Petrol Price: సెంచరీ దాటిన క్రూడాయిల్ ధర.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమనేనా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లు దాటాయి. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ భారీగా పెరగడంతో భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ భగ్గుమనే ప్రమాదం పొంచి ఉంది.
Petrol Price
Petrol Price: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్‌తో జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మిడిల్ ఈస్ట్‌కు మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్‌ను పంపాలని ఆలోచిస్తోంది. ఈ పరిణామాల వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగి ఆయిల్ సప్లైకి తీవ్ర అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 102.61 డాలర్లకు, డబ్ల్యూటీఐ క్రూడ్ 93.12 డాలర్లకు చేరుకుంది.
భారత్‌పై పడే ప్రభావం ఏమిటి?
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం భారతదేశం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత్‌లోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచకపోయినా, రాబోయే రోజుల్లో ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.112.12, డీజిల్ రూ.95.20 వద్దే స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మే నెలలోనే చివరిసారిగా ధరలు సవరించారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారతీయ వినియోగదారులకు ఇంధన ధరల మోత తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హర్మూజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు
ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఆయిల్ రూట్లలో హర్మూజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం గుండా వెళ్తున్న ఒక ట్యాంకర్‌పై అజ్ఞాత ప్రొజెక్టైల్ దాడి జరగడంతో ఆందోళనలు మరింత రెట్టింపు అయ్యాయి. మరోవైపు ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు కూడా భారీగా తగ్గిపోయాయి. అమెరికా ఆంక్షల కారణంగా సెప్టెంబర్ నెలలో ఇరాన్ ఎలాంటి క్రూడ్ ఆయిల్‌ను ట్యాంకర్లలో లోడ్ చేయలేదని బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ పరిణామాలు గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి.
అమెరికా సైనిక బలగాల మోహరింపు
పర్షియన్ గల్ఫ్ లో అమెరికా మరో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో పాటు సుమారు 10 వేల మంది నావికాదళ సైనికులను మోహరించేందుకు సిద్ధమవుతోంది. ఇరాన్ వైపు నుంచి ఎలాంటి ప్రతీకార చర్యలు ఎదురైనా గట్టిగా బదులిచ్చేందుకు అమెరికా ఈ వ్యూహం పన్నుతోంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడిలో ఇంధన మౌలిక వసతులు ధ్వంసమైతే చమురు సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా ప్రభుత్వం యూరోపియన్ దేశాల నుంచి వ్యూహాత్మక డీజిల్ నిల్వలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది.




