Rice Price: దీపావళి వేళ సామాన్యుడికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బియ్యం ధరలు

Rice Price: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది.

CR Reddy
Published on: 7 Nov 2026 12:13 PM IST
Rice Price
X

Rice Price

Rice Price: దీపావళి పండుగ వేళ దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నిరంతరం పెరుగుతున్న బియ్యం ధరలను అదుపులోకి తీసుకురావడానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం(OMSS) కింద బియ్యం విక్రయాల లక్ష్యాన్ని ఏకంగా రెట్టింపు చేసింది. ఇప్పటివరకు 25 లక్షల టన్నులుగా ఉన్న విక్రయ లక్ష్యాన్ని 50 లక్షల టన్నులకు పెంచుతూ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో మార్కెట్లో బియ్యం లభ్యత పెరిగి ధరలు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

25 లక్షల టన్నుల మార్కెట్ విడుదల

ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్ ద్వారా ఆన్‌లైన్ ఇ-వేలం విధానంలో ఇప్పటికే 25 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించే ప్రక్రియ అక్టోబర్ 31 నాటికి విజయవంతంగా పూర్తయింది. మార్కెట్లో డిమాండ్‌కు తగినంత సరఫరా ఉండేలా చూసేందుకు మరో 25 లక్షల టన్నులను అందుబాటులోకి తేనున్నారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా ఉండేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద ఉన్న నిల్వలను విడతల వారీగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ చర్యల వల్ల హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో బియ్యం ధరల ఒత్తిడి తగ్గి సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి.

వ్యాపారులకు డెడ్‌లైన్.. నిల్వల వివరాలు చెప్పకుంటే చర్యలు

బియ్యం అక్రమ నిల్వలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైన హెచ్చరికలు చేసింది. బియ్యం, ధాన్యం నిల్వలు కలిగి ఉన్న వ్యాపారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, రైస్ మిల్లర్లు తమ వద్ద ఉన్న రక రకాల నిల్వల వివరాలను ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి వారం శుక్రవారం నాడు నిల్వల సమాచారాన్ని పోర్టల్‌లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అత్యవసర వస్తువుల చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దక్షిణాది రాష్ట్రాలలో బియ్యం నిల్వలపై కఠిన పరిమితులు

విశేషంగా రైస్ వినియోగం ఎక్కువగా ఉండే దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఐదు రాష్ట్రాల్లో 2027 జనవరి 31 వరకు బియ్యం నిల్వలపై ప్రత్యేక పరిమితులు విధించేందుకు అనుమతులు మంజూరు చేసింది. వ్యాపారులు పరిమితికి మించి బియ్యాన్ని గుప్పిట్లో ఉంచుకోకుండా ఈ స్టాక్ లిమిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఆర్టిఫిషియల్ కొరత సృష్టించి ధరలు పెంచే వ్యాపారులకు చెక్ పడుతుంది.

భారత్ రైస్ సరఫరా పెంపు

సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు భారత్ రైస్ పథకాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ వంటి కేంద్ర ఏజెన్సీలకు చెందిన గిడ్డంగులకు అదనంగా బియ్యం కేటాయింపులు చేశారు. దక్షిణాది నగరాల్లో మొబైల్ వ్యాన్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా రూ. 29 లకే కిలో చొప్పున భారత్ రైస్ విక్రయాలను విస్తృతం చేయనున్నారు. మార్కెట్లో అక్రమ నిల్వలను నిర్మూలిస్తూ వినియోగదారులకు సరసమైన ధరల్లో నిత్యావసరాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం శ్రమిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.