EPF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? ఈ చిన్న విషయాలను కూడా లైట్ తీసుకోకండి!
EPF: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులు తమ PF వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
EPF: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? ఈ చిన్న విషయాలను కూడా లైట్ తీసుకోకండి!
EPF: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులు తమ PF వివరాలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉద్యోగంలో చేరిన తేదీ (DoJ), ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ (DoE) సరిగ్గా నమోదై ఉన్నాయో లేదో పరిశీలించాలి. ఈ వివరాల్లో చిన్న తప్పు ఉన్నా PF ట్రాన్స్‌ఫర్, డబ్బు విత్‌డ్రాయల్‌లో ఇబ్బందులు రావచ్చు. అంతేకాదు.. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద పెన్షన్ అర్హతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
పీఎఫ్ ఖాతాలో తేదీలు ఎందుకు ముఖ్యం.?
ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ మీ UANకు సంబంధించిన సర్వీస్ హిస్టరీలో నమోదవుతాయి. ఈ తేదీల ఆధారంగానే మీరు ఎంతకాలం ఉద్యోగం చేశారో, ఎప్పటి నుంచి PFకు కంట్రిబ్యూషన్ చెల్లించారో లెక్కిస్తారు. ఈ వివరాల్లో ఏదైనా తప్పుగా ఉంటే మీ అసలు ఉద్యోగ కాలం సరిగ్గా నమోదు కాకపోవచ్చు.
ముఖ్యంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఇది సమస్యగా మారుతుంది. గత ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జిట్ డేట్ సరిగ్గా నమోదు కాకపోతే PF ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
తప్పు ఎగ్జిట్ డేట్‌తో ఏం జరుగుతుంది?
ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ తప్పుగా ఉంటే PF కంట్రిబ్యూషన్ రికార్డుపై కూడా ప్రభావం పడొచ్చు. EPFO ఎలక్ట్రానిక్ చలాన్ విధానం ప్రకారం.. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి ఉద్యోగం ముగిసిన తేదీ వరకు ఉన్న కాలానికే కంట్రిబ్యూషన్ చెల్లించవచ్చు. అందువల్ల ఎగ్జిట్ డేట్ తప్పుగా నమోదై ఉంటే ఆ తేదీ తర్వాతి కంట్రిబ్యూషన్ వివరాలను సరిచేయాల్సి రావచ్చు.
ఉద్యోగం మారినప్పుడు PF ట్రాన్స్‌ఫర్ చేయడంలో కూడా ఇలాంటి తప్పులు ఆలస్యానికి కారణమవుతాయి. అయితే ఉద్యోగంలో చేరిన లేదా బయటకు వచ్చిన తేదీ తప్పుగా ఉండటం వల్ల ఇప్పటికే ఉన్న PF డబ్బు పోదు. PF ఖాతాలోని బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కింపు కొనసాగుతుంది. వడ్డీ మొత్తం ఖాతాలో ఉన్న బ్యాలెన్స్, కంట్రిబ్యూషన్లపై ఆధారపడి ఉంటుంది.
EPS పెన్షన్‌పై కూడా ప్రభావం
EPFలో తేదీలు తప్పుగా నమోదైతే ముఖ్యంగా EPS పెన్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందేందుకు సాధారణంగా కనీసం 10 సంవత్సరాల అర్హత కలిగిన సర్వీస్ అవసరం. మీ ఉద్యోగ కాలం 10 సంవత్సరాలకు దగ్గరగా ఉంటే.. ఉద్యోగంలో చేరిన తేదీ లేదా బయటకు వచ్చిన తేదీలో ఉన్న తప్పు మీ సర్వీస్ లెక్కింపుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే PFతో పాటు పెన్షన్‌కు సంబంధించిన సర్వీస్ హిస్టరీ కూడా సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
తప్పు తేదీలను ఎలా సరిచేయాలి?
EPFO ప్రకారం UAN ఆధార్‌తో వెరిఫై అయి ఉన్న సభ్యులు తమ ప్రొఫైల్‌లోని కొన్ని వివరాలను స్వయంగా సరిచేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ వంటి వివరాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఎలాంటి పత్రాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే మార్పులు చేసుకోవచ్చు. అయితే 2017 అక్టోబర్ 1 కంటే ముందు జారీ చేసిన పాత UANలకు సంబంధించిన కొన్ని మార్పులకు యజమాని ధృవీకరణ అవసరం కావచ్చు.
ఎగ్జిట్ డేట్ నమోదు కాకపోతే.. ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన 60 రోజుల తర్వాత సభ్యుడు స్వయంగా దాన్ని అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం EPFO మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి.. మేనేజ్=== మార్క్ ఎగ్జిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. సంబంధిత PF ఖాతాను ఎంపిక చేసి ఎగ్జిట్ తేదీ, కారణాన్ని నమోదు చేసి ఆధార్‌కు వచ్చిన OTPతో ధృవీకరించాలి.
ఉద్యోగం మారినప్పుడే PF వివరాలు చెక్ చేసుకోండి
PF డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసే సమయంలో లేదా విత్‌డ్రా చేసుకునే సమయంలో మాత్రమే రికార్డులను పరిశీలించడం మంచిది కాదు. ఉద్యోగం మారిన వెంటనే UANలోని PF సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాలి.
ముఖ్యంగా DoJ (ఉద్యోగంలో చేరిన తేదీ), DoE (ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తేదీ), యజమాని వివరాలు, PF కంట్రిబ్యూషన్ హిస్టరీ, సర్వీస్ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించాలి. చిన్న తప్పును ముందుగానే గుర్తించి సరిచేసుకుంటే భవిష్యత్తులో PF ట్రాన్స్‌ఫర్, విత్‌డ్రాయల్ లేదా EPS పెన్షన్ క్లెయిమ్ సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించుకోవచ్చు.




