Dmart: డీమార్ట్ రాబడి చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్!

Dmart: డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ క్యూ2 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 18.4% వృద్ధితో రూ.19,206 కోట్ల ఆదాయాన్ని సాధించింది.

Gagan kumar
Published on: 5 Oct 2026 10:03 AM IST
Dmart
X

Dmart: డీమార్ట్ రాబడి చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్!

Radhakishan Damani: సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎవరికైనా ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్ ‘డీమార్ట్’ . ప్రముఖ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ నేతృత్వంలోని అవెన్యూ సూపర్ మార్ట్స్ .. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికానికి (జులై-సెప్టెంబర్) సంబంధించిన కీలక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. పండగల సీజన్‌కు ముందే అమ్మకాలు జోరందుకోవడంతో కంపెనీ అదిరిపోయే వృద్ధిని నమోదు చేసింది.

జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో డీమార్ట్ మాతృ సంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఏకీకృత రాబడి గణనీయమైన వృద్ధిని సాధించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.19,206.18 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.16,218.79 కోట్లుగా ఉండగా ఈసారి ఏకంగా 18.4 శాతం వృద్ధిని కనబరిచింది. ఇక గత క్యూ1 (ఏప్రిల్-జూన్) త్రైమాసికంతో పోలిస్తే డీమార్ట్ ఆదాయం 4.7 శాతం బలపడింది.

మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో డీమార్ట్ తన సేవలను అందిస్తోంది. టైర్-2, టైర్-3 నగరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. పోటీ సంస్థల నుంచి వస్తున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కంపెనీ ముందుకు సాగుతోంది.

క్యూ2 సమయంలోనూ కంపెనీ దేశవ్యాప్తంగా మరికొన్ని కొత్త స్టోర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డీమార్ట్ అవుట్‌లెట్ల సంఖ్య 581కి చేరుకుంది. పండుగల సీజన్ ప్రారంభం కావడానికి ముందే వినియోగదారులు నిత్యావసరాలు, గృహోపకరణాల కొనుగోళ్లకు మొగ్గు చూపడం డీమార్ట్ రాబడి పెరిగేందుకు ప్రధాన కారణంగా నిలిచింది.

వ్యాపార వృద్ధి సానుకూలంగా ఉండటంతో రాబోయే త్రైమాసిక తుది ఫలితాలపై మార్కెట్ నిశ్చలంగా, ఉత్సాహంగా అంచనాలు వేస్తోంది. క్యూ2 అప్‌డేట్ల ప్రకటన వేళ డీమార్ట్ షేరు చివరి ట్రేడింగ్ సెషన్‌లో లాభాలతో రూ.3,830 వద్ద ముగిసింది. గత వారం రోజుల్లో 1 శాతం, గత నెల రోజుల్లో 1.59 శాతం లాభపడింది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు షేరు సుమారు 3 శాతం పుంజుకుంది. ప్రస్తుతం కంపెనీ మొత్తం మార్కెట్ విలువ సుమారు రూ.2.48 లక్షల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.4,644 కాగా, కనిష్ఠ ధర రూ.3,529 వద్ద నమోదైంది. సుదీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ లాభాలను అందించిన డీమార్ట్.. ప్రస్తుతం మళ్లీ తన వృద్ధి బాటను వేగవంతం చేస్తుండటం ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.