ధ‌ర ఎంతున్నా త‌గ్గేదేలే.. ధ‌న్‌తేర‌స్ సంద‌ర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు

Gold: ధన్‌తేరస్‌ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. బంగారం, వెండి కొనుగోళ్లతో పాటు ఇంటి అలంకరణ వస్తువులు, సంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

Mokshith
Published on: 7 Nov 2026 3:53 PM IST
Gold
X

ధ‌ర ఎంతున్నా త‌గ్గేదేలే.. ధ‌న్‌తేర‌స్ సంద‌ర్భంగా భారీగా బంగారం కొనుగోళ్లు

Gold: ధన్‌తేరస్‌ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయి. బంగారం, వెండి కొనుగోళ్లతో పాటు ఇంటి అలంకరణ వస్తువులు, సంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ కొనుగోలుదారుల ఉత్సాహం తగ్గడం లేదు.

భారీగా పెరిగిన తేలికపాటి బంగారు ఆభరణాల డిమాండ్

బంగారం ధరలు పెరగడంతో ఈసారి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పు కనిపిస్తోంది. గతంలో ఎక్కువ బరువున్న ఆభరణాల కొనుగోలుకు ఆసక్తి చూపినవారు ఇప్పుడు తక్కువ బరువున్న నగల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 14, 18 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన తేలికపాటి ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. ఆల్ ఇండియా జ్యువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (AIJGF) తెలిపిన వివరాల ప్రకారం.. తక్కువ బడ్జెట్‌లో బంగారం కొనాలనుకునే వారికి ఈ ఆభరణాలు మంచి ఎంపికగా మారాయి.

దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం

ఈ ధన్‌తేరస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా రూ.లక్ష కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది. ఇందులో బంగారం, వెండి అమ్మకాలే ప్రధాన వాటాను కలిగి ఉండనున్నాయి. ఈ రెండు విలువైన లోహాల విక్రయాలు కలిపి రూ.60 వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. ధరలు పెరిగినా పండుగ సందర్భంగా కొనుగోళ్లకు ప్రజలు వెనుకాడటం లేదని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.

ధరలు పెరిగినా తగ్గని కొనుగోళ్ల సందడి

బంగారం, వెండి ధరలు పెరగడంతో వినియోగదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా వస్తువులను ఎంచుకుంటున్నారు. కొందరు తక్కువ బరువున్న బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు వెండి నాణేలు, అలంకరణ వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి అలంకరణకు అవసరమైన వస్తువులు, సంప్రదాయ సామగ్రి కొనుగోళ్లు కూడా జోరుగా సాగుతున్నాయి. దీంతో ధరల పెరుగుదల ఉన్నప్పటికీ మార్కెట్లలో పండుగ సందడి కనిపిస్తోంది. వ్యాపారులు కూడా ఈసారి మంచి అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నారు.

వెండి నాణేలు, శుభప్రదమైన ఆకృతులకు గిరాకీ

ఈసారి ధన్‌తేరస్‌ కొనుగోళ్లలో వెండి వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెండి నాణేలు, అలంకరణ వస్తువులు, సంప్రదాయ బహుమతులను కొనుగోలు చేసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చేప, తాబేలు, ఏనుగు ఆకారాల్లో తయారుచేసిన వెండి వస్తువులకు కూడా డిమాండ్ పెరిగింది. ఈ ఆకృతులను ఇంట్లో ఉంచితే శుభం కలుగుతుందని, సుఖసంతోషాలు, సంపద పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అందుకే ధన్‌తేరస్‌ సందర్భంగా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తంగా బంగారం, వెండి ధరలు పెరిగినా ఈ పండుగ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.