ఉద్యోగం మానేసిన తర్వాత PFపై ఎంతకాలం వడ్డీ వస్తుంది? EPFO నిబంధనలు ఇవే

EPFO: ఉద్యోగం మారినప్పుడు లేదా ఉద్యోగాన్ని పూర్తిగా మానేసినప్పుడు పాత PF ఖాతాలోని డబ్బు గురించి చాలామంది పట్టించుకోరు.

Mokshith
Published on: 27 Nov 2026 5:49 PM IST
EPFO
X

ఉద్యోగం మానేసిన తర్వాత PFపై ఎంతకాలం వడ్డీ వస్తుంది? EPFO నిబంధనలు ఇవే

EPFO: ఉద్యోగం మారినప్పుడు లేదా ఉద్యోగాన్ని పూర్తిగా మానేసినప్పుడు పాత PF ఖాతాలోని డబ్బు గురించి చాలామంది పట్టించుకోరు. కొత్తగా ఎలాంటి నగదు జమ కాకపోయినా ఆ ఖాతాలో వడ్డీ వస్తుందా? మూడేళ్ల తర్వాత వడ్డీ నిలిచిపోతుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగం మానేసిన తర్వాత PFపై ఎప్పటివరకు వడ్డీ వస్తుంది?

EPF పథకం 1952లోని పేరాగ్రాఫ్ 72(6) ప్రకారం, ప్రతి ఒక్కరికీ మూడేళ్ల నిబంధన ఒకేలా వర్తించదు. ఉద్యోగి 55 ఏళ్లలోపు ఉద్యోగాన్ని వదిలేస్తే, పాత PF ఖాతాలో కొత్తగా డబ్బులు జమ కాకపోయినా 58 ఏళ్ల వయసు వచ్చే వరకు వడ్డీ జమ అవుతుంది. అదే 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో ఉద్యోగం నుంచి రిటైర్ అయితే, చివరిసారిగా PFలో డబ్బులు జమ అయిన తర్వాత 36 నెలల వరకు వడ్డీ లభిస్తుంది. ఉదాహరణకు.. ఒక వ్యక్తి 58 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యి PF డబ్బులు విత్‌డ్రా చేయకపోతే, మరో మూడేళ్ల పాటు అంటే 61 ఏళ్ల వయసు వరకు వడ్డీ పొందవచ్చు. ఆ తర్వాత ఆ ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది. వడ్డీ జమ కావడం కూడా నిలిచిపోతుంది.

ఈ నాలుగు సందర్భాల్లో PF ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది

EPFO నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో PF ఖాతాను ఇన్‌ఆపరేటివ్‌ (నిరుపయోగంగా ఉన్న ఖాతా)గా పరిగణిస్తారు. అవేంటంటే..

55 ఏళ్లు దాటిన తర్వాత రిటైర్మెంట్: ఉద్యోగి 55 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసులో రిటైర్ అయిన తర్వాత 36 నెలల వరకు PF మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోతే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది.

విదేశాల్లో శాశ్వత నివాసం: ఒక వ్యక్తి శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోయి, 36 నెలల పాటు PF ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరగకపోతే ఈ నిబంధన వర్తిస్తుంది.

ఖాతాదారుడి మరణం: PF ఖాతాదారుడు మరణించిన తర్వాత 36 నెలల్లోగా నామినీ లేదా చట్టబద్ధ వారసులు డబ్బుల కోసం క్లెయిమ్ చేయకపోతే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది.

బ్యాంకు వివరాల్లో సమస్యలు: బ్యాంకు ఖాతా తప్పుగా ఉండటం లేదా మూసివేయడం వల్ల PF సెటిల్‌మెంట్ డబ్బులు తిరిగి వచ్చి, 36 నెలల వరకు ఎవరూ క్లెయిమ్ చేయకపోతే ఆ మొత్తం అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటుంది.

ఇన్‌ఆపరేటివ్ PF ఖాతాలోని డబ్బులను ఎలా తీసుకోవాలి?

PF ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారినంత మాత్రాన అందులోని డబ్బులు పోయినట్లు కాదు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి ఖాతాదారుడు లేదా నామినీ ఆ మొత్తాన్ని పొందవచ్చు. ఇందుకోసం పరిస్థితిని బట్టి వేర్వేరు ఫారాలు సమర్పించాలి.

ఫారం 19: PF ఖాతాలోని పూర్తి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఫారం 13: పాత PF ఖాతాలోని డబ్బులను కొత్త PF ఖాతాలోకి బదిలీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

ఫారం 20: PF ఖాతాదారుడు మరణించినప్పుడు, నామినీ లేదా చట్టబద్ధ వారసులు డబ్బులను క్లెయిమ్ చేయడానికి ఈ ఫారం సమర్పించాలి.

అవసరమైన పత్రాలు, వివరాలను పరిశీలించిన తర్వాత EPFO క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది. ఆ తర్వాత డబ్బులు ఖాతాదారుడి KYC ధ్రువీకరించిన బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి.

పాత PF ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడం ఎలా?

పాత PF ఖాతాలోని డబ్బులను తీసుకోవాలంటే ముందుగా EPFO మెంబర్ పోర్టల్ లేదా UMANG యాప్‌లో మీ UAN వివరాలను పరిశీలించాలి. అనంతరం ఆధార్, PAN, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు KYC సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. అలాగే మీరు ఉద్యోగం మానేసిన తేదీ (Date of Exit) సరిగ్గా నమోదైందో లేదో చూసుకోవాలి. మీకు UAN లేకపోయినా లేదా భద్రతా కారణాలతో ఖాతా బ్లాక్ అయినా EPFO స్థానిక కార్యాలయాన్ని సంప్రదించి గుర్తింపు ధ్రువీకరణ చేయించుకోవచ్చు. 'నిధి ఆప్కే నికట్ 2.0' కార్యక్రమంలోనూ సహాయం పొందవచ్చు.

మీరు గతంలో పనిచేసిన సంస్థ కొనసాగుతున్నట్లయితే, KYC వివరాలను ధ్రువీకరించడంలో యాజమాన్యం సహకరించాలి. సాధారణంగా ఈ ప్రక్రియకు 15 రోజుల గడువు ఉంటుంది. ఒకవేళ ఆ కంపెనీ మూతపడితే EPFO స్థానిక కార్యాలయం ద్వారా ధ్రువీకరణ చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫారం 19 లేదా ఫారం 13 ద్వారా డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా బదిలీ చేసుకోవచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.