Jai Anmol Ambani: అంబానీ కుమారుడిపై సీబీఐ విచారణ.. ఎందుకో తెలుసా?
Jai Anmol Ambani: అనిల్ అంబానీ కుటుంబానికి మరో షాక్. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌లో జరిగిన రూ.228 కోట్ల బ్యాంక్ మోసం కేసులో అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీని సీబీఐ (CBI) విచారించింది. నిధుల మళ్లింపు ఆరోపణలు, ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిన నిజాలు.. అసలు ఈ వివాదం ఏంటి? పూర్తి వివరాలు స్టోరీలో చదవండి.
Jai Anmol Ambani: అంబానీ కుమారుడిపై సీబీఐ విచారణ.. ఎందుకో తెలుసా?
Jai Anmol Ambani: రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కుటుంబానికి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL) ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేశారనే ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దూకుడు పెంచింది. ఈ కుంభకోణానికి సంబంధించి అనిల్ అంబానీ కుమారుడు జై అన్మోల్ అంబానీతో పాటు మాజీ డైరెక్టర్ రవీంద్ర శరద్ సుధాకర్‌ను అధికారులు ప్రశ్నించారు.
అసలు వివాదం ఏమిటంటే..
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (గతంలో ఆంధ్రా బ్యాంక్) ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థ తన వ్యాపార అవసరాల కోసం ముంబైలోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.450 కోట్ల రుణ పరిమితిని పొందింది. అయితే, రుణం తీసుకునే సమయంలో కుదుర్చుకున్న ఒప్పందాలను, వడ్డీ చెల్లింపు నిబంధనలను కంపెనీ ఉల్లంఘించినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాంకుకు వాయిదాలు చెల్లించడంలో కంపెనీ వరుసగా విఫలమవ్వడంతో, సెప్టెంబర్ 30, 2019న ఈ రుణ ఖాతాను మొండి బాకీగా (NPA) బ్యాంక్ వర్గీకరించింది. 'గ్రాంట్ థోర్న్టన్' నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బ్యాంకు నుంచి తీసుకున్న నిధులను ఉద్దేశించిన ప్రయోజనాల కోసం కాకుండా, ఇతర అవసరాలకు తప్పుగా మళ్లించినట్లు తేలింది.
ఈ ఆర్థిక అవకతవకల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుకు సుమారు రూ.228 కోట్ల మేర నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ ప్రాథమికంగా నిర్ధారించింది. ఇప్పటికే అనిల్ అంబానీ వివిధ సెబీ (SEBI) ఆంక్షలు, రుణ సమస్యలతో సతమతమవుతుండగా, ఇప్పుడు ఆయన కుమారుడిని సీబీఐ విచారించడం అంబానీ క్యాంప్‌లో కలకలం రేపుతోంది. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాల కోసం సీబీఐ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు.




