Crude Oil Prices: రూ.100 దాటిన క్రూడ్ ఆయిల్.. భారత్‌పై పెరగనున్న భారం
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లు దాటాయి. భారత్‌లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 నష్టం వస్తోంది.
Crude Oil Prices
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటింది. దీంతో దేశీయంగా ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలపై భారీ ఆర్థిక భారం పడుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ.5, డీజిల్‌పై రూ.23 నష్టం వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరాలపై ఆందోళనలు పెరగడంతో క్రూడ్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ సుమారు 2.5 శాతం పెరిగి బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ కూడా దాదాపు 2 శాతం పెరిగి 95 డాలర్లకు చేరింది.
భారత్‌పై ఎక్కువ ప్రభావం
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు దిగుమతిదారు, వినియోగదారు అయిన భారత్ అంతర్జాతీయ క్రూడ్ ధరల మార్పులకు ఎక్కువగా ప్రభావితమవుతుంది. దేశ ఇంధన అవసరాల్లో 88 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది.
క్రూడ్ ధరలు ఎక్కువ కాలం ఇదే స్థాయిలో కొనసాగితే భారత్ దిగుమతి బిల్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో వాణిజ్య లోటు, రూపాయి విలువపై కూడా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
పెట్రోల్, డీజిల్‌పై నష్టాలు
ICRA సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కో-గ్రూప్ హెడ్ ప్రశాంత్ వశిష్ట్ ప్రకారం.. సెప్టెంబర్‌లో ఇప్పటివరకు నమోదైన సగటు క్రూడ్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ రంగ ఇంధన మార్కెటింగ్ సంస్థలకు పెట్రోల్‌పై లీటర్‌కు సుమారు రూ.5 నెగెటివ్ మార్జిన్, డీజిల్‌పై రూ.23 నెగెటివ్ మార్జిన్ వస్తోంది.
దేశీయ LPGపై కూడా ఒక్కో సిలిండర్‌కు సుమారు రూ.200 అండర్-రికవరీ ఉన్నట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం భౌగోళిక-రాజకీయ పరిస్థితులు కొనసాగితే ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరఫరాలు పరిమితంగా ఉన్న సమయంలో పలు దేశాలు తమ వ్యూహాత్మక చమురు నిల్వలను వినియోగిస్తున్నాయని, అవి తిరిగి మార్కెట్‌లో కొనుగోళ్లను పెంచితే డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరం
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరుగుతున్నప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మూడు నెలలకు పైగా మారలేదు. చివరిసారిగా మే 25న పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున ధరలు పెంచారు.
మే ద్వితీయార్థంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. దీంతో నాలుగు విడతల్లో పెట్రోల్ ధర మొత్తం రూ.7.35, డీజిల్ ధర రూ.7.53 మేర పెరిగింది.
భారీగా పెరిగిన భారత్ క్రూడ్ దిగుమతి బిల్లు
పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన Petroleum Planning and Analysis Cell (PPAC) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్-జూలై మధ్య భారత్ ముడి చమురు దిగుమతి బిల్లు 56 శాతానికి పైగా పెరిగి 63.4 బిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతి బిల్లు 40.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
అయితే దిగుమతి చేసిన ముడి చమురు పరిమాణంలో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో 81.9 మిలియన్ టన్నుల క్రూడ్ దిగుమతి కాగా, గత ఏడాది ఇదే సమయంలో 81.5 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నారు.
సెప్టెంబర్ 8న భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు 108.91 డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్ సగటు ధర 102.11 డాలర్లుగా ఉండగా, ఆగస్టులో 90.19 డాలర్లు, జూలైలో 82.04 డాలర్లుగా ఉంది.
Brickwork Ratings రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ ప్రకారం.. బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ 100 డాలర్లను దాటడానికి ప్రధాన కారణాలు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ సరఫరాలపై నెలకొన్న ఆందోళనలే. పెరిగిన డిమాండ్ కంటే భౌగోళిక-రాజకీయ పరిణామాలే ప్రస్తుత ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
క్రూడ్ ధరలు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే ఇంధనం, రవాణా, ఇతర ఇంధన ఆధారిత ఖర్చులు పెరిగి దేశీయ ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.




