చేతికి డబ్బులొస్తే అప్పు తీర్చాలా.? పెట్టుబ‌డి పెట్టాలా.? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్ష‌న్

Debt vs Investment: అదనంగా కొంత డబ్బు చేతికి వస్తే ముందుగా లోన్ తీర్చాలా? లేక భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాలా? అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంది.

Mokshith
Published on: 2 Jun 2026 1:56 PM IST
Debt vs Investment
X

చేతికి డబ్బులొస్తే అప్పు తీర్చాలా.? పెట్టుబ‌డి పెట్టాలా.? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్ష‌న్

Debt vs Investment: అదనంగా కొంత డబ్బు చేతికి వస్తే ముందుగా లోన్ తీర్చాలా? లేక భవిష్యత్ కోసం పెట్టుబడి పెట్టాలా? అనే ప్రశ్న తరచుగా ఎదురవుతుంది. కొందరు అప్పు పూర్తిగా తీరిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని భావిస్తారు. మరికొందరు లోన్ ఉన్నప్పటికీ ఇన్వెస్ట్‌మెంట్లు కొనసాగిస్తారు. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్ష‌నో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా వడ్డీ రేటు, రాబడిని పోల్చండి

లోన్‌ను ముందుగా తీర్చాలా లేదా పెట్టుబడి పెట్టాలా అనే నిర్ణయం తీసుకునే ముందు మీ లోన్‌పై ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో, పెట్టుబడి ద్వారా ఎంత రాబడి వచ్చే అవకాశం ఉందో పరిశీలించాలి. ఉదాహరణకు మీ వ్యక్తిగత రుణం (పర్సనల్ లోన్)పై 14 శాతం వడ్డీ ఉంటే, పెట్టుబడుల ద్వారా 10-12 శాతం మాత్రమే రాబడి వచ్చే అవకాశం ఉంటే ముందుగా లోన్ తీర్చడం మంచిది. ఎందుకంటే మీరు ఆదా చేసే వడ్డీ దాదాపు ఖచ్చితమైన లాభంతో సమానం.

అధిక వడ్డీ ఉన్న రుణాలను ముందుగా ముగించాలి

క్రెడిట్ కార్డు బకాయిలు, పర్సనల్ లోన్లు, అధిక EMIలు ఉన్న రుణాలు సాధారణంగా ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి. ఇవి ఎక్కువ కాలం కొనసాగితే మీ ఆర్థిక పరిస్థితిపై భారంగా మారుతాయి. అందువల్ల ఇలాంటి రుణాలను వీలైనంత త్వరగా చెల్లించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించే వడ్డీ భారం తగ్గి, భవిష్యత్‌లో ఎక్కువ మొత్తాన్ని పొదుపు చేయగలుగుతారు.

ప్రతి లోన్ చెడ్డది కాదు

అన్ని రుణాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకు హోమ్ లోన్‌పై సాధారణంగా తక్కువ వడ్డీ ఉంటుంది. అంతేకాకుండా పన్ను మినహాయింపు (ట్యాక్స్ బెనిఫిట్) కూడా లభిస్తుంది. ఒకవేళ మీ హోమ్ లోన్‌పై 8 శాతం వడ్డీ ఉంటే, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా 12 శాతం వరకు రాబడి వచ్చే అవకాశం ఉంటే, EMIలు చెల్లిస్తూ పెట్టుబడులు కొనసాగించడం మంచిది. ఇలా చేస్తే సంపద సృష్టించుకునే అవకాశం ఉంటుంది.

పెట్టుబడులను పూర్తిగా ఆపేయొద్దు

చాలా మంది "అప్పు పూర్తిగా తీరిన తర్వాతే పెట్టుబడులు పెడతాం" అని భావిస్తారు. కానీ ఇది సరైన వ్యూహం కాదు. ఎందుకంటే పెట్టుబడుల్లో అత్యంత ముఖ్యమైనది చక్రవడ్డీ (Compounding) ప్రభావం. ఉదాహరణకు 28 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభించాల్సిన వ్యక్తి, తదుపరి 10 సంవత్సరాలు కేవలం లోన్లు తీర్చడానికే కేటాయిస్తే, చక్రవడ్డీ ద్వారా వచ్చే భారీ లాభాలను కోల్పోతాడు. పెట్టుబడులు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఉత్తమ ఆర్థిక వ్యూహం ఇదే

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ముందుగా కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అధిక వడ్డీ ఉన్న రుణాలను వేగంగా తగ్గించాలి. అదే సమయంలో పెట్టుబడులను కూడా పూర్తిగా ఆపకూడదు. ఉదాహరణకు ప్రతి నెల మీ వద్ద రూ.30,000 మిగులుతుంటే, అందులో రూ.20,000ను లోన్ చెల్లింపులకు, మిగిలిన రూ.10,000ను SIP లేదా ఇతర పెట్టుబడులకు కేటాయించవచ్చు. ఇలా చేస్తే ఒకవైపు అప్పులు తగ్గుతాయి. మరోవైపు భవిష్యత్ సంపద నిర్మాణం కూడా కొనసాగుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story