Price: దీపావళి షాపింగ్‌కు పెరిగిన ఖర్చు.. గతేడాదితో పోలిస్తే ఏయే వస్తువుల ధరలు ఎంత పెరిగాయంటే!

Price: దీపావళి పండుగ వేళ సామాన్యుల జేబుపై మళ్లీ భారం పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పండుగ కొనుగోళ్ల ఖర్చు గణనీయంగా పెరిగింది. పాల నుంచి ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల వ‌ర‌కూ అన్నింటి ధ‌ర‌లు పెరిగాయి.

Mokshith
Published on: 6 Nov 2026 2:09 PM IST
Price
X

Price: దీపావళి షాపింగ్‌కు పెరిగిన ఖర్చు.. గతేడాదితో పోలిస్తే ఏయే వస్తువుల ధరలు ఎంత పెరిగాయంటే!

Price: దీపావళి పండుగ వేళ సామాన్యుల జేబుపై మళ్లీ భారం పడుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పండుగ కొనుగోళ్ల ఖర్చు గణనీయంగా పెరిగింది. పాల నుంచి ఎల‌క్ట్రానిక్స్ వ‌స్తువుల వ‌ర‌కూ అన్నింటి ధ‌ర‌లు పెరిగాయి. ఈ దీపావళికి గతేడాది కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాలు, నెయ్యి, వెన్న ధరలు ఎంత పెరిగాయంటే?

దీపావళి సమయంలో పాల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అమూల్, కర్ణాటకకు చెందిన నందిని, తమిళనాడుకు చెందిన ఆవిన్ డెయిరీ సంస్థలు పలు ఉత్పత్తుల ధరలను పెంచాయి.

అమూల్ కిలో నెయ్యి ప్యాకెట్ ధర రూ.630 నుంచి రూ.680కి పెరిగింది. 500 గ్రాముల నెయ్యి ధర రూ.325 నుంచి రూ.345కు చేరింది. వెన్న ధరలు కూడా పెరిగాయి. 100 గ్రాముల ప్యాకెట్ ధర రూ.63 నుంచి రూ.66కు, 500 గ్రాముల ప్యాకెట్ ధర రూ.310 నుంచి రూ.325కు చేరింది.

కర్ణాటకలో నందిని డెయిరీ నవంబర్ 4 నుంచి నెయ్యి, వెన్న, పనీర్, పాల ధరల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం 500 మిల్లీలీటర్ల నెయ్యి ధర రూ.425, లీటర్ నెయ్యి ధర రూ.850గా ఉంది. 100 గ్రాముల వెన్న ధర రూ.90కి, 500 గ్రాముల వెన్న ధర రూ.380కి చేరింది.

తమిళనాడుకు చెందిన ఆవిన్ సంస్థ కూడా ధరలు పెంచింది. 100 మిల్లీలీటర్ల నెయ్యి ధర రూ.80 నుంచి రూ.95కు, 200 మిల్లీలీటర్ల నెయ్యి ధర రూ.160 నుంచి రూ.180కి పెరిగింది. ఈ ధరల పెరుగుదల ప్రభావం స్వీట్ల తయారీపై కూడా పడుతోంది.

పిస్తా, బాదం, కాజు ధరలు కూడా పైపైకి..

దీపావళి స్వీట్లు, బహుమతి ప్యాకెట్లలో డ్రైఫ్రూట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే ఈసారి వాటి ధరలు కూడా భారీగా పెరిగాయి. గత ఏడాది దీపావళితో పోలిస్తే కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ ధరలు ఏకంగా 70 శాతం వరకు పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో పిస్తా ధరలు ఎక్కువగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 60 నుంచి 70 శాతం వరకు ధరలు పెరిగాయి. బాదం ధరలు రకాన్ని బట్టి 20 నుంచి 40 శాతం పెరిగాయి.

స్వీట్ల తయారీలో ఉపయోగించే పేషావరి పిస్తా కిలో ధర రూ.4,000కు చేరింది. గత ఆరు నెలల్లోనే దాదాపు 40 శాతం పెరిగింది. పొట్టు తీసిన పిస్తా టోకు ధర ఏడాదిలో 74 శాతం పెరిగి కిలో రూ.1,650కు చేరింది. ఇతర డ్రైఫ్రూట్స్ ధరలు కూడా పెరిగాయి. కాజు ధరలు 5-8 శాతం, కిస్మిస్ 2-5 శాతం, ఖర్జూరం 5-10 శాతం, అంజీర్ ధరలు 5-15 శాతం వరకు పెరిగాయి. దీంతో స్వీట్లు తయారు చేసే వ్యాపారులపై కూడా ఖర్చుల భారం పెరిగింది.

ఆహార ధరల పెరుగుదలతో పెరుగుతున్న ఆందోళన

నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ప్రభావం ద్రవ్యోల్బణ గణాంకాల్లోనూ కనిపిస్తోంది. 2026 సెప్టెంబర్‌లో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 7.74 శాతానికి చేరింది. మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం 5.54 శాతంగా నమోదైంది. ఇది ఆర్బీఐ నిర్దేశించిన 6 శాతం గరిష్ఠ పరిమితికి దగ్గరగా ఉంది.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్‌లో చక్కెర ధరలు గత ఏడాదితో పోలిస్తే 29.8 శాతం పెరిగాయి. చక్కెర ధరల పెరుగుదల ప్రభావం స్వీట్లు, ఇతర తీపి పదార్థాల తయారీ ఖర్చుపై పడుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆగస్టులో 37 శాతం వస్తువుల ద్రవ్యోల్బణం 4 శాతానికి మించి ఉంది. మార్చిలో ఈ సంఖ్య 20 శాతంగా మాత్రమే ఉంది.

టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌ల ధరలు కూడా పెరుగుదల

దీపావళి సమయంలో కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తుంటారు. అయితే ఈసారి ఆ కొనుగోళ్లు కూడా ఖరీదైనవిగా మారాయి. మీడియా నివేదికల ప్రకారం.. గత ఏడాది కాలంలో ఏసీలు, టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు మొత్తం మీద 23 శాతం వరకు పెరిగాయి.

ఈ ఏడాది కంపెనీలు వేర్వేరు దశల్లో మూడుసార్లు ధరలను పెంచాయి. తాజాగా 2026 అక్టోబర్‌లో పండుగల సీజన్‌కు ముందు మరోసారి 3 నుంచి 8 శాతం వరకు ధరలు పెంచాయి. దీంతో ఈసారి దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్ కొనాలన్నా, ఇంటికి కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవాలన్నా గత ఏడాది కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు పండుగ ఖర్చులు మరింత భారంగా మారుతున్నాయి

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.