Bladeless Fan: రెక్కల్లేని ఫ్యాన్.. స్విచ్ఛ్ ఆన్ చేసిన క్షణాల్లోనే ఇల్లంతా కూల్, కూల్..!

Bladeless Fan: ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉండాల్సిందే. సాధారణంగా ఫ్యాన్ అనగానే మనకు మూడు లేదా నాలుగు రెక్కలు కళ్లు గిర్రున తిరుగుతూ కనిపిస్తాయి.

Venkat
Published on: 16 Aug 2026 8:03 PM IST
Bladeless Fan
X

Bladeless Fan: రెక్కల్లేని ఫ్యాన్.. స్విచ్ఛ్ ఆన్ చేసిన క్షణాల్లోనే ఇల్లంతా కూల్, కూల్..!

Bladeless Fan: ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలంటే ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ ఉండాల్సిందే. సాధారణంగా ఫ్యాన్ అనగానే మనకు మూడు లేదా నాలుగు రెక్కలు కళ్లు గిర్రున తిరుగుతూ కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు మార్కెట్‌లోకి ఒక సరికొత్త టెక్నాలజీతో కూడిన 'బ్లేడ్‌లెస్ సీలింగ్ ఫ్యాన్' వచ్చేసింది. బయట ఎలాంటి రెక్కలు కనిపించకపోయినా, గది మొత్తం నిమిషాల్లో చల్లబరిచే ఈ వింత ఫ్యాన్ గురించి ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రెక్కల్లేవు.. ఫ్యూచరిస్టిక్ డిజైన్..

సాధారణ ఫ్యాన్లు కొన్నిసార్లు ఇంటీరియర్ డిజైన్‌ను పాడు చేస్తాయి. ముఖ్యంగా సీలింగ్ తక్కువగా ఉన్న ఇళ్లలో ఇవి కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. ఇక్కడే బ్లేడ్‌లెస్ ఫ్యాన్లు తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. పైకప్పులో సులువుగా ఒదిగిపోయేలా రౌండ్‌గా లేదా ఫ్లాట్‌గా ఉండే ఈ ఫ్యాన్ల వల్ల గది విశాలంగా, ఎంతో ఆధునికంగా కనిపిస్తుంది. పైగా నార్మల్ ఫ్యాన్ల తరహాలో ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు. రిమోట్ కంట్రోల్, ఎల్ఈడీ లైటింగ్, స్మార్ట్ హోమ్ ఇంటెగ్రేషన్ వంటి అధునాతన ఫీచర్లతో వస్తున్న ఈ ఫ్యాన్లు ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

సేఫ్టీ ఫస్ట్.. క్లీనింగ్ సులువు!

చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లలో సాధారణ ఫ్యాన్లతో ఎప్పుడూ ఒక భయం ఉంటూనే ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఏవైనా వస్తువులు పైకి విసిరితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అయితే, ఈ బ్లేడ్‌లెస్ ఫ్యాన్లలో బయట తిరిగే రెక్కలు ఉండవు కాబట్టి ఇలాంటి ముప్పు పూర్తిగా తొలగిపోతుంది. మరో ప్రధాన సమస్య ఫ్యాన్ క్లీనింగ్. నార్మల్ ఫ్యాన్ రెక్కలకు పట్టిన దుమ్ము దులపాలంటే కుర్చీలు, బల్లలు ఎక్కి నానా తంటాలు పడాలి. బ్లేడ్లు బయట కనిపించని ఈ కొత్త ఫ్యాన్లలో ఆ కష్టమే ఉండదు. ఎంతో సులభంగా వీటిని శుభ్రం చేసుకోవచ్చు.

అసలు గాలి ఎలా వస్తుంది?

చూసేందుకు ఎలాంటి రెక్కలు లేకపోయినా ఈ ఫ్యాన్ నుంచి గాలి ఎలా వస్తుందన్న సందేహం మీకు రావడం సహజం. దీని వెనుక సైన్స్ అద్భుతమైన టెక్నాలజీ దాగి ఉంది. ఈ ఫ్యాన్లను బ్లేడ్‌లెస్ అంటారు కానీ, వీటిలో బ్లేడ్లు ఉంటాయి. కాకపోతే అవి ఫ్యాన్ బేస్ లోపల ఎవరికీ కనిపించకుండా దాగి ఉంటాయి.

లోపల ఉండే పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్.. టర్బైన్ సాయంతో గదిలోని గాలిని వేగంగా లోపలికి లాక్కుంటుంది. ఆ తర్వాత ఆ గాలిని అత్యంత వేగంగా, అధిక ప్రెజర్‌తో రౌండ్‌గా ఉండే ఫ్యాన్ రింగ్ ద్వారా కిందికి నెడుతుంది. సైన్స్‌లో 'కోండా ఎఫెక్ట్' అని పిలిచే ఈ సిద్ధాంతం ఆధారంగానే గాలి చెల్లాచెదురు కాకుండా, అత్యంత వేగంగా ఒకే ధారలా గది నలుమూలలా వ్యాపిస్తుంది.

భారీగా పెరుగుతున్న డిమాండ్..

సేఫ్టీ, మోడ్రన్ లుక్, అధునాతన ఫీచర్లు ఉండటంతో బ్లేడ్‌లెస్ ఫ్యాన్లకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది. 'రీసెర్చ్ అండ్ మార్కెట్స్' తాజా నివేదిక ప్రకారం, 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా బ్లేడ్‌లెస్ ఫ్యాన్ల మార్కెట్ ప్రతి సంవత్సరం 6 శాతానికి పైగా వృద్ధి చెందనుందని అంచనా.

టెక్నాలజీ మారుతున్న కొద్దీ మన జీవనశైలిని సులభతరం చేసే ఇలాంటి గ్యాడ్జెట్లు ఇళ్లను మరింత స్మార్ట్‌గా మారుస్తున్నాయి. ధర కాస్త ఎక్కువైనా.. సేఫ్టీ, స్టైల్ కోరుకునే వారికి బ్లేడ్‌లెస్ ఫ్యాన్లు ఒక అద్భుతమైన ఎంపిక. భవిష్యత్తులో మన పాత ఫ్యాన్ల స్థానంలో ఇవే రాజ్యమేలడం ఖాయంగా కనిపిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story