BMS Protest: ఆగస్టు 17న దేశవ్యాప్త నిరసనలకు బీఎంఎస్ పిలుపు

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 17న దేశవ్యాప్తంగా నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2026 5:40 AM IST
BMS Protest
X

BMS Protest

కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆగస్టు 17న దేశంలోని అన్ని యూనిట్లు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని బీఎంఎస్ కేంద్ర కార్యవర్గం సూచించింది.

ఇటీవల రాంచీలో జరిగిన బీఎంఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వెల్లడించింది. దేశంలోని 28 రాష్ట్ర యూనిట్లు, 42 పారిశ్రామిక సమాఖ్యలు జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించాలని ఆదేశించింది.

జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు

ఆగస్టు 17న జిల్లా కేంద్రాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టి.. అనంతరం జిల్లా అధికారుల ద్వారా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, కార్మిక శాఖ మంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని బీఎంఎస్ పిలుపునిచ్చింది.

కార్మికులకు సంబంధించిన పలు అంశాలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని సంఘం డిమాండ్ చేస్తోంది.

కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని డిమాండ్

బీఎంఎస్ ప్రధాన డిమాండ్లలో EPS-95 కింద కనీస పెన్షన్‌ను రూ.7,500కు పెంచడం ఒకటి. అలాగే ఈ పెన్షన్‌కు VDA, ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను అనుసంధానం చేయాలని కోరుతోంది.

దీంతో పాటు ESIకి సంబంధించిన వేతన పరిమితిని రూ.21,000 నుంచి రూ.42,000కు పెంచాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తోంది.

EPF పరిమితి పెంపుపైనా డిమాండ్

ప్రస్తుతం ఉన్న EPF వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.30,000కు పెంచాలని కార్మిక సంఘం కోరుతోంది. కొత్త కార్మిక చట్టాల ప్రకారం నోటిఫై చేసిన విధంగా పూర్తి వేతనం లేదా జీతంపై బోనస్‌ను సంబంధిత ప్రభుత్వాలు ప్రకటించాలని డిమాండ్ చేసింది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని బీఎంఎస్ కోరుతోంది. ఆగస్టు 17న దేశవ్యాప్తంగా చేపట్టనున్న నిరసనల ద్వారా తమ డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం నిర్ణయించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story