Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్..ఇకపై 75 శాతం మార్కులొస్తేనే పాస్!

Driving License: కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలలో కీలక మార్పులు ప్రతిపాదించింది.

Gagan kumar
Updated on: 24 Oct 2026 8:30 AM IST
Driving License
X

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్..ఇకపై 75 శాతం మార్కులొస్తేనే పాస్!

Driving License New Rules: దేశంలో రహదారి భద్రతను మరింత కఠినతరం చేయడం, ఆర్టీఓ సేవల ప్రక్రియను పారదర్శకంగా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ఉపరితల రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలలో కీలక సవరణలకు శ్రీకారం చుట్టింది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా నిబంధనల ప్రకారం.. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా లెర్నర్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడంతో పాటు, వివరాల మార్పునకు కఠినమైన గడువును విధించనున్నారు.

ఇప్పటివరకు ఆన్‌లైన్ లెర్నర్ లైసెన్స్ పరీక్షలో ఉన్న పాస్ మార్కులను కేంద్రం పెంచింది. సురక్షిత డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్‌మెంట్‌లో అర్హత సాధించాలంటే ఇకపై కనీసం 75 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. కనీసం 30 నిమిషాల పాటు జరిగే ఈ అసెస్‌మెంట్ ద్వారా డ్రైవింగ్ నిబంధనలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌పై దరఖాస్తుదారులకు పూర్తి అవగాహన ఉండేలా దీన్ని మరింత కఠినతరం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలలో ఏవైనా మార్పులు జరిగితే, ఆ వివరాలను 15 రోజుల్లోగా ఆర్టీఓ పోర్టల్‌లో అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేశారు.

పరివాహన్ పోర్టల్ ద్వారా ప్రజలు పొందే కొన్ని ఆన్‌లైన్ సేవలకు సంబంధించి రుసుములను రద్దు చేసి, వాటిని పూర్తిగా ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు నిబంధన యథావిధిగా కొనసాగనుంది.

కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌లో ఈ ప్రతిపాదనలన్నీ పొందుపరిచారు. అయితే, ఇవి ప్రస్తుతానికి తుది నిబంధనలు కావు. ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాతే ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి వస్తాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.