E85 Fuel : అందుబాటులోకి E85 ఇంధనం.. పెట్రోల్ కంటే చాలా చౌక.. లీటర్ ధర వింటే షాకవుతారు
E85 Fuel : ఢిల్లీలో తొలిసారిగా E85 ఇంధనాన్ని లీటరుకు రూ.82.12 ధరతో ప్రారంభించారు. ఇది సాధారణ పెట్రోల్ కంటే రూ.20 చౌకగా లభిస్తుంది.
E85 Fuel
E85 Fuel : భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త E85 ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనాన్ని అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి జూన్ 5న ఢిల్లీలోనే మొట్టమొదటి E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్‌ను ప్రారంభించారు. దీనితో ఈ సరికొత్త ఇంధనం వాణిజ్యపరంగా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చినట్లయింది. న్యూఢిల్లీలోని పూసా రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ బంకులో ఈ తొలి ఈ85 పంపును ఏర్పాటు చేశారు.
ఈ సరికొత్త E85 ఇంధనం లాంచ్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధానాంశం దాని ధర అనే చెప్పాలి. ప్రస్తుతం ఢిల్లీలో ఈ E85 ఇంధనాన్ని లీటర్ కేవలం రూ.82.12 లకే విక్రయిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ మార్కెట్లో అందుబాటులో ఉన్న సాధారణ E20 పెట్రోల్ ధర రూ.102.12 గా ఉంది. అంటే సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ కొత్త ఇంధనం లీటరుకు ఏకంగా రూ.20లు చౌకగా లభిస్తోంది. ఇక ప్రీమియం క్వాలిటీ కలిగిన XP95 పెట్రోల్ ధర రూ.109.24గా ఉంది. దీనితో పోల్చితే వాహనదారులకు ఇది భారీ ఉపశమనం కలిగించే విషయమే.
అసలు E85 ఇంధనం ఎందుకు అంత తక్కువ ధర?
ఈ కొత్త E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, కేవలం 15 శాతం మాత్రమే స్వచ్ఛమైన పెట్రోల్ కలిసి ఉంటుంది. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవడానికి, పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఇథనాల్ ఆధారిత ఇంధనాలను ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అయితే సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో శక్తి సామర్థ్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకే కస్టమర్లను ఆకర్షించడానికి, తక్కువ మైలేజ్ నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం దీని ధరను సాధారణ పెట్రోల్ కంటే రూ.20 తక్కువగా నిర్ణయించింది.
ఇందులో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే?
తక్కువ ధరకే ఇంధనం లభిస్తున్నప్పటికీ ఇందులో వాహనదారులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇథనాల్‌లో పెట్రోల్ కంటే దాదాపు మూడో వంతు తక్కువ ఎనర్జీ ఉంటుంది. దీనివల్ల ఈ ఇంధనాన్ని వాడే వాహనాలు తక్కువ దూరానికే ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేస్తాయి. ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం, సాధారణ E20 పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే.. ఈ E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు 25 నుంచి 35 శాతం వరకు తక్కువ మైలేజ్‌ను ఇస్తాయి. కాబట్టి బంకులో మిగిలే రూ.20ల లాభం.. తక్కువ మైలేజ్ వల్ల కొంతవరకు తగ్గిపోయే అవకాశం ఉంది.
ఈ ఇంధనం ఏయే వాహనాలకు సెట్ అవుతుంది?
ప్రస్తుతానికి భారతదేశంలో ఈ E85 ఇంధనంతో నడిచే వాహనాలు చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ ఇంధనాన్ని కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలలో మాత్రమే వాడాలి. ప్రస్తుతం మార్కెట్లో హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (ధర రూ.82,710), హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (ధర రూ.72,792) బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సుజుకి సంస్థకు చెందిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 FFV (ధర రూ.1.98 లక్షలు) బైక్ కూడా ఈ ఇంధనానికి సపోర్ట్ చేస్తుంది. మరోవైపు మారుతి సుజుకి తన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను ప్రదర్శించినప్పటికీ, ఇంకా మార్కెట్లోకి విడుదల చేయలేదు.
దేశవ్యాప్తంగా భారీ విస్తరణ ప్రణాళికలు
ప్రస్తుతానికి ఈ E85 ఇంధనం కేవలం ఢిల్లీ-ఎన్‌సీఆర్, మహారాష్ట్రలోని ఎంపిక చేసిన కొన్ని ఇండియన్ ఆయిల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది. అయితే దీని నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా వేగంగా విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం.. 2026 చివరి నాటికి భారతదేశం అంతటా దాదాపు 500 ఇథనాల్ బంకులను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే 2027 నాటికి ఈ సంఖ్యను ఏకంగా 5,000 అవుట్‌లెట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు మార్కెట్లోకి వస్తే ఈ ఇంధనానికి మంచి ఆదరణ లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.




