Cement Price: ఇల్లు కట్టే వారికి భారీ షాక్.. త్వరలోనే భారీగా పెరగనున్న సిమెంట్ ధరలు
Cement Price: సొంతిల్లు నిర్మించుకోవాలని ఆశపడే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బ్యాడ్ న్యూస్.
Cement Price
Cement Price: సొంతిల్లు నిర్మించుకోవాలని ఆశపడే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బ్యాడ్ న్యూస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి సిమెంట్ ధరలు భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. తయారీ కంపెనీల నిర్ణయంతో ప్రతి బస్తాపై దాదాపు రూ.35 నుంచి రూ.45 వరకు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్‌లో మరొక విడత ధరల బాదుడుకు తయారీ సంస్థలు సిద్ధపడ్డాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ప్రధాన కంపెనీల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. 50 కిలోల ప్రతి సిమెంట్ సంచిపై రూ.35 నుంచి రూ.45 వరకు ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్‌లో బ్రాండ్‌ను బట్టి రూ.250 నుంచి రూ.280 మధ్యలో లభిస్తుంటే, రిటైల్ మార్కెట్‌లో బస్తా రూ.270 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. హోల్‌సేల్ ధర రూ.320కి చేరితే తప్ప కంపెనీలకు గిట్టుబాటు కాదని వ్యాపార ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
ధరల భారం పెరగడానికి కారణాలివే
ముడిసరుకులు విపరీతంగా ప్రియం కావడం వల్లే ఈ అదనపు భారాన్ని భరించాల్సి వస్తోందని కంపెనీల ప్రతినిధులు వివరిస్తున్నారు. గత ఆరు ఏడు నెలల కాలంలోనే టన్ను పెట్రో కోక్ ధర 110 డాలర్ల నుంచి ఏకంగా 150 డాలర్లకు ఎగబాకింది. దీనికి తోడు ప్యాకేజింగ్ వస్తువుల వ్యయం, లారీ రవాణా ఛార్జీలు కూడా భారీగా ఎగబాకడంతో ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడైంది. ఫలితంగానే ధరల పెంపును తమపై నుంచి వినియోగదారులపైకి మళ్లించడం అనివార్యమైందని చెబుతున్నారు.
దసరా సీజన్‌లో డిమాండ్‌కు ఢోకా లేదు
ధరలు పెంచినా మార్కెట్‌లో అమ్మకాల జోరుకు ఎలాంటి ఆటంకం ఉండదని కంపెనీల నిర్వాహకులు బలంగా విశ్వసిస్తున్నారు. వచ్చే దసరా పండగ నుంచి కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి ప్రతి నెలా 32 లక్షల నుంచి 35 లక్షల టన్నుల వరకు సిమెంట్ అమ్ముడవుతోంది. పండగ వాతావరణం మొదలయ్యాక ఈ వినియోగం నెలకు 38 లక్షల టన్నుల స్థాయికి చేరే అవకాశముంది.
అమలు ఎప్పటి నుంచి అనేది సస్పెన్స్
ఈ నెల 5వ తేదీ నుంచే పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని కొందరు స్థానిక డీలర్లు ప్రకటిస్తున్నప్పటికీ, ఖచ్చితమైన తేదీపై పరిశ్రమ వర్గాలు ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. నిర్ణయం తీసుకోవడం ఖాయమైనా, అమలు చేసే సరైన రోజును త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని డైరెక్టర్లు అంటున్నారు. ఏది ఏమైనా, వర్షాకాలం ముగిసి పండగల సీజన్ ప్రారంభమయ్యే ముందే సామాన్యుల ఇంటి బడ్జెట్ గణనీయంగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.




