DMart vs Blinkit: డీమార్ట్‌కు గట్టి దెచ్చేసిన బ్లింకిట్..!

DMart vs Blinkit: డీమార్ట్, బ్లింకిట్ సేల్స్ మధ్య వ్యత్యాసం కేవలం రూ. 54 కోట్లకు తగ్గింది. క్విక్ కామర్స్ దిగ్గజం బ్లింకిట్ 94 శాతం వృద్ధితో డీమార్ట్‌కు సవాల్ విసురుతోంది.

Gagan kumar
Published on: 25 Oct 2026 2:23 PM IST
DMart vs Blinkit
X

DMart vs Blinkit: డీమార్ట్‌కు గట్టి దెచ్చేసిన బ్లింకిట్..!

Supermarket: భారతీయుల కొనుగోలు తీరుతెన్నులు శరవేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు వీకెండ్ వస్తే చాలు కుటుంబంతో కలిసి పెద్ద సూపర్‌మార్కెట్‌కు వెళ్లి ట్రాలీ నిండా సరుకులు సర్దుకోవడం సాధారణం. కానీ, డిజిటల్ యుగంలో ఆ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు కావాల్సిన వస్తువు ఏదైనా సరే, మొబైల్ యాప్‌లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లోనే గుమ్మం ముందు వాలిపోతోంది. ఈ మార్పునకు జూలై - సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలే ఉదాహరణగా చూపించవచ్చు.

డీమార్ట్ అమ్మకాలు: రూ. 19,206 కోట్లు

బ్లింకిట్ అమ్మకాలు: రూ. 19,152 కోట్లు

ఈ రెండు గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అగ్రగామిగా ఉన్న డీమార్ట్‌కు, దూసుకుపోతున్న బ్లింకిట్‌కు మధ్య తేడా కేవలం రూ. 54 కోట్లు మాత్రమే. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే బ్లింకిట్ అమ్మకాల విలువ ఏకంగా 94 శాతం పెరిగింది. గతేడాది రూ. 9,891 కోట్లుగా ఉన్న అమ్మకాలు, ఇప్పుడు ఏకంగా రూ. 19,152 కోట్లకు చేరి దాదాపు రెట్టింపు అయ్యాయి. మరోవైపు డీమార్ట్ వృద్ధి రేటు కేవలం 18 శాతానికే పరిమితమైంది. క్విక్ కామర్స్ సేవలకు వినియోగదారుల నుంచి పెరుగుతున్న విపరీతమైన ఆదరణే డీమార్ట్ వృద్ధి వేగం మందగించడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

డీమార్ట్ 24 ఏళ్ల ప్రయాణంలో దేశవ్యాప్తంగా 518 స్టోర్లు మాత్రమే ఏర్పాటు చేసింది. ప్రతి స్టోర్‌కు సగటున త్రైమాసికంలో రూ. 37 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కస్టమర్లే స్వయంగా స్టోర్‌కు వెళ్లాలి. బ్లింకిట్ కేవలం గత 3 నెలల్లోనే కొత్తగా 308 స్టోర్లు తెరిచి, మొత్తం డార్క్ స్టోర్ల సంఖ్యను 2,751కి చేర్చింది. అయితే ఇవి కస్టమర్లు వెళ్లే దుకాణాలు కావు, కేవలం ఆర్డర్లు డెలివరీ చేసే గిడ్డంగులు. ప్రతి డార్క్ స్టోర్ ద్వారా సగటున త్రైమాసికంలో రూ. 7 కోట్ల అమ్మకాలు నమోదవుతున్నాయి. వ్యాపారంలో కేవలం టర్నోవర్ మాత్రమే ముఖ్యం కాదు, చివరికి ఎంత మిగులుతోంది అన్నదే అసలైన బలం. ఇక్కడే ఈ రెండు కంపెనీల మధ్య అసలైన వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.

డీమార్ట్‌లో ప్రతి రూ. 100 అమ్మకంపై సుమారు రూ. 7.30 లాభం మిగులుతోంది. కస్టమర్లే స్వయంగా స్టోర్‌కు వచ్చి కొనుగోలు చేయడం వల్ల డెలివరీ ఖర్చులు పెద్దగా ఉండవు.బ్లింకిట్‌లో ప్రతి రూ. 100 అమ్మకంపై మిగులుతున్నది కేవలం రూపాయి మాత్రమే. ఆర్డర్లను వేగంగా ప్యాక్ చేయడం, డెలివరీ బాయ్‌ల ద్వారా ఇంటికి చేర్చడం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా ఉండటమే దీనికి కారణం. అంటే, అమ్మకాల పరంగా డీమార్ట్‌కు అత్యంత సమీపంలోకి దూసుకొచ్చినప్పటికీ.. లాభాల విషయంలో మాత్రం బ్లింకిట్ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.

నెలవారీ సరుకులు, తక్కువ ధరలకు ఎక్కువ వస్తువులు కావాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు డీమార్ట్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అనుభూతిని కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వేదిక. వంట చేస్తుండగా పాలు అయిపోయినా, అత్యవసరంగా కూరగాయలు కావాలన్నా, బిజీ షెడ్యూల్ వల్ల బయటకు వెళ్లలేని వారికి నిమిషాల్లో సరుకులు అందించే క్విక్ కామర్స్ అద్భుతం. అయితే డెలివరీ ఛార్జీలు, మినిమం ఆర్డర్ పరిమితులు వంటివి కొన్నిసార్లు అదనపు భారంగా మారుతుంటాయి.

ఇప్పుడు రాబోయే పండగ సీజన్‌తో డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. సేల్స్‌లో బ్లింకిట్ ఏకంగా డీమార్ట్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుందా? లేక లాభాల మార్జిన్‌తో డీమార్ట్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? వేచి చూడాలి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.