E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. రోజుకు 12 సార్లు టెస్టులు

ఈ20 పెట్రోల్ నాణ్యతపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా 87 వేలకుపైగా బంకుల్లో రోజుకు 8-12 సార్లు పరీక్షలు జరుగుతున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Aug 2026 3:00 AM IST
E20 Petrol Quality
X

E20 Petrol Quality

E20 Petrol Quality : ఈ20 పెట్రోల్‌ నాణ్యతపై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ నాణ్యతను చమురు మార్కెటింగ్‌ సంస్థలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలోని 87 వేలకు పైగా పెట్రోల్‌ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషితం, కల్తీకి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు క్లోరైడ్‌ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలను మాత్రమే గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు ఘటనలు గుర్తించిన పెట్రోల్‌ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేసినట్లు పేర్కొంది.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 వేలకు పైగా ఇంధన నమూనాలను క్లోరైడ్‌, సల్ఫైడ్‌ కలుషితానికి పరీక్షించినట్లు కేంద్రం వెల్లడించింది. ఎక్కడైనా ఇంధనంలో కలుషితం లేదా కల్తీ ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇంధన సరఫరా వ్యవస్థలోని ప్రతి దశను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చమురు మార్కెటింగ్‌ సంస్థలను ఆదేశించినట్లు తెలిపింది.

ఈ20 ఇథనాల్‌కు 99.6 శాతం స్వచ్ఛత తప్పనిసరి

ఈ20 పెట్రోల్‌లో కలిపే ఇథనాల్‌ బీఐఎస్‌ ఐఎస్‌ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం పేర్కొంది. ఇథనాల్‌ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండటం తప్పనిసరి అని తెలిపింది. ప్రతి ఇథనాల్‌ సరఫరాకు నాణ్యత ధ్రువీకరణ నివేదిక కూడా ఉండాలని స్పష్టం చేసింది.

ఇథనాల్‌ నిల్వ కోసం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రతి ట్యాంకర్‌ను స్వీకరించే ముందు దాని పైభాగం, దిగువ భాగం నుంచి నమూనాలను సేకరించి పరీక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రతి డెలివరీకి ముందు కూడా నాణ్యత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించింది.

302 ఇథనాల్‌ ట్యాంకర్ల తిరస్కరణ

నాణ్యత ప్రమాణాలను పాటించని ఇథనాల్‌ ట్యాంకర్ల విషయంలోనూ కేంద్రం వివరాలు వెల్లడించింది. 2024 జులై నుంచి 2026 జూన్‌ వరకు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు తెలిపింది. వీటిలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్‌ ఉన్నట్లు పేర్కొంది.

ఈ20 పెట్రోల్‌పై ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు నాణ్యత తనిఖీలను నిరంతరం కొనసాగిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఇంధనంలో కల్తీ లేదా కలుషితం గుర్తించిన సందర్భాల్లో సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story