Driving Licence New Rules: డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్లో భారీ మార్పులు: టెస్టులో 75% మార్కులు వస్తేనే లైసెన్స్

Driving Licence New Rules: డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించింది. ఆన్‌లైన్ పరీక్షలో ఇక 75 శాతం మార్కులు తప్పనిసరి కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Oct 2026 12:26 AM IST
Driving Licence New Rules
X

Driving Licence New Rules: డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనల్లో భారీ మార్పులు: టెస్టులో 75% మార్కులు వస్తేనే లైసెన్స్

Driving Licence New Rules: డ్రైవింగ్ లైసెన్స్‌ పొందే వారికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రోడ్డు భద్రతను మెరుగుపరచడంతో పాటు వాహనదారుల్లో సురక్షిత డ్రైవింగ్‌పై అవగాహన పెంచే లక్ష్యంతో నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో పాస్‌ మార్కులను ప్రస్తుత 60 శాతం నుంచి 75 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రతిపాదిత నిబంధనలపై ప్రజలు, సంబంధిత వర్గాల నుంచి 30 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. అందిన అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 75% మార్కులు

కొత్త ప్రతిపాదనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం నిర్వహించే ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో ఇకపై కనీసం 75 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పాస్‌ మార్కులు 60 శాతంగా ఉన్నాయి. డ్రైవింగ్‌ భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై దరఖాస్తుదారులకు మెరుగైన అవగాహన కల్పించేందుకు ఈ మార్పు తీసుకొస్తున్నారు.

అలాగే డ్రైవింగ్‌ భద్రతకు సంబంధించిన ట్యుటోరియల్‌ కనీసం 30 నిమిషాల పాటు ఉండేలా నిబంధనల్లో ప్రతిపాదించారు. పరీక్షకు ముందు సురక్షిత డ్రైవింగ్‌ అంశాలపై అవసరమైన అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.

పేరు, చిరునామా మార్పులకు గడువు

డ్రైవింగ్‌ లైసెన్స్‌లో పేరు లేదా చిరునామా వంటి వివరాలను మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కొత్త నిబంధనలు ప్రతిపాదించారు. దరఖాస్తును అధికారులు 15 రోజుల్లోగా పరిశీలించి ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది.

చిరునామా మార్పు కోసం చేసిన దరఖాస్తుపై 30 రోజుల్లోగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, దాన్ని ఆమోదించినట్లుగా పరిగణించే నిబంధనను కూడా ముసాయిదాలో చేర్చారు.

కొన్ని ఆన్‌లైన్‌ సేవలకు ఫీజు మినహాయింపు

ఆధార్‌ అథంటికేషన్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పొందే కొన్ని డ్రైవింగ్‌ లైసెన్స్‌ సేవలకు ఫీజు మినహాయింపు కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది. ముఖ్యంగా పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసుకునే సేవలకు సంబంధించిన ఛార్జీలను తొలగించే అవకాశం ఉంది.

దీంతో ఆన్‌లైన్‌ సేవలను మరింత సులభతరం చేయడంతో పాటు, లైసెన్స్‌ వివరాల మార్పుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గుర్తింపు, చిరునామా ధ్రువీకరణకు ఇవి చెల్లుబాటు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ సేవల్లో గుర్తింపు, వయసు, చిరునామా ధ్రువీకరణ కోసం పలు పత్రాలను అనుమతించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, ఓటర్‌ ఐడీ, జనన ధ్రువీకరణ పత్రం, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఇ-రేషన్‌ కార్డు వంటి వాటిని పరిగణనలోకి తీసుకోనున్నారు.

అదేవిధంగా గత మూడు నెలల్లో జారీ అయిన విద్యుత్‌, గ్యాస్‌ బిల్లులను కూడా చిరునామా ధ్రువీకరణకు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే చిరునామా ధ్రువీకరణ పత్రాల జాబితా నుంచి ఎల్‌ఐసీ పాలసీలను తొలగించాలని ముసాయిదా ప్రతిపాదించింది.

లైసెన్స్‌ ఇక లేమినేటెడ్‌ లేదా పీవీసీ కార్డులోనే

కొత్తగా జారీ చేసే డ్రైవింగ్‌ లైసెన్సులతో పాటు రెన్యువల్‌ చేసే లైసెన్సులను కూడా లేమినేటెడ్‌ లేదా పీవీసీ కార్డు రూపంలో జారీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పత్రాల రూపం, జారీ ప్రక్రియలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. కొత్త ప్రతిపాదనల్లో రోడ్డు భద్రతకు సంబంధించిన పరీక్షలను కఠినతరం చేయడంతో పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ సేవలను మరింత డిజిటల్‌, పారదర్శకంగా మార్చే అంశాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఇవన్నీ ప్రస్తుతం ముసాయిదా ప్రతిపాదనలు మాత్రమే. 30 రోజుల అభిప్రాయాల స్వీకరణ అనంతరం తుది నిబంధనలు ఖరారయ్యే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్