ChatGPT: పాత చింతకాయను పక్కనపెట్టేశారు.. చాట్‌జీపీటీకి పోటినిచ్చే ఏఐ టూల్స్ ఇవే.!
ChatGPT: కొత్త ఆవకాయ వచ్చిన తర్వాత.. పాత చింతకాయ పచ్చడి పక్కన పెట్టినట్టుగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది.
ChatGPT: పాత చింతకాయను పక్కనపెట్టేశారు.. చాట్‌జీపీటీకి పోటినిచ్చే ఏఐ టూల్స్ ఇవే.!
ChatGPT: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, సాంకేతిక రంగంలో తనకంటూ ఒక తిరుగులేని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న చాట్‌జీపీటీ ఆధిపత్యం నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. ఎన్నో సంచలనాలకు, కొత్త ఆవిష్కరణలకు కేంద్రబిందువైన ఓపెన్ఏఐ సంస్థకు చెందిన ఈ ఏఐ టూల్ మార్కెట్ షేర్ చరిత్రలో తొలిసారిగా యాభై శాతం దిగువకు పడిపోయింది.
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ సాంకేతికత అంటే కేవలం చాట్‌జీపీటీ మాత్రమే అన్నట్లుగా ఉన్న పరిస్థితి నుంచి.. ఇప్పుడు మార్కెట్లోకి ఎన్నో కొత్త ప్రత్యామ్నాయాలు పుట్టుకువచ్చాయి. సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతున్న తరుణంలో వినియోగదారులు కూడా తమ అవసరాలకు తగ్గట్టుగా విభిన్నమైన టూల్స్ వైపు మొగ్గు చూపిస్తుండటం గమనార్హం.
టెక్ దిగ్గజం గూగుల్ సంస్థకు చెందిన జెమినీ, ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐల పాపులారిటీ ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతుండటమే చాట్‌జీపీటీ మార్కెట్ వాటా వేగంగా పడిపోవడానికి ప్రధాన కారణమని తాజా విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం, గతంలో మార్కెట్ మొత్తాన్ని శాసించిన చాట్‌జీపీటీ వాటా ప్రస్తుతం యాభై శాతం కంటే కిందికి పడిపోయి 46.4 శాతంగా నమోదైంది.
అయినప్పటికీ, ప్రస్తుత ఏఐ రేసులో ఇది ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతూ తన ఉనికిని చాటుకుంటోంది. మరోవైపు, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన జెమినీ ఏఐ అనతికాలంలోనే వినియోగదారుల ఆదరణ పొంది, 27.7 శాతం మార్కెట్ షేర్‌తో చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఆంత్రోపిక్ కంపెనీకి చెందిన క్లాడ్ ఏఐ తన అద్భుతమైన రైటింగ్, కోడింగ్ ఫీచర్లతో 10.3 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుని మూడో స్థానాన్ని ఆక్రమించింది.
ఈ టాప్ మూడు స్థానాల తర్వాత, ప్రపంచ టెక్ మార్కెట్లో ఇంకా అనేక ఇతర ఏఐ టూల్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐ సంస్థ సృష్టించిన గ్రోక్, సెర్చ్ ఇంజిన్ తరహాలో సరికొత్తగా సమాధానాలు ఇచ్చే పెర్ప్లెక్సిటీ, వినూత్నమైన డీప్‌సీక్, సోషల్ మీడియా దిగ్గజం మెటా సంస్థ తీసుకొచ్చిన మెటా ఏఐ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిలో ఒక్కోదానికి మార్కెట్ షేర్ కేవలం ఐదు శాతం లోపు మాత్రమే ఉన్నట్లు తాజా నివేదికల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
మొత్తానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఒకప్పుడు చాట్‌జీపీటీకి మాత్రమే ఉన్న గుత్తాధిపత్యానికి ఇప్పుడు పూర్తిగా తెరపడిందని చెప్పవచ్చు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడం మంచి పరిణామం. ఈ తీవ్రమైన పోటీ వల్ల రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో మరిన్ని సంచలనాత్మక ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.




