E20 పెట్రోల్‌ బంద్ అవుతుందా? BPCL నుంచి భారీ క్లారిటీ

E20 పెట్రోల్‌ను E10తో భర్తీ చేసే నిర్ణయం ఏదీ లేదని BPCL స్పష్టం చేసింది. పాత వాహనాలకు తక్కువ ఇథనాల్ పెట్రోల్‌పై చర్చ జరుగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 1:40 AM IST
E20 Petrol
X

 E20 Petrol

దేశంలో E20 పెట్రోల్ స్థానంలో E10 పెట్రోల్‌ను తీసుకొచ్చే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న చర్చ E20ని పూర్తిగా తొలగించి E10ను ప్రవేశపెట్టడంపై కాదని, పాత వాహనాలకు E20తో పాటు తక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలా అనే అంశంపైనే ఉందని సంస్థ వెల్లడించింది.

సంస్థ వార్షిక వాటాదారుల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన BPCL చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఖన్నా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రస్తుత ఇథనాల్ బ్లెండింగ్ విధానాన్ని మార్చాలని నిర్ణయిస్తే E20 నుంచి E10కి మారడంలో ఆయిల్ కంపెనీలకు పెద్దగా ఆపరేషనల్ లేదా లాజిస్టిక్స్ సమస్య ఉండదని తెలిపారు.

అయితే E20 స్థానంలో E10 వస్తుందని తాను చెప్పలేదని ఖన్నా స్పష్టం చేశారు. పాత వాహనాలకు తక్కువ ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని మరో ఆప్షన్‌గా అందించాలా అనే అంశంపైనే చర్చ జరుగుతోందని వివరించారు. ప్రస్తుత ఇంధన బ్లెండింగ్ విధానంలో మార్పుపై ఇంకా ఏదీ ఖరారు కాలేదని పేర్కొన్నారు.

పాత వాహనాలకు ఎందుకు E10 అవసరం?

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి. అనంత నాగేశ్వరన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి ఇటీవల రాసిన అభిప్రాయ వ్యాసంతో ఈ చర్చకు తెరలేచింది. పాత వాహనాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని వారు సూచించారు.

భారత్‌లో BS-IV కంటే ముందు తయారైన సుమారు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల పాత ద్విచక్ర వాహనాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. వీటిలో అనేక వాహనాల్లో కార్బ్యురేటర్లు ఉండటంతో E20లోని అధిక ఆక్సిజన్‌కు అనుగుణంగా అవి సర్దుబాటు కాకపోవచ్చని, ఫలితంగా ఇంజిన్ అధిక ఉష్ణోగ్రతతో పనిచేసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఇథనాల్‌కు అనుకూలంగా లేని పాత రబ్బర్ సీల్స్ దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.

E10ని అదనపు గ్రేడ్‌గా తీసుకొస్తే సమస్యలు

ప్రభుత్వం E20ని పూర్తిగా E10తో భర్తీ చేయాలని నిర్ణయిస్తే ఆయిల్ కంపెనీలకు పెద్దగా ఇబ్బంది ఉండదని BPCL సీఎండీ తెలిపారు. అయితే E20తో పాటు E10ను మరో ప్రత్యేక గ్రేడ్‌గా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడమే పెద్ద సవాలుగా మారుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా లక్షకు పైగా పెట్రోల్ బంకులు ఉండటంతో పాటు రిఫైనరీలు, టెర్మినల్స్, డిపోలు, పైప్‌లైన్లతో కూడిన విస్తృత ఇంధన పంపిణీ వ్యవస్థ ఉంది. ఈ నేపథ్యంలో మరో రకం పెట్రోల్‌ను సరఫరా చేయడానికి అదనపు లాజిస్టిక్స్ అవసరమవుతాయని, దీనిపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోందని ఖన్నా తెలిపారు.

క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడం, ఉద్గారాలను నియంత్రించడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా భారత్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను ప్రభుత్వం క్రమంగా పెంచుతూ వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి దేశంలోని పెట్రోల్ బంకుల్లో E20నే ఏకైక పెట్రోల్ వేరియంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story