EPF: పీఎఫ్ వ‌డ్డీపై చాలా మందిలో ఉండే అపోహ ఇదే.. ఏడాదికి ఒక్క‌సారే ఎందుకు జ‌మ అవుతుంది.?

EPF: ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎక్కువగా ఆధారపడే పొదుపు పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి.

Mokshith
Published on: 12 July 2026 1:25 PM IST
EPF
X

EPF: పీఎఫ్ వ‌డ్డీపై చాలా మందిలో ఉండే అపోహ ఇదే.. ఏడాదికి ఒక్క‌సారే ఎందుకు జ‌మ అవుతుంది.?

EPF: ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎక్కువగా ఆధారపడే పొదుపు పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ ఇవ్వడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రక్రియ ప్రారంభించింది. దీంతో చాలా మంది ఉద్యోగుల్లో ఒక సందేహం తలెత్తుతోంది. ప్రతి నెలా వడ్డీ లెక్కిస్తే, అది ప్రతి నెలా పాస్‌బుక్‌లో ఎందుకు కనిపించదు? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి నెలా వడ్డీ లెక్కిస్తారు.. కానీ జమ మాత్రం ఏడాదికి ఒక్కసారే

చాలా మంది EPFపై వచ్చే 8.25 శాతం వార్షిక వడ్డీని నెలవారీగా ఖాతాలో జమ చేస్తారని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. EPFO ప్రతి నెలా మీ EPF ఖాతాలో ఉన్న మొత్తంపై వడ్డీని లెక్కిస్తుంది. అయితే ఆ వడ్డీని వెంటనే మీ ఖాతాలో జమ చేయదు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని లెక్కించి, సంవత్సరం పూర్తయ్యాక ఒకేసారి మీ EPF ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. అందుకే మధ్యలో EPF పాస్‌బుక్ చూసినప్పుడు వడ్డీ కనిపించకపోయినా, మీ డబ్బుపై ప్రతి నెలా వడ్డీ లెక్కింపు కొనసాగుతూనే ఉంటుంది.

ఉదాహరణకు ఏప్రిల్ 1న మీ EPF ఖాతాలో రూ.5 లక్షలు ఉన్నాయని అనుకుందాం. మీరు, మీ సంస్థ కలిసి ప్రతి నెలా రూ.10,000 EPF ఖాతాలో జమ చేస్తున్నారని అనుకుంటే.. ఏప్రిల్ నెలలో వడ్డీ రూ.5 లక్షలపై లెక్కిస్తారు. మే నెలలో మరో రూ.10,000 జమ కావడంతో మొత్తం పెరుగుతుంది. ఇప్పుడు వడ్డీ పెరిగిన మొత్తంపై లెక్కిస్తారు.

ఇదే విధంగా ప్రతి నెలా కొత్త జమలు చేరడంతో EPF బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. దీంతో ప్రతి నెలా వడ్డీ లెక్కించే మొత్తం కూడా క్రమంగా పెరుగుతుంది.

కంపౌండింగ్ వల్లే EPFలో సంపద వేగంగా పెరుగుతుంది

EPFలో ఉన్న మరో ముఖ్యమైన ప్రయోజనం చక్రవడ్డీ (Compounding). మీరు, మీ సంస్థ కలిసి ఏడాదికి రూ.1.20 లక్షలు జమ చేస్తే, వడ్డీ కేవలం ప్రారంభ బ్యాలెన్స్‌పైనే కాకుండా ప్రతి నెలా పెరుగుతున్న మొత్తంపై కూడా లెక్కిస్తారు. అంటే ప్రతి నెలా కొత్తగా జమ అయ్యే డబ్బు కూడా వెంటనే వడ్డీ లెక్కింపులో చేరుతుంది. ఈ విధంగా పెట్టుబడి మొత్తం క్రమంగా పెరుగుతూ ఉండటంతో, దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో నిధి ఏర్పడుతుంది.

రిటైర్మెంట్ కోసం EPF ఎందుకు మంచి ఎంపిక?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, EPF ఇప్పటికీ దేశంలో అత్యంత విశ్వసనీయమైన రిటైర్మెంట్ పొదుపు పథకాలలో ఒకటి. ప్రస్తుతం 8.25 శాతం వార్షిక వడ్డీ లభించడం. ఉద్యోగితో పాటు యజమాని కూడా EPFలో డబ్బు జమ చేయడం. పన్ను ప్రయోజనాలు లభించడం. దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో పెద్ద మొత్తంలో నిధి ఏర్పడటం వంటి లాభాలు దీంట్లో ఉంటాయి. 25 నుంచి 30 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా EPFలో చందా చెల్లిస్తే, పదవీ విరమణ సమయానికి మంచి కార్పస్‌ను సృష్టించుకోవచ్చు.

ఉద్యోగులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

EPF ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగి తరచూ తన EPF పాస్‌బుక్‌ను పరిశీలించడం మంచిది. సంస్థ ప్రతి నెలా EPF చందాను సకాలంలో జమ చేస్తోందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సంస్థ ఆలస్యంగా చందా జమ చేస్తే, ఆ మొత్తంపై వడ్డీ లెక్కింపు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. EPF వడ్డీ ప్రతి నెలా పాస్‌బుక్‌లో కనిపించకపోయినా, మీ డబ్బుపై వడ్డీ లెక్కింపు మాత్రం ప్రతి నెలా కొనసాగుతుంది. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యాక మొత్తం వడ్డీని ఒకేసారి ఖాతాలో జమ చేస్తారు. అందుకే EPFను దీర్ఘకాలిక రిటైర్మెంట్ పొదుపుకు అత్యంత విశ్వసనీయమైన పథకాలలో ఒకటిగా చెప్తారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story