ముడిచమురు దిగుమతులకు చెక్.. ఈ20తో దేశానికి భారీ ప్రయోజనం!
భారత్ ఇంధన భద్రతకు ఈ20 ఎథనాల్ కీలకమని డాక్టర్ ఆర్.ఏ. మశేల్కర్ అన్నారు. స్వదేశీ ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు.
E20 Fuel
భారత్ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం ఈ20 (E20) కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ రఘునాథ్ అనంత్ మశేల్కర్ పేర్కొన్నారు. దేశీయంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని వేగవంతం చేయడం ద్వారా దిగుమతి ముడిచమురుపై ఆధారపడటం తగ్గించవచ్చని ఆయన అన్నారు.
భారత్ అమలు చేస్తున్న ఈ20 ఇంధన కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన మశేల్కర్, ఎథనాల్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సమర్థవంతమైన రవాణా ఇంధనంగా నిరూపితమైందని చెప్పారు. బ్రెజిల్లో గత 30 నుంచి 40 ఏళ్లుగా వాహనాలు ఎథనాల్తో విజయవంతంగా నడుస్తున్నాయని, అదే ఈ ఇంధనం సామర్థ్యానికి నిదర్శనమని వివరించారు.
పశ్చిమాసియాలో ఇటీవల నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో దేశీయంగా ఉత్పత్తి చేసే ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెంచడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
దిగుమతి ఇంధనాలపై అధికంగా ఆధారపడటం వల్ల ప్రపంచ స్థాయి ఘర్షణలు, సరఫరా అంతరాయాల ప్రభావం నేరుగా దేశంపై పడుతుందని పేర్కొన్నారు. అందుకే స్వదేశీ ఇంధన ఉత్పత్తిని పెంచుతూ ఇంధన స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎథనాల్తో పాటు మెథనాల్, డైమిథైల్ ఈథర్, కంప్రెస్డ్ బయోగ్యాస్, బయోమాస్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధిపైనా భారత్ సమాంతరంగా దృష్టి సారించాలని మశేల్కర్ సూచించారు.




