Crude Oil: 100 డాలర్లు దాటిన క్రూడాయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా?

Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మైలురాయిని దాటేసింది.

CR Reddy
Published on: 10 Sept 2026 7:03 AM IST
Crude Oil
X

Crude Oil

Crude Oil: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ మండిపోతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మైలురాయిని దాటేసింది. దీనివల్ల దేశీయంగా ఇంధనాన్ని విక్రయిస్తున్న చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్‌పై భారీగా నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామం సామాన్యుడిపై ధరల భారం పడేలా చేస్తోందన్న ఆందోళన మొదలైంది. పశ్చిమాసియా ప్రాంతంలో క్రమంగా పెరుగుతున్న యుద్ద ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటడంతో భారత చమురు కంపెనీల ఆర్థిక గణాంకాలు అస్తవ్యస్తమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల ప్రకారం పెట్రోల్ విక్రయంపై లీటరుకు దాదాపు రూ.5 మేర నష్టం వస్తుండగా, డీజిల్ విక్రయంపై లీటరుకు ఏకంగా రూ.23 వరకు నష్టం వాటిల్లుతోంది. ఇవే కాకుండా గృహావసరాలకు వాడే ఎల్పీజీ సిలిండర్‌పై కూడా రూ.200 వరకు అండర్ రికవరీ భారాన్ని కంపెనీలు మోస్తున్నాయి.

మూడు నెలలుగా నిలకడగా ఉన్న ధరలు

దేశంలో ప్రస్తుతం ఇంధన ధరల పెంపు తాత్కాలికంగా ఆగిపోయింది. చివరిసారిగా మే 25వ తేదీన పెట్రోల్, డీజిల్ రేట్లలో సవరణలు చేశారు. ఆ సమయంలో పెట్రోల్ లీటరుకు రూ.2.61, డీజిల్ రూ.2.71 చొప్పున ప్రియం అయ్యాయి. దానికి ముందు మే నెల మొదటి భాగంలో అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల నాలుగు దఫాలుగా పెట్రోల్‌పై రూ.7.35, డీజిల్‌పై రూ.7.53 మేర విక్రయ ధరలను పెంచారు. ఆ తర్వాత నుంచి గత మూడు నెలలుగా వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం వేయకుండా కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.

దేశ దిగుమతి బిల్లుపై భారీ దెబ్బ

ప్రపంచంలోనే అత్యధికంగా ముడి చమురును కొనుగోలు చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. తన ఇంధన అవసరాల కోసం 88 శాతానికి పైగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ తగ్గినా లేదా క్రూడ్ ధరలు పెరిగినా ఆ ప్రభావం నేరుగా విదేశీ మారక ద్రవ్య నిల్వలపై పడుతుంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) నివేదిక ప్రకారం ఏప్రిల్ నుంచి జులై కాలంలో భారత చమురు దిగుమతుల బిల్లు ఏకంగా 56 శాతం పెరిగి 63.4 బిలియన్ డాలర్లకు చేరింది. క్రితం ఏడాది ఇందుకు కేవలం 40.5 బిలియన్ డాలర్లు మాత్రమే ఖర్చయింది.

స్థిరంగా ఉన్న దిగుమతుల పరిమాణం

విశేషమేమిటంటే పరిమాణం పరంగా చమురు దిగుమతులు పెద్దగా పెరగలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో భారత్ 81.9 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకోగా, గత ఏడాది ఇదే సమయానికి 81.5 మిలియన్ టన్నులు కొనుగోలు చేసింది. పరిమాణంలో ఎలాంటి మార్పు లేకపోయినా కేవలం అంతర్జాతీయ విపణిలో ధరలు పెరగడం వల్లే వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story