BMW Layoff : జర్మన్ కార్ల దిగ్గజాలకు చైనా షాక్.. BMWలో 8 వేల మంది ఉద్యోగుల తొలగింపు
BMW Layoff : చైనా ఈవీ కంపెనీల పోటీ తట్టుకోలేక బిఎమ్‌డబ్ల్యూ జర్మనీలో ఏకంగా 8,000 ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.
BMW Layoff
BMW Layoff : యూరప్‌లో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. జర్మనీలోని తమ కార్యాలయాల నుంచి దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మ్యూనిచ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ, ఉద్యోగుల ప్రాతినిధ్య వర్గాలతో మాట్లాడి స్వచ్ఛంద విరమణ ప్రోగ్రామ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు అధికారికంగా వెల్లడించింది.
అడ్మినిస్ట్రేషన్, డెవలప్‌మెంట్ విభాగాల్లోనే కోతలు
ఈ తొలగింపులు ప్రధానంగా అడ్మినిస్ట్రేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాలకు మాత్రమే పరిమితమవుతాయని, కార్ల ఉత్పత్తి చేసే ప్రొడక్షన్ విభాగానికి ఎలాంటి ప్రమాదం లేదని బీఎమ్‌డబ్ల్యూ ప్రతినిధి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బీఎమ్‌డబ్ల్యూలో దాదాపు 1,60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవలే మే నెలలో మిలాన్ నెడెల్కోవిచ్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ విప్లవాత్మక మార్పులు చేపట్టారు. ఆటోమొబైల్ రంగానికి సాంకేతిక మార్పులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, చైనా మార్కెట్లో మారుతున్న పరిస్థితులు తీవ్ర సవాలుగా మారాయని కంపెనీ పేర్కొంది.
చైనా ఈవీల ధాటికి తట్టుకోలేకపోతున్న జర్మన్ బ్రాండ్లు
గత కొద్ది సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో చైనా కంపెనీలు శరవేగంగా దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు జర్మన్ లగ్జరీ బ్రాండ్లకు చైనా అతిపెద్ద ఎగుమతి మార్కెట్‌గా ఉండేది. కానీ ఇప్పుడు చైనీస్ బ్రాండ్లు తమ స్వదేశీ మార్కెట్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా తీవ్రమైన ధరల యుద్ధాన్ని ప్రారంభించాయి. దానికితోడు పెట్రోల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు మారడానికి ఐరోపా కంపెనీలకు భారీగా నిధులు అవసరమవ్వడం, యూఎస్ టారిఫ్‌ల ప్రభావం పడటం వల్ల ఫోక్స్‌వాగన్, స్టెల్లాంటిస్, ఫోర్డ్ వంటి దిగ్గజాలు కూడా ఉనికి కోసం చైనా కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాల్సి వస్తోంది.
ఫోక్స్‌వాగన్, పోర్షే సంస్థల్లోనూ లేఆఫ్స్ కలకలం
ఒక్క బీఎమ్‌డబ్ల్యూ మాత్రమే కాకుండా జర్మనీకి చెందిన ఇతర ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు కూడా లేఆఫ్స్ బాట పట్టాయి. ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వాగన్ తమ మొత్తం 6.5 లక్షల మంది సిబ్బందిలో ఏకంగా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ధృవీకరించింది. దీనికోసం నాలుగు తయారీ ప్లాంట్లను మూసివేసి, మోడళ్ల సంఖ్యను సగానికి తగ్గించనుంది. అలాగే ప్రముఖ స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ పోర్షే కూడా 2035 నాటికి 9,000 మంది ఉద్యోగులను తీసివేయనుంది. చైనాలో పోర్షే కార్ల విక్రయాలు ఏకంగా 30 శాతానికి పడిపోవడం కంపెనీకి గట్టి షాక్‌నిచ్చింది.




