ప్రియురాలితో రొమాంటిక్ టూర్.. ఎయిర్ పోర్టులో భార్యకు అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త

Businessman Caught with Girlfriend: బిజినెస్ ట్రిప్ అంటూ ప్రియురాలితో విదేశాలకు వెళ్లాలనుకున్న వ్యాపారవేత్త పాస్‌పోర్ట్ సమస్యతో దొరికిపోయాడు. ఆపై భార్య పెట్టిన కిడ్నాప్ కేసుతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Gagan kumar
Updated on: 20 Sept 2026 3:30 PM IST
Businessman Caught with Girlfriend
X

ప్రియురాలితో రొమాంటిక్ టూర్.. ఎయిర్ పోర్టులో భార్యకు అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త

Businessman Caught with Girlfriend: భార్యకు బిజినెస్ ట్రిప్ అంటూ కలరింగ్ ఇచ్చి, ప్రియురాలితో విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకున్న ఓ వ్యాపారవేత్త ప్లాన్ బెడిసికొట్టింది. ఎయిర్ పోర్టులో మొదలైన చిన్న పొరపాటు.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేలా చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆసక్తికర ఉదంతం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పుణెకు చెందిన 46 ఏళ్ల ఓ వ్యాపారవేత్త మలేషియా రాజధాని కౌలాలంపూర్‌కు బిజినెస్ ట్రిప్ నిమిత్తం వెళ్తున్నానని తన భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ, అతడి అసలు ప్లాన్ వేరు. తన ప్రియురాలతో కలిసి ఎంజాయ్ చేయడానికి లవ్లీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో ఫ్లైట్ ఎక్కుతామనే ఆనందంలో ఆ జంట తేలియాడింది.

ఇమ్మిగ్రేషన్ చెకింగ్ వద్దకు వెళ్లేసరికి ఆ మహిళ చేసిన ఓ పెద్ద పొరపాటు బయటపడింది. ఆమె గతంలో పోగొట్టుకున్నాను అని ఫిర్యాదు చేసిన పాత పాస్‌పోర్ట్‌ను ఈ ప్రయాణానికి ఉపయోగించింది. దీన్ని పసిగట్టిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను నిలదీసి, లీగల్ యాక్షన్‌కు ఆదేశించారు. దీంతో కంగుతిన్న ఆ వ్యాపారవేత్త.. చట్టపరమైన చిక్కులు వస్తాయనే భయంతో ఆ ట్రిప్‌ను అర్ధంతరంగా రద్దు చేసుకున్నాడు.

ట్రిప్ క్యాన్సిల్ అయ్యాక, అసలు విషయం భార్యకు తెలిస్తే తన కాపురం కూలుతుందని ఆ వ్యాపారవేత్త భయపడ్డాడు. ఆమెను నమ్మించేందుకు ఒక సినిమాను తలపించే డ్రామాకు తెరలేపాడు. ఎయిర్‌పోర్టు ల్యాండ్‌లైన్ నుంచి భార్యకు ఫోన్ చేసి.. ఇమ్మిగ్రేషన్ సమస్యల వల్ల అధికారులు నా ఫోన్ తీసుకున్నారు అని అబద్ధం చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ప్రియురాలితో కలిసి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా భార్యకు ఒక చిన్న వాట్సాప్ వీడియో కాల్ చేసి అదే నాటకాన్ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత పూర్తిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.

భర్త ఫోన్ కలవకపోవడం, పైగా ఇమ్మిగ్రేషన్ సమస్య అని చెప్పడంతో ఆ భార్య తీవ్ర భయాందోళనకు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, తనపై కిడ్నాప్ కేసు నమోదైందనే విషయం తెలుసుకున్న ఆ వ్యాపారవేత్త వెన్నులో వణుకు పుట్టింది. ఈ విషయాన్ని దాచితే మరింత ఇరుక్కుంటానని భావించి, రాత్రికి రాత్రే నేరుగా సహార్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు.

ప్రియురాలితో విదేశాలకు వెళ్తున్న విషయం ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని భావించే తాను ఈ అబద్ధాల నాటకం ఆడానని పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. దీంతో ఇది కేవలం సమాచార లోపం, భార్యాభర్తల మధ్య అపార్థం వల్ల నమోదైన కేసుగా తేల్చిన పోలీసులు.. కోర్టులో క్లోజర్ రిపోర్టు దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తానికి భార్య కళ్లు గప్పి ప్రియురాలితో ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ వ్యాపారవేత్త ప్లాన్ బెడిసికొట్టి, ఊహించని విధంగా అడ్డంగా దొరికిపోయి నవ్వులపాలయ్యాడు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.