సైబర్ మోసగాళ్లకు ఇక మొండిచేయే.. భయపెడుతోన్న కొత్త ఫీచర్.. మన అకౌంట్స్ అన్నీ సేఫ్..!
Dual OTP System: ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథా ఎంచుకున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వృద్ధులను, అమాయక గృహిణులను, పిల్లలను టార్గెట్ చేస్తున్నారు.
సైబర్ మోసగాళ్లకు ఇక మొండిచేయే.. భయపెడుతోన్న కొత్త ఫీచర్.. మన అకౌంట్స్ అన్నీ సేఫ్..!
Dual OTP System: డిజిటల్ యుగంలో రెక్కాడితే గాని డొక్కాడని సామాన్యుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు అందరినీ సైబర్ నేరగాళ్లు నిలువునా ముంచుతున్నారు. భయాందోళనలకు గురిచేసి నిమిషాల్లో అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లకు చెక్ పెట్టేందుకు బ్యాంకింగ్ రంగం ఇప్పుడు ఒక సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని సంధించింది. అదే 'డ్యూయల్ ఓటీపీ' (Dual OTP) విధానం.
అమాయకులను బలితీసుకుంటున్న 'డిజిటల్ అరెస్ట్' దందా..
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథా ఎంచుకున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వృద్ధులను, అమాయక గృహిణులను, పిల్లలను టార్గెట్ చేస్తున్నారు. "మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చింది.. సిబిఐ అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు" అంటూ ఫోన్లలో భయపెడుతున్న సంగతి తెలిసిందే. దీనిని 'డిజిటల్ అరెస్ట్' అని పిలుస్తున్నారు. ఈ భయాందోళనల్లో బాధితులు తమకు తెలియకుండానే బ్యాంక్ రహస్యాలను, ఓటీపీలను సైబర్ దొంగలకు చెప్పేసి జీవితకాల సంపాదనను ఒక్క క్షణంలో పోగొట్టుకుంటున్నారు. అయితే, ఇలాంటి మోసాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకే ఈ సరికొత్త భద్రతా వలయం రూపుదిద్దుకుంది.
ఏమిటీ 'డ్యూయల్ ఓటీపీ' (Dual OTP) వ్యవస్థ?
సాధారణంగా మనం ఆన్‌లైన్ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు లేదా షాపింగ్ చేసినప్పుడు, మన బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) వస్తుంది. అది ఎంటర్ చేస్తేనే డబ్బులు కట్ అవుతాయి. కానీ, ఈ సరికొత్త 'డ్యూయల్ ఓటీపీ' విధానంలో భద్రత రెట్టింపు అవుతుంది. ఇందులో ఒకే లావాదేవీకి రెండు వేర్వేరు ఓటీపీలు అవసరమవుతాయి.
మొదటి ఓటీపీ: ఎప్పటిలాగే ఖాతాదారుడి మొబైల్ నెంబర్‌కు వస్తుంది.
రెండవ ఓటీపీ: ఖాతాదారుడు ముందే ఎంపిక చేసుకున్న తన కుటుంబ సభ్యుడికి (భార్య, భర్త, పిల్లలు లేదా నామినీ) లేదా నమ్మకస్థుడైన వ్యక్తి మొబైల్ నెంబర్‌కు వెళ్తుంది.
ఆన్‌లైన్ ట్రాన్ జాక్సన్ పూర్తి కావాలంటే ఈ రెండు ఓటీపీలను నిర్ణీత సమయంలోగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మీరు ఓటీపీ చెప్పినా.. పైసా కూడా కట్ అవ్వదు!
ఈ విధానం వల్ల జరిగే అతిపెద్ద ప్రయోజనం ఇదే. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ఎంతగా భయపెట్టినా, ఒకవేళ మీరు కంగారులో మీ ఫోన్‌కు వచ్చిన మొదటి ఓటీపీని వారికి చెప్పేసినా సరే.. మీ అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు. ఎందుకంటే, రెండవ ఓటీపీ మీ ఇంట్లోని మరో సభ్యుడి ఫోన్‌కు వెళ్తుంది కాబట్టి, వారు అప్రమత్తమై ఆ లావాదేవీని నిలిపివేయవచ్చు. తద్వారా మోసాలను వంద శాతం అడ్డుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధుల ఆర్థిక భద్రతకు ఇదొక రక్షణ కవచంలా మారుతుంది.
సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో, మోసాలు కూడా అంతే స్థాయిలో విస్తరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బ్యాంకులు ప్రవేశపెడుతున్న 'డ్యూయల్ ఓటీపీ' లాంటి వ్యవస్థలు సామాన్యుల సొమ్ముకు కొండంత అండగా నిలుస్తాయి. సైబర్ వలలకు చిక్కకుండా ఉండాలంటే సాంకేతిక రక్షణతో పాటు మనలో అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. భయం వీడి, వివేకంతో ఆలోచిస్తే ఏ సైబర్ దొంగ కూడా మనల్ని ఏమీ చేయలేడు.




