Egg Price Hike: గుడ్డు ధరలు భగ్గుమంటున్నాయ్.. అసలు కారణం ఇదే!

ఇథనాల్ తయారీకి మక్కజొన్న వినియోగం పెరగడంతో పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Aug 2026 1:21 PM IST
Egg Price Hike
X

Egg Price Hike

Egg Price: సామాన్యుడికి అందుబాటులో ఉండే ప్రొటీన్‌ ఆహారంగా భావించే కోడిగుడ్డు ధరలు మరోసారి పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గుడ్డు ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది. ఇథనాల్ తయారీ కోసం మక్కజొన్న వినియోగం పెరగడం వల్ల పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరిగి, గుడ్ల ధరలపై ప్రభావం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

రూ.7 నుంచి రూ.9 వరకు..

ప్రస్తుతం ఫామ్‌గేట్ వద్ద ఒక్క కోడిగుడ్డు ధర సుమారు రూ.7గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.8.50 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. దీంతో గతంతో పోలిస్తే గుడ్డు ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

రాబోయే చలికాలంలో గుడ్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరలో లభించే ప్రొటీన్‌ వనరుగా గుడ్డును ఎక్కువ మంది తీసుకుంటారు. దీంతో ధరలు మరింత పెరిగితే సామాన్యులపై అదనపు భారం పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గుడ్డు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

ఇథనాల్ తయారీకి చెరుకుతో పాటు మక్కజొన్నను కూడా పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నారు. ఇదే సమయంలో పౌల్ట్రీ ఫీడ్‌లో మక్కజొన్నకు కీలక స్థానం ఉంది. నిపుణుల ప్రకారం పౌల్ట్రీ ఫీడ్‌లో సుమారు 50–55 శాతం వరకు మక్కజొన్న వినియోగిస్తారు. మిగిలిన భాగంలో ప్రధానంగా సోయాబీన్ వంటి పదార్థాలు ఉంటాయి.

ఇథనాల్ తయారీ కేంద్రాలకు మక్కజొన్న తరలింపు పెరగడంతో దాని ధరలు పెరుగుతున్నాయని, ఫలితంగా పౌల్ట్రీ ఫీడ్ ధరలు కూడా పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఫీడ్ ఖర్చులు పెరగడం చివరకు కోడిగుడ్డు ధరలపై ప్రభావం చూపుతున్నట్లు వివరిస్తున్నారు.

ఇథనాల్ కోసం భారీగా మక్కజొన్న వినియోగం

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా 2025లో లోక్‌సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024–25లో 125.75 లక్షల మెట్రిక్ టన్నుల మక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించారు.

అదే ఏడాదిలో మక్కజొన్న ఆధారిత డిస్టిలరీలకు 477.8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి కేటాయింపులు జరిగాయి. కేవలం రెండేళ్ల వ్యవధిలో ఇథనాల్ తయారీ కోసం మక్కజొన్న వినియోగం 8.3 లక్షల టన్నుల నుంచి 125.75 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొన్నారు.

ఇక 2025–26లోనూ 125.78 లక్షల టన్నుల మక్కజొన్నను ఇథనాల్ ఉత్పత్తికి కేటాయించినట్లు సమాచారం. మక్కజొన్నకు ఇథనాల్ రంగం నుంచి పెరుగుతున్న డిమాండ్ పౌల్ట్రీ రంగంపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story