ఈ దీపావళికి కొత్త కారు కొనాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీకే కార్ లోన్ ఇస్తున్న బ్యాంకులివే!

Car Loan Offers: ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకులు ఆకర్షణీయమైన కార్ లోన్ ఆఫర్లు ప్రకటించాయి.

Mokshith
Published on: 3 Nov 2026 4:36 PM IST
Car Loan Offers
X

ఈ దీపావళికి కొత్త కారు కొనాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీకే కార్ లోన్ ఇస్తున్న బ్యాంకులివే!

Car Loan Offers: ఈ దీపావళికి కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. పండుగ సీజన్ సందర్భంగా పలు బ్యాంకులు ఆకర్షణీయమైన కార్ లోన్ ఆఫర్లు ప్రకటించాయి. కేవలం 7.55 శాతం ప్రారంభ వడ్డీ రేటుతో పాటు జీరో ప్రాసెసింగ్ ఫీజు, లోన్‌ను ముందుగానే చెల్లిస్తే ఫోర్‌క్లోజర్ ఛార్జీల మినహాయింపు వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి.

పండుగ సీజన్‌లో కార్ లోన్లపై ప్రత్యేక ఆఫర్లు

మధ్యతరగతి కుటుంబాలకు సొంత కారు కొనడం ఒక పెద్ద కల. అయితే ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడం అందరికీ సాధ్యం కాదు. దీంతో చాలామంది బ్యాంకుల నుంచి కార్ లోన్ తీసుకుని వాయిదాల రూపంలో డబ్బు చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో దీపావళి 2026 సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ప్రత్యేక ఆఫర్లతో ముందుకొచ్చాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్ సహా పలు బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. బ్యాంక్‌బ‌జార్‌.కామ్ అక్టోబర్ 23 నాటి వివరాల ప్రకారం.. కొన్ని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7.55 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేయగా.. మరికొన్ని ముందుగానే రుణం చెల్లించినప్పుడు విధించే ఫోర్‌క్లోజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు బ్యాంకుల నిబంధనలు, షరతులకు లోబడి ఉంటాయి.

ప్రాసెసింగ్ ఫీజు లేకుండా రుణాలు ఇస్తున్న ప్రభుత్వ బ్యాంకులు

కొత్త కారు కొనేటప్పుడు డౌన్ పేమెంట్‌తో పాటు ప్రాసెసింగ్ ఫీజు కూడా అదనపు ఖర్చుగా మారుతుంది. అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఫీజును పూర్తిగా రద్దు చేశాయి.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఈ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేటు 7.70 నుంచి 12 శాతం వరకు ఉంది. రూ.5 లక్షలను ఐదేళ్ల కాలానికి రుణంగా తీసుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.10,067 నుంచి రూ.11,122 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు.

ఇండియన్ బ్యాంక్: ఇక్కడ వడ్డీ రేటు 7.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది. రూ.5 లక్షల రుణానికి నెలవారీ ఈఎంఐ రూ.10,031 నుంచి రూ.11,034 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: వడ్డీ రేటు 7.80 నుంచి 12 శాతం వరకు ఉంది. ఈఎంఐ రూ.10,090 నుంచి రూ.11,122 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడం లేదు.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 2026 డిసెంబర్ 31 వరకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది. వడ్డీ రేటు 7.75 నుంచి 9.55 శాతం వరకు ఉంది. ఐదేళ్లకు రూ.5 లక్షల రుణం తీసుకుంటే ఈఎంఐ రూ.10,078 నుంచి రూ.10,513 వరకు చెల్లించాలి.

అతి తక్కువ వడ్డీకి కార్ లోన్ ఇస్తున్న బ్యాంకులు

అత్యంత తక్కువ ప్రారంభ వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తున్న బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ముందుంది. ఈ బ్యాంకులో వడ్డీ రేటు 7.55 శాతం నుంచి 14.30 శాతం వరకు ఉంది. రూ.5 లక్షల రుణానికి ఐదేళ్ల పాటు నెలకు రూ.10,031 నుంచి రూ.11,712 వరకు ఈఎంఐ చెల్లించాలి. అయితే రుణ మొత్తంలో 0.25 శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తారు. ఇది కనిష్ఠంగా రూ.1,000, గరిష్ఠంగా రూ.15,000 వరకు ఉంటుంది.

ఇక కెనరా బ్యాంక్, యూకో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7.70 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి.

కెనరా బ్యాంక్: వడ్డీ రేటు 7.70 నుంచి 11.70 శాతం వరకు ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.10,067 నుంచి రూ.11,047 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది.

యూకో బ్యాంక్: వడ్డీ రేటు 7.70 నుంచి 10.25 శాతం వరకు ఉంది. ఈఎంఐ రూ.10,067 నుంచి రూ.10,685 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 0.5 శాతం కాగా.. గరిష్ఠంగా రూ.5,000 వసూలు చేస్తారు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు 7.75 నుంచి 10.25 శాతం వరకు ఉంది. ఈఎంఐ రూ.10,078 నుంచి రూ.10,685 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్ఠంగా రూ.1,000.

SBI, PNB, HDFC సహా ఇతర బ్యాంకుల్లో ఈఎంఐ వివరాలు

ఇక దేశంలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కార్ లోన్‌పై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో రూ.5 లక్షల రుణాన్ని ఐదేళ్ల కాలానికి తీసుకుంటే చెల్లించాల్సిన ఈఎంఐ వివరాలు ఇలా ఉన్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI): వడ్డీ రేటు 8.45 నుంచి 9.50 శాతం వరకు ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.10,246 నుంచి రూ.10,501 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.500 నుంచి రూ.2,000 వరకు ఉంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): వడ్డీ రేటు 7.85 నుంచి 10.95 శాతం వరకు ఉంది. ఈఎంఐ రూ.10,102 నుంచి రూ.10,859 మధ్య ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా: వడ్డీ రేటు 7.85 నుంచి 11.55 శాతం వరకు ఉంది. నెలవారీ ఈఎంఐ రూ.10,102 నుంచి రూ.11,009 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు గరిష్ఠంగా రూ.2,000.

బ్యాంక్ ఆఫ్ ఇండియా: వడ్డీ రేటు 7.85 నుంచి 12.55 శాతం వరకు ఉంది. ఈఎంఐ రూ.10,102 నుంచి రూ.11,262 వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.2,500 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది.

HDFC బ్యాంక్: వడ్డీ రేటు 8.25 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభ ఈఎంఐ రూ.10,198. ప్రాసెసింగ్ ఫీజు రూ.3,500 నుంచి రూ.8,000 వరకు ఉండొచ్చు.

ICICI బ్యాంక్: వడ్డీ రేటు 8.40 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభ ఈఎంఐ రూ.10,234. ప్రాసెసింగ్ ఫీజు గరిష్ఠంగా రూ.8,500 వరకు ఉండవచ్చు.

లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి: పైన పేర్కొన్న వడ్డీ రేట్లు, ఈఎంఐలు బ్యాంకులు ప్రకటించిన వివరాల ఆధారంగా ఇచ్చినవి. ప్రతి ఒక్కరికీ ఇదే వడ్డీ రేటు వర్తిస్తుందని చెప్పలేం. రుణం తీసుకునే వ్యక్తి ఆదాయం, క్రెడిట్ స్కోర్ (CIBIL), గతంలో రుణాలు చెల్లించిన తీరు, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి.

కాబట్టి కేవలం తక్కువ వడ్డీ రేటును మాత్రమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు, ముందస్తు చెల్లింపు నిబంధనలను కూడా పరిశీలించి రుణం తీసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.