BPCL: భారత్ పెట్రోలియంలో భారీ స్కామ్...విచారణలో కళ్లు చెదిరే నిజాలు
BPCL Fuel Scam: భారత్‌లోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో భారీగా ఆర్ధిక అక్రమాలు చోటు చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది.
BPCL: భారత్ పెట్రోలియంలో భారీ స్కామ్...విచారణలో కళ్లు చెదిరే నిజాలు
BPCL Fuel Scam: భారత్‌లోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌లో భారీగా ఆర్ధిక అక్రమాలు చోటు చేసుకున్న సంఘటన సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ నగరంలో వెలుగు చూసిన ఈ మోసం వ్యాపార వర్గాల్లో, పరిశ్రమల వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. కంపెనీ అంతర్గత ఆడిట్ సమయంలో ఈ వ్యవహారం బయటపడింది. ఇది ఒక ప్రాంతానికే పరిమితం అయిందా లేదంటే దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
ఎలా బయటపడింది?
ప్రతి ఏడాది నిర్వహించిన విధంగానే కంపెనీ సమగ్ర ఆడిట్‌ను నిర్వహించింది. ఈ ఆడిట్‌లో అనుమానాస్పద లావాదేవీలు నమోదు కావడంలో విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బీపీసీఎల్ జారీ చేసిన ప్రత్యేక ఫ్యూయల్ కార్డులు దుర్వినియోగం జరిగినట్టుగా బయటపడింది. అసలు మోసానికి ఈ కార్డులే ప్రధాన కారణంగా మారాయి. ఈ కార్డులను సంస్థ ఉద్యోగులు అధికారిక అవసరాల కోసం వినియోగించుకోవడానికి జారీ చేస్తారు. అయితే, కొందరు దీనిని కొందరు ఉద్యోగులు తమ అవసరాలకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా తేలింది.
రూ.5.72 కోట్ల మోసం ఎలా జరిగింది?
2023వ సంవత్సరంలో ఈ కార్డుల ద్వారా సుమారు రూ. 5.72 కోట్ల విలువైన పెట్రోల్, డీజిల్‌ను తీసుకున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. కానీ, ఈ మొత్తానికి సంబంధించిన చెల్లింపులు కంపెనీకి చేరకపోవడం విశేషం. కార్డుద్వారా ఇంధనం తీసుకొని డబ్బులు చెల్లించకుండా వ్యవస్థను మోసం చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఒకటి రెండు కార్డుల ద్వారా కాకుండా సంస్థ జారీ చేసిన 1093 కార్డుల నుంచి ఇలా మోసం జరిగి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో తేలింది. కార్డులు కలిగినవారంతా కుమ్మక్కై క్రమ పద్దతిలో సంస్థను మోసం చేసి ఉన్నట్టుగా అనుమానాలు కలుగుతున్నాయి.
ఎవరి మీద కేసులు?
ఈ కేసులో ఇప్పటికే సుమారు ఏడుగురు ప్రధాన నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో విశాల్ సింగ్, శశి సింగ్, దల్బీర్ సింగ్, బల్వీందర్ సింగ్, వాహిద్ ఖాన్, నరేంద్ర వాసు, బల్వీర్ సింగ్ ఉన్నారు. ఇంకా మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు, ఈ మోసం వెనుక కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది సహకారం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంస్థ జారీ చేసే కార్డులు రీచార్జబుల్ కార్డులు. ఇందులో బ్యాలెన్స్ లేకుండా ఇంధనం తీసుకోవడం కుదరదు. కానీ, ఈ కార్డుల్లో ఎలాంటి బ్యాలెన్స్ లేకుండానే ఇంధనం తీసుకున్నారు. ఇలా సిస్టమ్‌ను ఎలా మోసం చేశారు? ఎలాంటి టెక్నాలజీ వాడారు? లోపాలను ఎలా వాడుకున్నారు అనే అంశాలపై విచారణ జరుగుతున్నది.
దేశవ్యాప్త ప్రభావం?
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో బయటపడిన ఈ స్కామ్ కేవలం ఈ ప్రాంతానికే పరిమితమైందా లేదంటే దేశవ్యాప్తంగా విస్తరించిందా అనే దానిపై పలు సందేహాలు కలుగుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే ఈ స్కామ్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండొచ్చని అంటున్నారు. ఇదే నిజమైతే పెట్రోలియం రంగంలో పెద్ద మార్పులకు ఈ స్కామ్ దారి తీయవచ్చు. కంపెనీలు అంతర్గత భద్రతా వ్యవస్థలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉన్నది. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.




