Blinkit: కోడిగుడ్డు ఎంత పని చేసింది...ఏకంగా 'బ్లింకిట్'కే ఎసరు పెట్టంది

Blinkit: మంగళూరులో బ్లింకిట్ ద్వారా ఆర్డర్ చేసిన గుడ్డులో పురుగు ఉందన్న ఫిర్యాదుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

Gagan kumar
Published on: 5 Sept 2026 11:53 AM IST
Blinkit
X

Blinkit: కోడిగుడ్డు ఎంత పని చేసింది...ఏకంగా 'బ్లింకిట్'కే ఎసరు పెట్టంది

Blinkit: మంగళూరు నగరంలో ఒక ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ 'బ్లింకిట్' ద్వారా కొనుగోలు చేసిన గుడ్డులో పురుగు కనిపించిందన్న వార్త, ఆన్‌లైన్ గ్రోసరీ వినియోగదారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

మంగళూరులోని ఫాల్నిర్ ప్రాంతంలో ఉన్న బ్లింకిట్ డెలివరీ సెంటర్ నుండి ఒక వినియోగదారుడు గుడ్ల ప్యాకెట్‌ను ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ వచ్చిన ప్యాకెట్ తెరచి చూడగా కొన్ని గుడ్లు పాడైపోయి ఉండటమే కాకుండా, అందులోని ఒక గుడ్డులో పురుగు కనిపించడంతో సదరు వినియోగదారుడు దిగ్భ్రాంతి చెందారు. ఈ నిర్లక్ష్యంపై ఏకంగా కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి యూటీ ఖాదర్‌కు నేరుగా ఫిర్యాదు చేయడంతో అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు.

మంత్రి ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫాల్నిర్‌లోని బ్లింకిట్ కేంద్రంపై ఆకస్మిక దాడి చేశారు. ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన పలు పగిలిన, దెబ్బతిన్న గుడ్ల ప్యాకెట్లను అధికారులు స్వయంగా గుర్తించారు. వాటిని వెంటనే తొలగించి పారవేయాల్సిందిగా ఆదేశించారు. అయితే, వినియోగదారుడు పేర్కొన్న పురుగు ఉన్న గుడ్డు తనిఖీల సమయంలో అధికారులకు దొరకలేదని, దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన కొనసాగుతోందని స్పష్టం చేశారు.

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు బ్లింకిట్ స్టోరేజ్ గదిని తాత్కాలికంగా మూసివేసి సీల్ చేశారు. పరిసరాలను శుభ్రపరిచి, శానిటైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడంతో పాటు, ఈ లోపాలపై వివరణ కోరుతూ బ్లింకిట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు.

ఇటీవలే బెంగళూరులోని 'జెప్టో' గోదాములో, అలాగే మహారాష్ట్రలోని బ్లింకిట్ కేంద్రాల్లోనూ పరిశుభ్రతా లోపాలు బయటపడటం గమనార్హం. నిమిషాల్లో డెలివరీ చేసే క్విక్-కామర్స్ సంస్కృతి పెరుగుతున్న వేళ, పాలు, గుడ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే వస్తువుల నిల్వ, నాణ్యత పట్ల కనీస ప్రమాణాలు పాటించకపోవడంపై వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్లింకిట్ సమర్పించే వివరణ, తదుపరి విచారణ నివేదిక ఆధారంగా ఈ ఘటనపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story