Red Chilli : మొన్న మామిడి నేడు మిర్చి.. మన పంటలంటే మొఖం చాటేస్తున్న పొరుగు దేశాలు
Red Chilli : పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో భారతదేశం నుంచి వెళ్లిన మూడు ఎండుమిర్చి కంటెయినర్లను చైనా తిరస్కరించింది. అలాగే మూడు ఎగుమతి కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టింది.
Red Chilli
Red Chilli : అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఎండుమిర్చికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎగుమతి అయ్యే మిర్చికి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే తాజాగా భారత ఎగుమతిదారులను తీవ్ర కలవరపెట్టే ఘటన ఒకటి వెలుగుచూసింది. భారతదేశం నుంచి చైనాకు ఎగుమతి అయిన మూడు భారీ ఎండుమిర్చి కంటెయినర్లను చైనా ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. ఈ మిర్చి నాణ్యతా ప్రమాణాల ప్రకారం లేదని, ఇందులో నిషేధిత పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని చైనా కస్టమ్స్ అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారం భారత మిర్చి మార్కెట్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇటీవల నేపాల్, జపాన్ కూడా మనదేశం నుంచి ఎగుమతి అయ్యే మామిడి పండ్లలో మితిమీరిన రసాయనాలు ఉన్నాయని రిజెక్ట్ చేశాయి.
మిథామిడోపాస్ కెమికల్ కలకలం
నిజానికి ఈ మూడు మిర్చి కంటెయినర్లు గత మే నెలలోనే చైనా దేశానికి చేరుకున్నాయి. అక్కడ సరకును పూర్తిగా పరీక్షించిన చైనా లేబొరేటరీ అధికారులు.. ఈ మిర్చిలో మిథామిడోపాస్ అనే ప్రమాదకరమైన పురుగుమందు రసాయనం సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్యానికి హాని కలిగించే ఈ రసాయనం మిర్చిలో దొరకడాన్ని చైనా తీవ్రంగా పరిగణించింది. కేవలం సరుకును తిరస్కరించడమే కాకుండా, ఈ మిర్చిని ఎగుమతి చేసిన భారతదేశానికి చెందిన మూడు ప్రముఖ ఎగుమతి కంపెనీలను చైనా ప్రభుత్వం ఏకంగా బ్లాక్‌లిస్టులో పెట్టేసింది.
ఎగుమతిదారులకు తప్పని భారీ నష్టాలు
చైనా దేశానికి వెళ్లిన తర్వాత అక్కడ సరకు రిజెక్ట్ అయితే ఎగుమతిదారులు ఊహించని రేంజ్ లో నష్టపోవాల్సి వస్తోంది. అంత దూరం వెళ్లిన సరుకును మళ్లీ భారతదేశానికి వెనక్కి తెచ్చుకోవాలంటే డబుల్ రవాణా ఛార్జీలు పడతాయి. అందుకే వ్యాపారులు ఆ మిర్చిని ఇండియాకు తీసుకురాకుండా.. చైనాకు దగ్గరగా ఉండే ఇతర ఆసియా దేశాలకో లేదా ఆఫ్రికా దేశాలకో తక్కువ ధరలకు రవాణా చేసి అక్కడ అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల అదనపు రవాణా ఛార్జీలు, ఓడరేవుల్లో వెయిటింగ్ రుసుములు విపరీతంగా పెరిగిపోయి కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం చైనాకు జరిగే మిర్చి ఎగుమతులు చాలా మందకొడిగా సాగుతున్నాయని ఒక ప్రముఖ వ్యాపారి తెలిపారు.
బూజు పట్టడం కూడా ఒక శాపమే
పురుగుమందుల అవశేషాల సమస్య ఒక్కటే కాదు, మనవాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఎగుమతులపై దెబ్బ కొడుతున్నాయి. మిర్చిని పొలాల్లో కోసిన తర్వాత సరిగ్గా ఎండబెట్టకుండా, కాస్త తడి ఉండగానే ప్యాక్ చేసి కంటెయినర్లలో పంపడం వల్ల పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. ఇండియా నుంచి చైనాకు ఓడల్లో సరుకు వెళ్లడానికి చాలా రోజులు పడుతుంది. ఈ ప్రయాణంలో కంటెయినర్లలోని తేమ కారణంగా మిర్చికి పెద్ద ఎత్తున బూజు వచ్చేసింది. అక్కడికి చేరేసరికి క్వాలిటీ పూర్తిగా దెబ్బతినడం కూడా చైనా అధికారులు కొర్రీలు పెట్టడానికి ఒక ప్రధాన కారణమైంది.
చైనా వద్ద భారీ నిల్వలు.. అందుకే ఈ వంకలా?
అయితే ఈ వ్యవహారంపై భారత మిర్చి మార్కెట్ ప్రతినిధులు మరో కోణాన్ని కూడా వినిపిస్తున్నారు. గతేడాది చైనా దేశం భారతదేశం నుంచి చాలా పెద్ద ఎత్తున ఎండుమిర్చిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం వారి వద్ద పాత స్టాక్ భారీగా నిల్వ ఉంది. ఇప్పుడు వారి దగ్గర సరకు పుష్కలంగా ఉండటం వల్లే, భారత మిర్చి కొనుగోళ్లను తగ్గించడానికి చైనా అధికారులు లేనిపోని కొత్త రూల్స్ చెప్తూ కొర్రీలు వేస్తున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతానికి చైనా ఎగుమతులపై ప్రభావం పడిన మాట నిజమేనని అంగీకరిస్తున్నారు.
తేజ రకానికే ఎక్కువ డిమాండ్.. ప్రస్తుతానికి ధర స్థిరమే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎగుమతి అయ్యే మిర్చిలో సింహభాగం చైనా దేశానికే వెళ్తుంటుంది. ముఖ్యంగా చైనా వాసులు ఇష్టపడే విపరీతమైన ఘాటు, ఎరుపు రంగు ఉండే తేజ రకం మిర్చిని వారు ఎక్కువగా కొంటారు. చైనా ఆర్డర్లు తగ్గడం తేజ మిర్చి రైతులకు కొంత ఆందోళన కలిగించే విషయమే. అయినప్పటికీ, యూరప్, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి మిగిలిన దేశాలకు ఎప్పటిలాగే భారత్ నుంచి ఎగుమతులు సజావుగా సాగుతున్నాయి. అందువల్ల ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లలో మిర్చి ధరలు పడిపోకుండా నిలకడగా కొనసాగుతుండటం మన రైతులకు కాస్త ఊరటనిచ్చే విషయమని చెప్పవచ్చు.




