EMI: ట్రాప్‌లో ప‌డుతోన్న యువ‌త‌.. ఖ‌ర్చులు పెర‌గ‌డానికి ఇదే కార‌ణమా.?

EMI: ప్రస్తుతం ఈఎమ్ఐ అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారిపోయింది. మొబైల్ ఫోన్, టీవీ, ఫ్రిజ్, ల్యాప్‌టాప్, ఫర్నిచర్ ఇలా ఏ వస్తువు కొనాలన్నా సులభమైన నెలవారీ కిస్తీల సౌకర్యం అందుబాటులో ఉంటోంది.

Mokshith
Published on: 11 Sept 2026 2:26 PM IST
EMI
X

EMI: ట్రాప్‌లో ప‌డుతోన్న యువ‌త‌.. ఖ‌ర్చులు పెర‌గ‌డానికి ఇదే కార‌ణమా.? 

EMI: ప్రస్తుతం ఈఎమ్ఐ అనే పదం ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా మారిపోయింది. మొబైల్ ఫోన్, టీవీ, ఫ్రిజ్, ల్యాప్‌టాప్, ఫర్నిచర్ ఇలా ఏ వస్తువు కొనాలన్నా సులభమైన నెలవారీ కిస్తీల సౌకర్యం అందుబాటులో ఉంటోంది. ముఖ్యంగా యువతలో EMI ద్వారా కొనుగోళ్లు చేసే అలవాటు వేగంగా పెరుగుతోంది.

కొత్త ఫోన్ కోసం కూడా.. EMIపై ఆధారపడుతున్న యువత

ఉదాహరణకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకుందాం. మన దగ్గర ఇప్పటికే పనిచేసే మంచి ఫోన్ ఉన్నా.. కొత్త మోడల్ వచ్చిందంటే కొనాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఒకేసారి రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ చెల్లించాలంటే ఆలోచిస్తారు. అదే వస్తువు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు EMIతో వస్తే కొనడం సులభంగా అనిపిస్తుంది.

ఇదే విధంగా మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్, టీవీ, ఫ్రిజ్, ఎయిర్ ఫ్రయర్, ఫర్నిచర్ వంటి వాటిని కూడా కిస్తీల్లో కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఒక వస్తువు కొనాలంటే ముందుగా డబ్బు కూడబెట్టి, అవసరమైన మొత్తం చేతిలోకి వచ్చిన తర్వాతే కొనేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ‘బై నౌ పే లేట‌ర్‌’ అనే విధానం యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది.

35 ఏళ్లలోపు వారిలో పెరిగిన రుణాల వినియోగం

యువతలో రుణాలు, EMIల వినియోగం పెరుగుతున్న విషయాన్ని కొన్ని గణాంకాలు కూడా సూచిస్తున్నాయి. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ 2026 మార్చిలో విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2025 డిసెంబర్ త్రైమాసికంలో 35 ఏళ్లలోపు కొత్తగా రుణాలు తీసుకున్న వారి సంఖ్య 2024తో పోలిస్తే 17 శాతం పెరిగింది. తొలిసారి రుణం తీసుకున్న వారిలో 35 ఏళ్లలోపు యువత వాటా 58 శాతంగా ఉంది.

ఇదే సమయంలో టీవీ, ఫ్రిజ్ వంటి వినియోగ వస్తువుల కోసం తీసుకునే కన్జ్యూమర్ డ్యూరబుల్ రుణాలు 22 శాతం పెరిగాయి. అంటే అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు కూడా క్రెడిట్‌పై ఆధారపడే పరిస్థితి పెరుగుతోందని అర్థం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. 2025 మార్చి నాటికి బ్యాంకుల వ్యక్తిగత రుణాలు ఏడాది వ్యవధిలో 14 శాతం పెరిగాయి. ఇందులో క్రెడిట్ కార్డులు, వాహన రుణాలు ఇతర వ్యక్తిగత రుణాలు ఉన్నాయి.

ఒక్క EMIతో ఆగ‌దు..

సాధారణంగా ఒక EMI తీసుకున్నప్పుడు అది పెద్ద సమస్యగా అనిపించదు. ఉదాహరణకు రూ.80 వేల ఫోన్‌కు నెలకు రూ.3,500 EMI ఉందనుకుందాం. ఆ మొత్తం సులభంగానే చెల్లించవచ్చని అనిపిస్తుంది. కొంతకాలానికి ల్యాప్‌టాప్ అవసరం రావచ్చు. దానికి మరో EMI మొదలవుతుంది. తర్వాత బైక్, టీవీ లేదా ఇంట్లోని మరేదైనా వస్తువు కోసం ఇంకో కిస్తీ తీసుకోవచ్చు.

ఒక్కొక్కటి విడిగా చూస్తే చిన్న మొత్తంగానే కనిపిస్తాయి. కానీ నెలాఖరులో అన్ని EMIలను కలిపితే జీతంలో పెద్ద భాగం కిస్తీలకే వెళ్లిపోవచ్చు. దీంతో ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, పొదుపు, అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు మిగలకపోవచ్చు. అందుకే EMI తీసుకునే ముందు ప్రస్తుతం ఉన్న కిస్తీలను కూడా లెక్కలోకి తీసుకోవాలి.

జీతంలో EMIలు 30 శాతానికి మించకూడదు

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి నెలవారీ ఆదాయంలో గరిష్ఠంగా 30 శాతం వరకు మాత్రమే మొత్తం EMIలకు కేటాయించడం మంచిది. ఉదాహరణకు నెలకు రూ.50 వేల ఆదాయం ఉంటే అన్ని రకాల EMIలు కలిపి రూ.15 వేలలోపు ఉండేలా చూసుకోవాలి. మిగిలిన మొత్తంలో ఇంటి ఖర్చులు, పిల్లల అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, పొదుపు, అత్యవసర నిధి వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎందుకంటే ఉద్యోగంలో మార్పులు రావచ్చు. ఆదాయం తగ్గవచ్చు. పెళ్లి తర్వాత ఖర్చులు పెరగవచ్చు. పిల్లలు పుట్టిన తర్వాత విద్య, వైద్యం వంటి ఖర్చులు పెరుగుతాయి. అనుకోని వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకే జీతం మొత్తం కిస్తీలకే వెళ్లిపోయేలా రుణాలు తీసుకోవడం భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు.

EMI తప్పు కాదు.. కానీ అవసరం తెలుసుకుని తీసుకోవాలి

EMI తీసుకోవడం పూర్తిగా తప్పు కాదు. ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఖరీదైన వస్తువును నెలవారీ చెల్లింపులతో కొనుగోలు చేసే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే EMI సౌకర్యం ఉందని అవసరం లేని వస్తువులను కొనడం మాత్రం ప్రమాదకరం. EMI అంటే ఖర్చు తగ్గడం కాదు.. ఒకేసారి చెల్లించాల్సిన పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న కిస్తీలుగా విభజించడం మాత్రమే.

అందుకే ఏ వస్తువైనా కొనేముందు ‘నాకు ఇది నిజంగా అవసరమా?’ అని ఆలోచించాలి. తర్వాత మొత్తం ఎన్ని రూపాయలు చెల్లించాలి, EMI ఎన్ని నెలలు ఉంటుంది, వడ్డీ ఎంత, ఇతర ఛార్జీలు ఉన్నాయా అనే వివరాలను పరిశీలించాలి. యువతలో పెరుగుతున్న EMI అలవాటు మార్కెట్‌కు, వ్యాపారాలకు డిమాండ్ పెంచే అంశంగా ఉపయోగపడొచ్చు. కానీ వ్యక్తిగత ఆర్థిక జీవితంలో మాత్రం సమతుల్యత చాలా ముఖ్యం. కోరికలు తీర్చుకోవచ్చు.. కానీ EMIలు ఆదాయంలో 30 శాతానికి మించకుండా చూసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.