Festival Sales: అరెండు రోజుల్లోనే 24,000 కోట్లు ఊదేశారు..!
Festival Sales: పండగ సీజన్ ఈ-కామర్స్ సేల్స్ తొలి రెండ్రోజుల్లోనే రూ. 24,000 కోట్ల భారీ అమ్మకాలు నమోదయ్యాయి.
Festival Sales: అరెండు రోజుల్లోనే 24,000 కోట్లు ఊదేశారు..!
Festival Sales: భారతదేశంలో పండగ సీజన్ షాపింగ్ సందడి అంబరాన్ని తాకింది. డిజిటల్ షాపింగ్ కార్ట్‌లు సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ఈ-కామర్స్ దిగ్గజాలు ప్రారంభించిన ఫెస్టివల్ సేల్స్ తొలి రెండ్రోజుల్లోనే రూ. 24,000 కోట్ల భారీ అమ్మకాలను నమోదు చేశాయి. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ వెల్లడించిన ఈ నివేదిక దేశంలో ఆన్‌లైన్ వినియోగ మార్కెట్ ఏ స్థాయిలో దూసుకుపోతుందో స్పష్టం చేస్తోంది. సాధారణ రోజువారీ వ్యాపారంతో పోలిస్తే ఈ అమ్మకాలు ఏకంగా ఆరు రెట్లు అధికంగా ఉండటం విశేషం.
ఈ పండగ సేల్‌లో వినియోగదారులు అత్యధికంగా టెక్నాలజీ ఉత్పత్తుల వైపే మొగ్గు చూపారు. మొత్తం జీఎంవీలో సుమారు 38 నుంచి 40 శాతం వాటాతో స్మార్ట్‌ఫోన్‌లు అగ్రస్థానంలో నిలిచాయి. కేవలం తొలి రెండ్రోజుల్లోనే రూ. 9,100 కోట్ల నుంచి రూ. 9,600 కోట్ల విలువైన ఫోన్‌లు అమ్ముడయ్యాయి.ఇక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగం 25-27 శాతం వాటాతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ ఉన్న టీవీలు , రిఫ్రిజిరేటర్లు, ఏసీలకు ఊహించని డిమాండ్ లభించింది.
కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, టైర్-2 , చిన్న పట్టణాల నుంచి కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు అపూర్వ స్పందన లభించింది. పండగ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల విభాగం గత ఏడాదితో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సాధించింది. చిన్న నగరాల్లో పండుగ వేళ దుస్తుల కొనుగోళ్లు సాధారణ రోజుల కంటే ఏకంగా 3 నుంచి 5 రెట్లు అధికంగా నమోదయ్యాయి.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, అజియో వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లలో తొలి 48 గంటల్లోనే సుమారు 6 నుంచి 6.5 కోట్ల మంది వినియోగదారులు షాపింగ్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 8 నుంచి 9 కోట్ల ఆర్డర్లు నమోదయ్యాయి. భవిష్యత్తులో ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో పాటు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు వినియోగదారులను పెద్ద ఎత్తున ఆన్‌లైన్ బాట పట్టేలా చేశాయి. మొత్తానికి, పండగ ఆరంభంలోనే ఈ-కామర్స్ రంగం అందుకున్న ఈ ఊపు చూస్తుంటే.. ఈసారూ ఆన్‌లైన్ విక్రయాలు సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.




