Gold Import: అనుకున్నదే అయింది.. రాత్రికి రాత్రే పెంచేశారుగా..!

Gold Import: కేంద్రం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6% నుండి 15%కి పెంచింది.

Naresh.k
Published on: 13 May 2026 8:05 AM IST
Gold Import
X

Gold Import: అనుకున్నదే అయింది.. రాత్రికి రాత్రే పెంచేశారుగా..!

Customs Duty: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు వీలుగా బంగారం, వెండి ఇతర విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని రాత్రికి రాత్రే భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే 13 అర్ధరాత్రి నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

ఇప్పటివరకు బంగారం, వెండి దిగుమతులపై మొత్తం సుంకం 6 శాతంగా ఉండేది. అయితే తాజా నిర్ణయంతో ఇది ఏకంగా 15 శాతానికి చేరుకుంది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5 శాతం నుండి 10 శాతానికి పెంచారు. అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 1 శాతం నుండి 5 శాతానికి పెంచడం జరిగింది. మొత్తంగా చూస్తే, వినియోగదారుడిపై 9 శాతం అదనపు భారం పడనుంది. దీనివల్ల తులం బంగారం ధర మార్కెట్లో వేల రూపాయల మేర పెరిగే అవకాశం ఉంది.

ఇటీవల ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను నిలిపివేయాలని, పెళ్లిళ్లు, పండుగలకు కూడా పసిడిని కొనబోమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అలాగే చమురు వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా, డాలర్ రూపంలో చెల్లించే దిగుమతి బిల్లులను తగ్గించుకుని, దేశ విదేశీ మారక నిల్వలను పటిష్టం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు లక్ష్యం.

భారత్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

భారతదేశం ప్రపంచంలోనే పసిడి వినియోగంలో చైనాతో పోటీ పడుతోంది. మన దగ్గర లభ్యత తక్కువగా ఉండటంతో దాదాపు అంతా దిగుమతులపైనే ఆధారపడతాము. దీనివల్ల ఏటా వేల కోట్ల డాలర్లు విదేశాలకు తరలిపోతున్నాయి. ఇప్పుడు సుంకం పెంచడం ద్వారా దిగుమతులను నియంత్రించి, కరెంట్ అకౌంట్ లోటును అదుపులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story