Egg Prices Hike: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకో తెలుసా?
Egg Prices Hike: మొక్కజొన్న కొరత, కోళ్ల దాణా ఖర్చులు పెరగడంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. రానున్న చలికాలంలో ఇవి మరింత ప్రియం కానున్నట్లు నివేదికలు.
Egg Prices Hike: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న గుడ్ల ధరలు.. ఎందుకో తెలుసా?
Egg Prices Hike: తక్కువ ఖర్చుతో అత్యధిక ప్రొటీన్లు, పోషకాలను అందించే కోడిగుడ్డు సామాన్యుడికి మరింత భారం కానుంది. గత కొన్ని నెలలుగా మార్కెట్లో గుడ్ల ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రముఖ పరిశోధన సంస్థ ‘లోకల్‌సర్కిల్స్’ (LocalCircles) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం.. గడిచిన ఆరు నెలల కాలంలో గుడ్ల ధరలు 10 నుంచి 50 శాతానికి పైగా పెరిగాయి. ధరల భారం కారణంగా సుమారు 48 శాతం కుటుంబాలు తమ రోజువారీ గుడ్ల తగ్గించుకున్నట్లు వెల్లడైంది. గతంలో ఫామ్‌ల వద్ద ఒక్కో గుడ్డు ధర రూ.4.94 ఉండగా, ప్రస్తుతం అది రూ.7కి చేరింది. దీని ప్రభావంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.8.50 నుంచి రూ.9 వరకు విక్రయిస్తున్నారు.
ఈ రీతిగా గుడ్ల ధరలు ఆకాశాన్నంటడానికి పౌల్ట్రీ రంగానికి అవుతున్న ఉత్పత్తి వ్యయమే ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం కోళ్ల పెంపకంలో దాణా ఖర్చే 65 నుంచి 70 శాతం వరకు ఉంటుంది. ప్రస్తుతం ఇథనాల్ తయారీ పరిశ్రమల నుంచి మొక్కజొన్నకు విపరీతమైన గిరాకీ పెరగడంతో మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడి కోళ్ల దాణా ధరలు భారీగా ప్రియమయ్యాయి. దీనికితోడు వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల కోస్తా ఆంధ్ర ప్రాంతంలోనే దాదాపు 16 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడటంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
ధరల మంట కేవలం సాధారణ వినియోగదారుల పైనే కాకుండా ప్రభుత్వ పోషకాహార పథకాలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేసే గుడ్ల బడ్జెట్ తలకిందులైంది. ఉదాహరణకు ఒడిశాలో ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.7 చొప్పున కేటాయిస్తే, మార్కెట్లో రూ.9 నుంచి రూ.10 పెట్టి కొనాల్సి వస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కల్తీ భయాలు, నాణ్యతా లోపాలు కూడా వినియోగం తగ్గడానికి కారణమవుతున్నాయి.
ప్రస్తుతం వర్షాకాలం ముగిసి చలికాలం ప్రారంభం కానుండటంతో గుడ్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం, దాణా ఖర్చులు తగ్గకపోవడంతో రాబోయే రోజుల్లో గుడ్ల ధరలు మరిన్ని రికార్డులను తిరగరాస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పోషకాహారం మరింత భారంగా మారనుంది.




