ఏడాదిలో 4 సార్లు ఉచితంగా CIBIL స్కోర్ చెక్ చేసుకోవచ్చని తెలుసా.?
CIBIL Score: బ్యాంకు రుణాలు పొందాలనుకునే వారికి CIBIL స్కోర్ ఎంతో ముఖ్యం. RBI నిబంధనల ప్రకారం దేశంలోని నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఏడాదికి ఒక్కో ఉచిత క్రెడిట్ రిపోర్టును అందిస్తున్నాయి.
ఏడాదిలో 4 సార్లు ఉచితంగా CIBIL స్కోర్ చెక్ చేసుకోవచ్చని తెలుసా.?
CIBIL Score: బ్యాంకు రుణాలు పొందాలనుకునే వారికి CIBIL స్కోర్ ఎంతో ముఖ్యం. RBI నిబంధనల ప్రకారం దేశంలోని నాలుగు క్రెడిట్ బ్యూరోలు ఏడాదికి ఒక్కో ఉచిత క్రెడిట్ రిపోర్టును అందిస్తున్నాయి. దీంతో రుణాల చెల్లింపుల వివరాలు, క్రెడిట్ స్కోర్‌తో పాటు రిపోర్టులోని తప్పులను కూడా ఉచితంగా తెలుసుకోవచ్చు.
CIBIL స్కోర్ అంటే ఏమిటి? ఎందుకు ముఖ్యం?
CIBIL స్కోర్ అనేది ఒక వ్యక్తి రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేసే మూడు అంకెల సంఖ్య. ఇది సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఈ స్కోర్ ఆధారంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణం ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుంది. గతంలో తీసుకున్న రుణాల ఈఎంఐలను సకాలంలో చెల్లించారా? క్రెడిట్ కార్డు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయా? ఇప్పటికే ఎంత అప్పు ఉంది? ఇటీవల ఎన్ని రుణాల కోసం దరఖాస్తు చేశారు? వంటి అంశాలు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. సాధారణంగా స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మంచి క్రెడిట్ స్కోర్‌గా పరిగణిస్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే రుణం మంజూరయ్యే అవకాశాలు మెరుగుపడవచ్చు. అయితే బ్యాంకులు కేవలం CIBIL స్కోర్ ఆధారంగానే రుణం మంజూరు చేయవు. ఆదాయం, ఉద్యోగం, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కూడా పరిశీలిస్తాయి.
ఏడాదిలో నాలుగు సార్లు ఉచితంగా రిపోర్టు పొందే అవకాశం
భారత్‌లో నాలుగు ప్రధాన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు ఉన్నాయి. అవి ట్రాన్స్‌యూనియన్ CIBIL, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, CRIF హై మార్క. RBI నిబంధనల ప్రకారం ఈ నాలుగు సంస్థలు వినియోగదారులకు ఏడాదికి ఒకసారి ఉచితంగా పూర్తి క్రెడిట్ రిపోర్టును అందించాలి. అంటే ఒక్కో సంస్థ నుంచి ఒక్కోసారి చొప్పున ఏడాదిలో నాలుగు ఉచిత రిపోర్టులు పొందవచ్చు.
ఈ రిపోర్టులో మీ తాజా క్రెడిట్ స్కోర్, ప్రస్తుతం కొనసాగుతున్న రుణాలు, గతంలో తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వివరాలు ఉంటాయి. అంతేకాకుండా గత 36 నెలల్లో మీరు రుణం లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వివరాలు కూడా కనిపించవచ్చు. RBI ఆదేశాల ప్రకారం బ్యాంకులు, రుణ సంస్థలు ప్రతి 15 రోజులకు ఒకసారి ఖాతాదారుల రుణాలు, చెల్లింపుల వివరాలను క్రెడిట్ బ్యూరోలకు పంపాలి. దీంతో క్రెడిట్ రిపోర్టులో ఎప్పటికప్పుడు కొత్త సమాచారం చేరుతుంది.
ఉచితంగా CIBIL స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి?
మీ క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడానికి ముందుగా ట్రాన్స్‌యూనియన్ CIBIL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ ఉచిత క్రెడిట్ రిపోర్టు పొందే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వాలి. కొత్తగా నమోదు చేసుకునేవారు తమ ఈమెయిల్, మొబైల్ నంబర్‌తో పాటు అడిగిన వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి.
ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని నమోదు చేసి వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అనంతరం వెబ్సైట్లో సూచించిన విధానాన్ని అనుసరించి ఉచిత క్రెడిట్ రిపోర్టును పొందవచ్చు. ఇదే విధంగా ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, CRIF హై మార్క అధికారిక వెబ్సైట్లలో కూడా నమోదు చేసుకుని ఏడాదికి ఒకసారి ఉచిత రిపోర్టును పొందే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ రిపోర్టు చెక్ చేయడం వల్ల ప్రయోజనాలు
క్రమం తప్పకుండా క్రెడిట్ రిపోర్టును పరిశీలించడం వల్ల మీ పేరుపై ఎన్ని రుణాలు ఉన్నాయి? వాటిలో ఎన్ని కొనసాగుతున్నాయి? ఎన్ని పూర్తయ్యాయి? ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తున్నారా? అనే వివరాలు తెలుస్తాయి. కొన్నిసార్లు రుణం పూర్తిగా చెల్లించినా రిపోర్టులో బకాయి ఉన్నట్లు కనిపించవచ్చు. అలాగే మీకు తెలియకుండానే మీ పేరుపై ఎవరో రుణం తీసుకున్న సందర్భాలు కూడా ఉండవచ్చు. ఇలాంటి తప్పులను ముందుగానే గుర్తించడానికి క్రెడిట్ రిపోర్టు ఉపయోగపడుతుంది.
ఒకవేళ రిపోర్టులో రుణ మొత్తం తప్పుగా కనిపించినా, చెల్లించిన ఈఎంఐ పెండింగ్‌లో ఉన్నట్లు చూపించినా లేదా మీకు సంబంధం లేని రుణం కనిపించినా సంబంధిత బ్యాంకు, క్రెడిట్ బ్యూరోకు ఫిర్యాదు చేయవచ్చు. పరిశీలన అనంతరం తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రుణం తీసుకునే అవసరం లేకపోయినా ఏడాదికి కనీసం నాలుగు సార్లు అందుబాటులో ఉన్న ఉచిత క్రెడిట్ రిపోర్టులను ఉపయోగించుకుని మీ ఆర్థిక లావాదేవీలను పరిశీలించుకోవడం మంచిది.




