్రపంచంలో మనీ లాండరింగ్ ద్వారా చలామణి అవుతున్న బ్లాక్ మనీ విలువు సుమారు 4.4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన గుర్తుచేశారు. గ్లోబల్ ఎకానమీ అభివృద్ధి చెందే వేగం కంటే అక్రమ రవాణా, నేరపూరిత సంపాదన పెరిగే వేగమే చాలా ఎక్కువగా ఉందనడానికి ఈ లెక్కలే నిదర్శనమని స్పష్టం చేశారు.

కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై బ్లాక్ మనీ నీడలు ఎంత దారుణంగా అలుముకున్నాయో అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2023లో మనీ లాండరింగ్‌తో ముడిపడిన బ్లాక్ మనీ విలువ 3.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. కేవలం రెండేళ్లలో ఇది 4.4 ట్రిలియన్ డాలర్లకు ఎగబాకింది. ప్రపంచ వ్యాప్త జీడీపీలో చట్టవిరుద్ధమైన డబ్బు వాటా 2.9 శాతం నుంచి ఏకంగా 3.8 శాతానికి పెరిగింది. ఆర్గానైజ్డ్ క్రైమ్స్, అవినీతి, డ్రగ్స్ సప్లై, మానవ అక్రమ రవాణా, ఉగ్రవాద నిధులు ఇలా ప్రతీ అక్రమ వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు తీరని చేటు తెస్తోందని సీజేఐ హెచ్చరించారు.

అక్రమ సంపాదనను అడ్డుకోవడంలోనూ, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలోనూ దర్యాప్తు సంస్థలు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. మన చట్టాలు, విచారణ వ్యవస్థలు సాధిస్తున్న పురోగతిని విశ్లేషిస్తూ సీజేఐ ఒక నిజాన్ని బయటపెట్టారు. ప్రతి 100 రూపాయల అక్రమ ఆస్తిలో రూపాయి కంటే తక్కువ మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వాలు రికవరీ చేయగలుగుతున్నాయి. అంటే శాతాల్లో చూస్తే 99 శాతం అక్రమ ధనం కేవలం ఉపన్యాసాలు, నివేదికలకే పరిమితమవుతోంది తప్ప ప్రాక్టికల్‌గా వెనక్కి రావడం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు.

మనదేశంలో కూడా ఆర్థిక నేరాల తీవ్రత ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2018లో నమోదైన ఆర్థిక నేరాల సంఖ్య 1,56,268 కాగా, 2024 నాటికి ఇది 2,14,379కి పెరిగింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో జరుగుతున్న మోసాల విలువ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.47,910 కోట్లకు చేరింది. ఇందులో దర్యాప్తు సంస్థలు రికవరీ చేయగలిగింది కేవలం 6.1 శాతం మాత్రమే అంటే రూ.2,906 కోట్లు. ఒక దేశంలో సంపాదించిన బ్లాక్ మనీ సరిహద్దులు దాటి ఇతర దేశాల సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుండటమే దీనికి ప్రధాన కారణం. ఈ అంతర్జాతీయ నేరాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య కచ్చితమైన సమన్వయం అత్యవసరమని సీజేఐ పిలుపునిచ్చారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story